సోషల్‌ మీడియా బృందం హల్‌చల్‌

Fake Survey Team Caught in Guntur - Sakshi

సర్వే పేరుతో వివరాలు సేకరిస్తున్న బృందం సభ్యులు

అడ్డుకున్న స్థానికులు

పోలీసులకు అప్పగించిన వైనం

గుంటూరు, పిడుగురాళ్ల: గ్రామాల్లో సర్వే పేరుతో సోషల్‌ మీడియా బృందం హల్‌చేస్తూ స్థానికులను ఆందోళనకు గురి చేస్తున్నారు. ఈ కోవలోనే పిడుగురాళ్ల మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సోషల్‌ మీడియా పేరుతో సర్వే చేస్తున్న కొంతమంది వ్యక్తులను స్థానికులు అడ్డుకుని పోలీసులకు పట్టించారు. తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, వరంగల్‌ వంటి పట్టణాల నుంచి సుమారు 60 మంది బృందం గురజాల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆ వ్యక్తులు తెలుపుతున్నారు. సోషల్‌ పోస్టు ప్రొఫెషనల్‌ సర్వీసు పేరుతో వారి వద్ద గుర్తింపు కార్డులు ఉన్నాయి. అయితే గుర్తింపు కార్డులు 30.11.2018 గడువు వరకే ఉన్నాయి. కాలం చెల్లిన గుర్తింపు కార్డులతో గ్రామాల్లో సర్వే నిర్వహిస్తుండటంతో కొంతమంది యువకులు అడ్డుకున్నారు. లీడర్‌షిప్‌ సర్వే అన్న ఒక ప్రొఫార్మాలో మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ ఎంపీపీలు, న్యాయవాదులు, కుల సంఘాల నాయకులు, స్వచ్ఛంద సేవా ప్రతినిధులు, గ్రామాల్లో నివాసముండే ప్రభుత్వ ఉపాధ్యాయులు, టీడీపీ, వైఎస్సార్‌ సీపీ నాయకులు, జనసేన నాయకుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు. 

సమాచారం తెలుసుకున్న వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెడ్పీటీసీ వీరభద్రుని రామిరెడ్డి, ఎంపీటీసీ ఫ్లోర్‌ లీడర్‌ తాటికొండ చిన ఆంజనేయులురెడ్డి, పట్టణ, మండల వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు చింతా వెంకట రామారావు, చల్లా పిచ్చిరెడ్డితో పాటు పలువురు నాయకులు సీఐను కలసి ఇటువంటి తప్పుడు సర్వే బృందాలు వచ్చి వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లను గల్లంతు చేస్తున్నారని, ఇటీవల విడుదలైన ఓటర్ల జాబితాలో వైఎస్సార్‌ సీపీ సానుభూతిపరుల ఓట్లే గల్లంతయ్యాయని తెలిపారు. సమగ్ర విచారణ చేపట్టి వారిపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇచ్చారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top