అయిననూ.. తాంబూలాలిచ్చేయండి! | establishment of industries what was the work? | Sakshi
Sakshi News home page

అయిననూ.. తాంబూలాలిచ్చేయండి!

Apr 27 2015 2:37 AM | Updated on Jul 28 2018 3:23 PM

అయిననూ.. తాంబూలాలిచ్చేయండి! - Sakshi

అయిననూ.. తాంబూలాలిచ్చేయండి!

‘తాంబూలాలిచ్చేశాను. ఇహ.. తన్నుకు చావండి!’-అన్న కన్యాశుల్కం లోని...

పరిశ్రమల స్థాపనకు పంచాయతీలతో పనేంటి?
ఇండస్ట్రీ అనుమతులపై ప్రభుత్వం ఆదేశాలు.. జీవో 44 జారీ
సాక్షి, హైదరాబాద్: ‘తాంబూలాలిచ్చేశాను. ఇహ.. తన్నుకు చావండి!’-అన్న కన్యాశుల్కం లోని అగ్నిహోత్రావధాన్ల మొండి వైఖరిని పుణికిపుచ్చుకున్నట్టుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వ తీరు. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో ఆయన చూపుతున్న చొరవ.. పంచాయతీల అధికారాలపై వేటువేస్తోంది.

పరిశ్రమలకు అనుమతివ్వడమే తన బాధ్యతగా, తర్వాతేం జరిగినా తనకు సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తోంది. సాధారణంగా ఏ గ్రామంలోనైనా కొత్తగా పరిశ్రమ ఏర్పాటుకావాలంటే సదరు గ్రామ పంచాయతీ తీర్మానం చేయాలి. అయితే, ప్రస్తుతం  పంచాయతీ తీర్మానాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం జిల్లా కలెక్టర్లకు ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి జీవో 44ను జారీ చేసేసింది.
 
ప్రభుత్వ వైఖరిపై స్థానిక సంస్థల ప్రతినిధుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఈ కారణంగా జిల్లా అధికారులు అనుమతులు మంజూరు విషయంలో వెనుకంజ వేస్తున్నారు. క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లడానికి కూడా భయపడుతున్నారు. ఇదిలావుంటే, సింగిల్ డెస్క్ ద్వారా 21 రోజుల్లోనే పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చేవారికి అనుమతులివ్వాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, దీనికి పురోగతి కనిపించలేదని ఇటీవల రాష్ట్ర స్థాయి పారిశ్రామిక ప్రోత్సాహక మండలి గుర్తించింది. పరిశ్రమల శాఖ కమిషనర్ కూడా జిల్లా అధికారులతో చర్చించారు. రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటి వరకూ పరిశ్రమల స్థాపనకు అనుమతులు ఇవ్వకపోవడంపై ఆరా తీశారు.

స్థానికులకు ఇబ్బంది కలిగించే పరిశ్రమలను గ్రామస్తులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే విషయం వారి దృష్టికొచ్చింది. గ్రామ పంచాయతీల సానుకూల తీర్మానం లేకుండా పరిశ్రమలు స్థాపించడం వల్ల చిక్కులు తప్పవని అధికారులు భావిస్తున్నారు. అయినా దరఖాస్తు చేసుకున్న ఔత్సాహికులకు పంచాయతీల అనుమతితో సంబంధం లేకుండా అనుమ తులివ్వడంపై  అధికారులు దృష్టి పెట్టారు. కాగా, రాష్ట్రం మొత్తం మీద 2,847 సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు, మరో 250 మధ్య తరహా పరిశ్రమలకు దరఖాస్తులు వచ్చాయి.
 
‘స్థానిక’ హక్కులపై ఉక్కుపాదం

- తమ అభిమతానికి విరుద్ధంగా పరిశ్రమల అనుమతికిగాను కలెక్టర్లకు పూర్తి అధికారాలు ఇవ్వడాన్ని స్థానిక సంస్థల ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. ఇది స్థానిక సంస్థల హక్కులను దెబ్బతీయడమే అవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పంటపొలాలను కోల్పోవాల్సి వస్తుందని పలువురు సర్పంచ్‌లు అంటున్నారు. పరిశ్రమల వల్ల కాలుష్యంతో గ్రామాలను విడిచి వెళ్లాల్సిన పరిస్థితులు తలెత్తుతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
- కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆహారశుద్ధి పరిశ్రమలకు దరఖాస్తులు అందాయి. వీటిని అనుమతించడం వల్ల వాటి నుంచి వెలువడే వ్యర్థాలు స్థానిక నీటిని, వాతావరణాన్నీ కలుషితం చేస్తాయని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనావాసాల్లో లోహ, రసాయన, పెట్రో రసాయనాల పరిశ్రమలకు అనుమతులిస్తే ప్రజారోగ్యంపై, పంటలపై తీవ్ర ప్రభావం పడుతుందని అంటున్నారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలని కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement