అవగాహన అభాసుపాలు

EVM Awareness Camp Delayed Revenue Department - Sakshi

ఈవీఎంలు, వీవీ ప్యాట్‌ల వద్దకు రాని ప్రజలు

ప్రజలకు సమాచారం అందించడంలో రెవెన్యూ అధికారుల వైఫల్యం

గుంటూరు, ప్రత్తిపాడు: ఈవీఎంల ట్యాంపరింగ్‌ జరుగుతోందంటూ రాజకీయ పక్షాల గగ్గోలు ఒకవైపు, ఒకరికి ఓటు వేస్తే వేరొకరికి ఓటు పడుతుందంటా అంటూ ఓటర్లలోనూ, ప్రజల్లోనూ అపోహ ఉంది. వీటన్నింటికీ చెక్‌ పెట్టేందుకు ఎన్నికల కమిషన్‌ నడుం బిగించింది. ప్రజల్లోనూ, రాజకీయపక్షాల్లోనూ అనుమానాల్ని పటాపంచలు చేసేందుకు ప్రణాళిక రచించింది. ఈవీఎంల పనితీరు, వీవీప్యాట్‌ల వినియోగం, ఎన్నికల సరళి, ఓటు హక్కు వినియోగించుకునే పద్ధతిపై ఓటర్లకు క్షేత్ర స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఎన్నికల సంఘం పూనుకుంది. మరికొద్ది రోజుల్లో ఎన్నికల నగారా మోగనున్న తరుణంలో ప్రతి గ్రామంలోని పోలింగ్‌ బూత్‌ల వద్ద ఓటర్లకు వీవీప్యాట్‌లు, ఈవీఎంలపై అవగాహన కల్పించాలని నిర్ణయించింది. కానీ, ఎన్నికల కమిషన్‌ ఆదేశాలకు, ఆశయాలకు క్షేత్రస్థాయిలో రెవెన్యూ యంత్రాంగం గండి కొడుతోంది. ఫలితంగా పోలింగ్‌ కేంద్రాల వద్ద జరుగుతున్న నమూనా పోలింగ్‌ కార్యక్రమంలో ఓటర్ల భాగస్వామ్యం తగ్గిపోతోంది.

అవగాహన ఇలా..
ఈవీఎంలు, వీవీప్యాట్‌ల పనితీరుపై ఓటర్లుకు అవగాహన కల్పించేందుకు ఇప్పటికే మండలస్థాయిలో కొందరు అధికారులకు జిల్లా కేంద్రంలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. వీరు ముందుగా నిర్దేశించిన షెడ్యూల్‌ ప్రకారం పోలింగ్‌బూత్‌ల వద్ద అందుబాటులో ఉండి ఓటర్లతో ఈవీఎం ద్వారా ఓటు వేయించి అవగాహన కల్పిస్తారు. వారు ఈవీఎంలో ఏ నంబరులో ఓటు వేశారు (మీట నొక్కారు)? వీవీప్యాట్‌లో ఏ నంబరు కనిపిస్తుంది? ఓటు వేసిన నంబరే వస్తుందా? లేక వేరేదయినా నంబరు కనిపిస్తుందా? వంటి వాటిపై సమగ్రంగా అవగాహన కల్పిస్తారు.

రెవెన్యూ యంత్రాంగంలో అలసత్వం
ఇంతటి ప్రాముఖ్యత ఉన్న కార్యక్రమంపై స్థానిక రెవెన్యూ యంత్రాంగం తీవ్ర అలసత్వాన్ని ప్రదర్శిస్తోంది. ఓటర్లు పోలింగ్‌ బూత్‌ల వద్దకు వచ్చేలా ప్రచారం కల్పించడంలో విఫలమవుతోంది. గ్రామంలోని ఫలానా బూత్‌ వద్ద నమూనా ఓటింగ్‌ జరుగుతుందంటూ ముందస్తుగా గ్రామంలో అందుబాటులో ఉన్న ప్రచార సాధనాల ద్వారా విస్తృత ప్రచారం చేయిస్తే సానుకూల ఫలితాలు కనిపించే అవకాశం ఉంది. అంతేకాకుండా ఎక్కువ మంది బూత్‌ల వద్దకు వెళ్లి నమూనా ఓటింగ్‌లో పాల్గొనే వీలు ఉంటుంది. కానీ, రెవెన్యూ అధికారులు ఆదిశగా అడుగులు వెయ్యడం లేదు. పోలింగ్‌ బూత్‌ల వద్ద అందుబాటులో ఉన్న ఐదు పది మందిని పిలిచి ఫోటోలు దిగి పంపించి వేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో అవగాహన కార్యక్రమం అభాసుపాలవుతోంది. గురువారం ప్రత్తిపాడులోని భవనం వెంకటరెడ్డి జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన నమూనా పోలింగ్‌పై ప్రజలకు కనీస అవగాహన కూడా లేకపోవడంతో వెలవెలబోయింది. సంబంధిత కార్యక్రమంపై అధికారులు రూపొందించిన యాక్షన్‌ ప్లాన్‌ సైతం బయటకు పొక్కకుండా తహసీల్దార్‌ చర్యలు తీసుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతుంది. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమ పరిసరాల్లో బీఎల్‌వోల జాడలే కనిపించడంలేదు. అవగాహన కార్యక్రమాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు సైతం ఆ దిశగా అడుగులు వెయ్యకపోవడంతో ఎన్నికల కమిషన్‌ ఉద్దేశం నీరుగారిపోతుంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top