ఫోర్జరీ సంతకంతో లక్ష గోల్‌మాల్‌

 families lose Rs 1 lakh through forged signature - Sakshi

సంతమాగులూరు:   ఫోర్జరీ సంతకంతో డ్వాక్రా మహిళలకు సంబంధించిన లక్ష రూపాయలు గోల్‌మాలైన సంఘటన మండలంలోని మిన్నెకల్లులో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు.. గ్రామంలోని లక్ష్మీ తిరుపతమ్మ గ్రూపునకు చెందిన తన్నీరు అంజమ్మ, రాణిలు గ్రూపు లీడర్లుగా పనిచేస్తున్నారు. గ్రూపులోని మిగిలిన ఎనిమిది మంది సభ్యులకు తెలియకుండా తంగేడుమల్లి సిండికేట్‌ బ్యాంకులో లక్ష రూపాయలు తమ సొంత ఖర్చులకు వాడుకున్న విషయం బయటపడింది. ఇటీవల మిగిలిన ఎనిమిది మంది సభ్యులు రుణం కోసం బ్యాంకుకు వెళ్లారు.

 ఇటీవల రుణం తీసుకున్నారని.. మళ్లీ రుణం కోసం ఎందుకు వచ్చారంటూ మేనేజర్‌ ప్రశ్నించారు. దీంతో లీడర్ల అక్రమం బయట పడింది. అంతా కలిసి అధికారులను ప్రశ్నించేందుకు వెలుగు కార్యాలయానికి వెళ్లారు. అక్కడ ఎవరూ లేకపోవడంతో ధర్నా చేశారు. అనంతరం ఎంపీడీవో రాజశేఖర్‌ ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. సభ్యులను లీడర్లు మోసం చేయడం అన్యాయమన్నారు. తమకు న్యాయం చేసేంత వరకూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. తక్షణమే తమకు రుణం మంజూరు చేయాలని కోరారు. రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని ఎంపీడీవో వారికి హామీ ఇచ్చారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top