నకిలీ డాక్టర్.. దొంగ బంగారం | Sakshi
Sakshi News home page

నకిలీ డాక్టర్.. దొంగ బంగారం

Published Sun, Feb 21 2016 12:47 AM

fake doctor arrested

తణుకు : సరిగ్గా పది నెలల క్రితం పట్టణంలో సుమ క్లినిక్ పేరుతో ఆసుపత్రి నిర్వహించిన వాసపల్లి నల్లయ్య అలియాస్ నరేంద్రకుమార్ భాగోతం బయట పడిన సంగతి తెలిసిందే. కేవలం తొమ్మిదో తరగతి చదివిన ఒక వ్యక్తి డాక్టర్ బొల్లినేని శ్రీకాంత్‌గా అవతారం ఎత్తి 10 ఏళ్లపాటు ప్రజలను, వైద్యులను, జిల్లా అధికారులను మోసం చేసిన ఈ వ్యవహారం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకిత్తించింది. దీంతో ఇదే కోవలో జిల్లాలో ప్రాక్టీస్ చేస్తున్న మరికొందరు నకిలీ డాక్టర్ల భాగోతం బట్టబయలైంది. అయితే ఇప్పుడు మరోసారి నకిలీ డాక్టర్ శ్రీకాంత్ వ్యవహారంలో మరోకోణం బయట పడింది. నకిలీ డాక్టర్‌గా ప్రజలను మోసం చేసిన కేసులో జైలు జీవితం గడిపిన శ్రీకాంత్ ఆ సమయంలో తోటి ఖైదీలతో సంబంధాలు ఏర్పరచుకుని వారితో సాన్నిహిత్యం పెంచుకున్న కోణం వెలుగు చూసింది. ఈ నేపథ్యంలో శ్రీకాంత్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రదేశంలో విచారిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం.
 
 భిన్నకోణాలు...
 శ్రీకాంత్ వ్యవహారంలో భిన్న కోణాలు బయట పడుతున్నాయి. తాజాగా పైడిపర్రు గ్రామానికి చెందిన పాత నేరస్తుడు తాను దొంగతనం చేసిన బంగారాన్ని శ్రీకాంత్ వద్ద ఉంచినట్టు  విచారణలో తేలడంతో ఇప్పుడు మరోసారి ఈ వ్యవహారం తెరపైకి వచ్చింది. గతంలో పలు చోరీల్లో నిందితుడిగా ఉన్న పైడిపర్రు పాత నేరస్తుడు ఇటీవలి కాలంలో రాజమండ్రి, తణుకు ప్రాంతాల్లో తాళం వేసి ఉన్న ఇళ్లలో చోరీ చేసి పెద్ద ఎత్తున బంగారాన్ని దోచుకెళ్లాడు. గతంలో పలు పర్యాయాలు జైలు శిక్ష అనుభవించిన ఈ నిందితుడు గతేడాది మే నెలలో రాజమండ్రి కారాగారంలో శిక్ష అనుభవించాడు.

ఆ సమయంలో అదే జైలులో శిక్ష అనుభవించిన నకిలీ డాక్టర్ శ్రీకాంత్ నేరస్తులతో చేయి కలిపినట్టు సమాచారం. బెయిల్‌పై బయటకు వచ్చిన అనంతరం వీరిద్దరూ చేయి కలిపినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. చోరీ చేసిన సుమారు 20 కాసుల బంగారాన్ని శ్రీకాంత్‌కు ఇచ్చినట్లుగా పోలీసుల విచారణలో నిందితుడు అంగీకరించినట్లు తెలుస్తోంది. దీంతో డాక్టర్ శ్రీకాంత్‌ను మరోసారి అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ విషయమై పోలీసులు నోరు మెదపడంలేదు. పూర్తిస్థాయిలో విచారించిన అనంతరం వాస్తవాలు వెల్లడిస్తామని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ పోలీసు అధికారి చెప్పారు.

 

Advertisement
Advertisement