టీడీపీ వచ్చాకే పెరిగిన ఫాక్షన్


టీజీ వెంకటేష్.. కాంగ్రెస్ జోలికొస్తే ఖబడ్దార్



సాక్షి ప్రతినిధి, కర్నూలు: రాష్ట్రంలో టీడీపీ అధికారం చేపట్టాక కర్నూలు జిల్లాలో ఫ్యాక్షన్ ఎక్కువైందని కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాలో ఎంత మందిని చంపించావో తెలియదా? అని కేఈ కృష్ణమూర్తిని బహిరంగంగానే ప్రశ్నించారు. కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన జిల్లా కాంగ్రెస్ కమిటీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.

 

కాంగ్రెస్ నాయకుడు చెరుకులపాడు నారాయణరెడ్డిపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని, అతనికి ఏదైనా జరిగితే అందుకు బాధ్యులు కేఈ సోదరులేనన్నారు. అదే విధంగా కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి భయపెడుతున్నారని, అందుకు భయపడేది లేదన్నారు. ఫ్యాక్షన్‌ను రెచ్చగొడుతున్నా తాము భయపడే సమస్యే లేదన్నారు.

 

కేడీసీసీబీ చైర్మన్ పదవి కోసం సిగ్గులేకుండా కాంగ్రెస్ పార్టీకి చెందిన డెరైక్టర్లకు ఒక్కొక్కరికి రూ.10 లక్షలు ఇచ్చి కొంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో కేడీసీసీబీ చైర్మన్ పదవిని వదులుకోబోమని పేర్కొన్నారు. మాజీ మంత్రి టీజీ వెంకటేష్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ జోలికొస్తే ఖబడ్దార్ అని హెచ్చరించారు. ఎవరైనా సరే ఊరుకునేది లేదని టీజీ, కేఈలనుద్దేశించి అన్నారు.

 

ఇసుక, గనులను దోచుకుంటున్నారు..

జిల్లాలో ఉన్న ఇసుక, గనులను కేఈ సోదరులు దోచుకుంటున్నారని కోట్ల ధ్వజమెత్తారు. ప్రభుత్వం నుంచి లెసైన్సులు ఉన్నా.. దౌర్జన్యంగా వాటిని లాక్కుంటున్నారని విమర్శించారు. అధికారులను బెదిరిస్తున్నారన్నారు. టీడీపీ ప్రభుత్వం జిల్లా ప్రజల చెవిలో పువ్వు పెట్టిందని ఎద్దేవా చేశారు. గుండ్రేవుల, వేదావతి, పలు ఎత్తిపోతల పథకాలన్నీ కాంగ్రెస్ ప్రారంభించినవేనని గుర్తు చేశారు. టీడీపీ ఉంటే జిల్లా నాశనమై పోతుందని కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.

 

ఇంకా ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ  జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, ఎమ్మెల్సీ సుధాకర్‌బాబు టీడీపీపై ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్మన్ ఆకెపోగు వెంకటస్వామి, చెరుకులపాడు నారాయణరెడ్డి, అహ్మద్ అలీఖాన్, శ్రీశైలం నియోజక వర్గ ఇన్‌చార్జ్ షబానా తదితరులు పాల్గొన్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top