
'సీఎం జ్వరంతోనే ఉండాలని కోరుకుంటున్నాం'
తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందేందుకు సహకరించాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలను టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు కోరారు.
హైదరాబాద్: తెలంగాణ ముసాయిదా బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందేందుకు సహకరించాలని సీమాంధ్ర ఎమ్మెల్యేలను టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు కోరారు. అసెంబ్లీలో బిల్లును ప్రవేశపెట్టినందుకు స్పీకర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుత సమావేశాల్లోనే బిల్లుపై అభిప్రాయాలు సేకరించి రాష్ట్రపతికి పంపాలన్నారు. బిల్లుపై ఓటింగ్ అవసరం లేదన్నారు. కిరణ్ అడ్డుపడితేనే బిల్లు మూడు రోజులు ఆగిందని ఆరోపించారు. తెలంగాణ బిల్లు అసెంబ్లీ ఆమోదం పొందే వరకు సీఎం పూర్తిగా జ్వరంతోనే ఉండాలని కోరుకుంటున్నామని అన్నారు.
తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ కారణంగానే కేంద్రం తెలంగాణ ఇచ్చిందని ఎర్రబెల్లి తెలిపారు. విభజన కోసం రెండుసార్లు లేఖ ఇచ్చామని చెప్పారు. తెలంగాణ రావడం టీడీపీ విజయమన్నారు. విద్యార్థుల త్యాగాల ఫలితమే తెలంగాణ అన్నారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. అమరవీరులకు కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.