లక్షలు ఖర్చుపెట్టా.. వసూలు చేయండి!

Excise Prohibition Officer Ordered His Staff  To Get Money In Guntur - Sakshi

సాక్షి, గుంటూరు : ‘గత ప్రభుత్వంలో రూ.లక్షలు ఖర్చుపెట్టి పోస్టింగ్‌ తెచ్చుకున్నా.. ఆ నగదు మీరే వసూలు చేసి పెట్టాలి’ అంటూ జిల్లా స్థాయి ఎక్సైజ్‌ అధికారి సిబ్బందికి హుకుం జారీ చేయడంతో ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సిబ్బంది హడలిపోతున్నారు. సుమారు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు ఎక్కడ వసూలు చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. కొత్త ప్రభుత్వం నిబంధనలు కఠినతరం చేయడంతో అయోమయంలో పడ్డారు. ఆ అధికారి వద్దకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు. దీనిపై ఎక్సైజ్‌ శాఖలో జోరుగా చర్చ సాగుతోంది.

బదిలీల హడావుడి 
ప్రస్తుతం ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ శాఖలో బదిలీలు నడుస్తున్నాయి. గుంటూరు నగరంలో 1–టౌన్, 2–టౌన్‌ ఎక్సైజ్‌ స్టేషన్‌లు, ఈఎస్‌ టాస్క్‌ఫోర్స్, డిస్టిక్‌ కంట్రోల్‌ రూమ్‌ అనే విభాగాలు ఉన్నాయి. ఈ మూడు విభాగాల్లో సుమారు 30 వరకూ సీఐలు, ఎస్సైలు, హెడ్‌ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు పనిచేయడానికి వీలుంటుంది. గుంటూరు నగరంలో పోస్టింగ్‌ కోసం ప్రయత్నిస్తున్నవారందరూ ఎక్సైజ్‌ స్టేషన్‌లు, టాస్క్‌ఫోర్స్‌లకే ఎక్కువ శాతం మొగ్గు చూపుతున్నట్టు సమాచారం. ఈ పోస్టింగ్‌ల కోసం సుమారు వంద వరకూ సిబ్బంది పోటీ పడుతున్నట్టు తెలుస్తోంది.

ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో ఎనిమిది మంది కానిస్టేబుళ్లు, ముగ్గురు సీఐలు, నలుగురు ఎస్సైలకు అవకాశం ఉంటుంది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పనిచేసే సిబ్బంది జిల్లా వ్యాప్తంగా తిరుగుతూ బెల్టుషాప్‌లు, సార తయారీ, విక్రయ కేంద్రాలు, ఎమ్మార్పీ ఉల్లంఘనలు, ఇతరత్ర ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ ఉల్లంఘనలపై తనిఖీలు నిర్వహిస్తూ ఉంటారు. జిల్లా స్థాయి వేధింపులకు భయపడి ఎన్‌ఫోర్స్‌మెంట్‌లో పోస్టింగ్‌కు ఎవ్వరు ముందుకు రావడం లేదని సిబ్బంది చర్చించుకుంటున్నారు. 

తగ్గిన ఉల్లంఘనలు..
నూతనంగా ఏర్పాటైన వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వం మద్యం షాపులు, బార్‌లకు నిబంధనలు కఠినతరం చేసింది. దీంతో గత ప్రభుత్వంలో వచ్చినంతగా అక్రమ సంపాదన క్షేత్రస్థాయిలో రావడం లేదు. దీంతో జిల్లా అధికారికి డబ్బు వసూళ్లు చేసిపెట్టడానికి సిబ్బంది నానా అవస్థలు పడాల్సి వస్తోంది. డబ్బు వసూలు కావడం లేదని చెప్పినప్పటికీ ఆ అధికారి అర్థం చేసుకోకుండా వేధింపులకు గురి చేస్తున్నారని లబోదిబోమంటున్నారు. 

ఆగిన కానిస్టేబుల్‌ బదిలీలు..
గుంటూరు నగరంలో పోస్టింగ్‌ కోరుకుంటున్న కానిస్టేబుళ్లు, హెడ్‌ కానిస్టేబుళ్లు ఎన్‌ఫోర్స్‌మెంట్‌లోకి వెళ్లబోమని తేల్చి చెబుతుండటంతో జిల్లాలో బదిలీలు నేటికీ జరగలేదు. రెండు మూడు రోజులుగా ఈ బదిలీలు నిర్వహించాలని గుంటూరు, నరసరావుపేట, తెనాలి సూపరింటెండెంట్‌లు అర్ధరాత్రి వరకూ ఆఫీస్‌లో కూర్చుని ఎన్‌ఫోర్స్‌మెంట్‌కు వెళ్లేవారు ఎవ్వరు దొరక్క బదిలీలు వాయిదా వేస్తున్నట్టు తెలుస్తోంది. ఇటీవల జరిగిన జిల్లా స్థాయి అధికారుల బదిలీల్లో ఆ అధికారి బదిలీ అవుతారని సిబ్బంది అందరూ కోటి ఆశలతో ఎదురు చూశారు. అయితే ఆయన బదిలీపై జిల్లాకు వచ్చి కొద్ది రోజులే కావడంతో బదిలీ చేయలేదు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top