నకిలీల గోల

Fake Insurance Documents in SPSR Nellore RTA Office - Sakshi

రవాణాశాఖలో నకిలీ ఇన్సూరెన్స్‌ పత్రాల జారీ

కొంతమంది ఏజెంట్ల చేతివాటం

వాహనాన్ని బట్టి నకిలీ పత్రానికి ఒక్కో ధర

రవాణాశాఖలో నకిలీ ఇన్సూరెన్స్‌ల వ్యాపారం జోరుగా సాగుతోంది. నకిలీ బీమా పత్రాల వ్యవహారంలో ఆ శాఖ అధికారులు, ప్రైవేట్‌ ఏజెంట్లు చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. ఆన్‌లైన్లో పత్రాలు అప్‌లోడ్‌ చేసే విషయం కొంతమంది బీమా, రవాణా ఏజెంట్లకు కలసివస్తోంది. ఫిట్‌నెస్, ట్రాన్స్‌ఫర్‌ సెక్షన్లలో పనిచేసే ఉద్యోగులతో అనధికార ఒప్పందం చేసుకుని నకిలీ పత్రాలతో జేబులు     నింపుకుంటున్న పరిస్థితి ఉంది. రవాణాశాఖలో నకిలీల వ్యవహారం గత ఎస్పీ దృష్టికి వెళ్లింది. తనిఖీలు జరుగుతాయన్న సమయంలో ఆయన బదిలీ అయ్యారు. దీంతో వీరి ఆగడాలకు అడ్డే లేకుండా పోయింది. ఇటీవల పొట్టేపాళేనికి చెందిన ట్రాక్టర్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందడంతో  సొంతంగా డబ్బులు ఇచ్చి సెటిల్‌ చేసుకున్నారు. ఈ ట్రాక్టర్‌కు నకిలీ బీమా పత్రం ఉంది.  ఈ రీతిలో నకిలీ పత్రాలతో ప్రయానించే సమయంలో ప్రమాదం జరిగితే వాహనాల యజమానులతోపాటు గాయపడిన వ్యక్తులు   తీవ్రంగా నష్టపోవాల్సి వస్తోంది.

ఒక్కో ధర..
నకిలీ ఇన్సూరెన్స్‌ పత్రాలు ఇచ్చేందుకు కొంతమంది బీమా, రవాణా శాఖ ఏజెంట్లు ముందు వరుసలో ఉన్నారు. వీరితో పాటు రవాణా కార్యాలయం సమీపంలో ఓ మహిళా ఏజెంట్‌ కూడా నకిలీ ఇన్సూరెన్స్‌ పత్రాలు ఇస్తున్నట్లు తెలిసింది. బీమా సంస్థకు ఇన్సూరెన్స్‌ చెల్లించాలంటే ఎక్కువ ధర ఉండడంతో ఎక్కువ మంది వాహనదారులు నకిలీ పత్రాలు తీసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు. ఎక్కువగా ఆటో, బైక్, ఎల్‌జీవీ, ట్రాక్టర్‌ యజమానులు నకిలీ ఇన్సూరెన్స్‌ పత్రాలు తీసుకుంటున్నట్లు సమాచారం. బైక్‌కు రూ.200 నుంచి రూ.300, ఆటోకు రూ.1500, లైట్‌ గూడ్స్‌ వెహికల్‌కు రూ.4,000, ట్రాక్టర్‌కు రూ.500 నుంచి రూ.1,000లు తీసుకుని నకిలీ ఇన్సూరెన్స్‌ పత్రాలు ఇస్తున్నారు. ప్రధానంగా హెచ్‌బీఎఫ్‌సీ, ఫ్యూచర్‌ జనరల్, జీఓ డిజిట్, ఇస్కోటోక్యో, శ్రీరామ్‌ తదితర కంపెనీల మీద కొంతమంది ఏజెంట్లు నకిలీ పత్రాలు ఇస్తున్నట్లు తెలిసింది. నకిలీ ఇన్సూరెన్స్‌ పత్రాల జారీలో ఆటో ఫైనాన్స్‌ కంపెనీలు ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయి.

