కన్నీరే తోడుగా..

Family Faced With Coronavirus Old Women Stand Under Steps Prakasam - Sakshi

కుటుంబ సభ్యులంతా కరోనాతో ఆస్పత్రిలో..

ఇంటి మెట్ల కింద దిక్కుతోచని స్థితిలో వృద్ధురాలు

108లో రిమ్స్‌కు తరలింపు..

ప్రకాశం, సింగరాయకొండ: కరోనా...అయినవారందరూ ఉన్నా దిక్కులేని వారిని చేస్తోంది. కుటుంబంలో అందరికీ కరోనా సోకి ఆస్పత్రికి వెళ్తే.. ఓ వృద్ధురాలు దిక్కుతోచని స్థితిలో రెండు రోజుల పాటు ఇంటి మెట్ల కింద వర్షంలో తడుస్తూ ఉండిపోయింది. ఇటీవల హైదరాబాద్‌లో నివసిస్తున్న ఒక కుటుంబంతన స్వగ్రామమైన బింగినపల్లికి వచ్చింది. వీరిలో ఒక వృద్ధురాలితో పాటు ఆమె కొడుకు, కోడలు, మనవడు ఉన్నారు. వీరు ఇక్కడికి వచ్చే సమయానికే వృద్ధురాలికి తప్ప మిగతా ముగ్గురికి కరోనా పాజిటివ్‌ ఉంది. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిల్లో చేర్చుకోకపోవడంతో బింగినపల్లికి వచ్చి ఒంగోలులోని ప్రైవేటు ఆస్పత్రిలో చేరేందుకు ప్రయత్నించగా వారు చేర్చుకోలేదు. దీంతో రెండు రోజుల క్రితం ఈ ముగ్గురు నెల్లూరు వెళ్లి నారాయణ ఆస్పత్రిలో చేరారు.

వృద్ధురాలిని తమతోపాటు తీసుకెళ్లలేక ఇంటి బయట మెట్ల కింద ఉంచి వెళ్లారు. ఆమె క్యాన్సర్‌ పేషంట్, నడవలేదు. తాము కరోనాతో నెల్లూరులో చికిత్స పొందుతున్నామంటూ కొడుకు గ్రామస్తులకు సమాచారం ఇచ్చాడు. దీంతో స్థానిక అధికారులు వచ్చి వృద్ధురాలికి కూడా కరోనా పరీక్ష చేసేందుకు శాంపిల్‌ తీసుకెళ్లారు. దాని రిజల్ట్‌ రావాల్సి ఉంది. అయితే ఈ రెండు రోజుల నుంచి ఆ వృద్ధురాలు ఇంటి మెట్ల కిందే ఉండిపోయింది. ఆమె దగ్గరకు వెళ్లేందుకు ఎవరూ సాహసించలేదు. ఆమె బాధ చూడలేని చుట్టుపక్కల వారు కర్ర సహాయంతో భోజనం అందించారు. వర్షానికి తడుస్తూ కుమిలిపోతున్న వృద్ధురాలి దీనస్థితిని చూసి చలించిన గ్రామస్తులు ఉన్నతాధికారులకు తెలిపి ఆదివారం 108 వాహనంలో రిమ్స్‌కు పంపే ఏర్పాట్లు చేశారు. అయితే 108 వాహనంలో ఒక్కరే రావడంతో ఆ వృద్ధురాలిని వాహనం ఎక్కించేందుకు సహాయం చేయాలని గ్రామస్తులను కోరినా ఎవరూ ముందుకు రాలేదు. దీంతో సుమారు 4 గంటల పాటు వాహనం ఇంటి వద్దే ఉండిపోయింది. చివరకు వైద్య సిబ్బంది వచ్చి వృద్ధురాలిని అంబులెన్స్‌ ఎక్కించి రిమ్స్‌కు తరలించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top