నెల్లూరు(టౌన్‌):  ఆర్టీఏ నిబంధనల ప్రకారం ప్రతి వాహనానికి ప్రతి ఏటా ఇన్సూరెన్స్‌ చెల్లించాల్సి ఉంది. ఇన్సూరెన్స్‌ చెల్లిస్తేనే ఆ వాహనంపై లావాదేవీలను జరుపుతారు. వాహనాలకు ఇన్సూరెన్స్‌ పత్రాలు ఇచ్చేందుకు పదుల సంఖ్యలో బీమా సంస్థలు ఉన్నాయి. ఏడాదికి ద్విచక్ర వాహనానికి రూ.1,400, ఆటోకు రూ.7,851లు, లైట్‌ గూడ్స్‌ వెహికల్‌కు రూ.18,600, ట్రాక్టర్‌కు రూ.14,500, లారీకి రూ. 35,000 ఇన్సూరెన్స్‌చెల్లించాల్సి ఉంది. వీటితో పాటు పలు ట్రాన్స్‌పోర్ట్, నాన్‌ ట్రాన్స్‌పోర్ట్‌ వాహనాలకు ప్రతి ఏటా ఇన్సూరెన్స్‌ చెల్లించాల్సి ఉంటుంది. ప్రమాదం జరిగిన సమయంలో వాహనం, వాహన యజమానికి, బయట వ్యక్తులు గాయపడిన సమయంలో సంస్థ నిబంధనలు ప్రకారం బీమాను వర్తింపజేస్తారు. 

కలసివస్తున్న ఆన్‌లైన్‌ విధానం
రెండేళ్ల క్రితం రవాణాశాఖలో 80కు పైగా సేవలను ఆన్‌లైన్‌ చేశారు. దీంతో మీసేవ, ఏపీఆన్‌లైన్, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ తదితర వాటిల్లో ఆన్‌లైన్‌ సేవలు నిర్వహిస్తున్నారు. అయితే వాహన లావాదేవీలకు సంబంధించి పత్రాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ప్రధానంగా ఫిట్‌నెస్, వాహన ట్రాన్స్‌ఫర్ల సమయంలో తప్పనిసరిగా ఇన్సూరెన్స్‌ ఉండాల్సిందే. ఆన్‌లైన్‌ విధానం కావడంతో ఒరిజనల్‌ పత్రాలను చూసే పరిస్థితి రవాణా అధికారులకు ఉండదు. అనుమానం వస్తే తప్పనిసరిగా విచారణ చేయాలి. అదేం లేకుండా నకిలీ పత్రాన్ని ఓకే చేసినందుకు సంబంధిత గుమస్తా, ఏఓ, ఆర్టీఓకు రూ.300 నుంచి రూ.700 వరకు ముట్టజెప్పాల్సి ఉంటుందని సమాచారం. 

ప్రమాదం జరిగితే అంతే..
నకిలీ ఇన్సూరెన్స్‌లు ఉన్న వాహనాలు ప్రమాదాలకు గురైతే ఒక్కపైసా కూడా రాదు. పైగా ప్రమాదంలో వాహన యజమాని, లేదా బయట వ్యక్తి గాయపడినా, మృతి చెందినా బీమా సంస్థ నుంచి రూపాయి కూడా అందదు. ఇటీవల పొట్టేపాళేనికి చెందిన ట్రాక్టర్‌ ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. నకిలీ ఇన్సూరెన్స్‌ పత్రం కావడంతో మరణించిన వ్యక్తికి రూ.7 లక్షలు ఇచ్చి సెటిల్‌ చేసుకున్నారు. అయితే దెబ్బతిన్న ట్రాక్టర్‌ను యజమానే సొంత డబ్బులతో రిపేరు చేయించుకున్నారు. అదే ఒరిజనల్‌ ఇన్సూరెన్స్‌ పత్రం కలిగి ఉంటే వాహనంతో పాటు మరణించిన వ్యక్తికి సంస్థ నుంచి నగదు వచ్చేది. ఇప్పటికీ నకిలీ బీమా పత్రాలు కలిగి ప్రమాదాలు జరిగి పలు వాహనాల మీద కేసులు నడుస్తున్నాయి. నకిలీ బీమా పత్రాల మీద గత ఎస్పీకి కొంతమంది ఇన్సూరెన్స్‌ కంపెనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. తనిఖీలు జరుగుతాయన్న సమయంలో ఆయన బదిలీ అయ్యారు. ఇప్పటికైనా నకిలీ బీమా పత్రాలపై పూర్తి స్థాయిలో విచారణ చేపడితే పలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇన్సూరెన్స్‌ కంపెనీప్రతినిధులతో సమావేశం
నకిలీ ఇన్సూరెన్స్‌లకు సంబంధించి ఆయా బీమా కంపెనీ ప్రతినిధులతో వచ్చేవారం సమావేశం నిర్వహిస్తాం. ఇన్సూరెన్స్‌ పత్రానికి సంబంధించి క్యూ ఆర్‌ను పరిశీలిస్తున్నాం. ఇప్పటి నుంచి నకిలీ ఇన్సూరెన్స్‌ పత్రాలపై పూర్తి స్థాయిలో దృష్టి పెడతాం. పట్టుబడ్డ వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాం.–సుబ్బారావు, రవాణా శాఖఉప కమిషనర్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top