ఫారెస్ట్‌ ఆఫీసులో డిష్యుం.. డిష్యుం

Employees fight in Divisional Forest office - Sakshi

ప్రొద్దుటూరు క్రైం :  డివిజనల్‌ ఫారెస్ట్‌ అధికారి సమక్షంలోనే ఓ ఉద్యోగి మరో ఉద్యోగిపై దాడికి  యత్నించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఉమామహేశ్వరరావు వనిపెంట అటవీ శాఖ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పని చేస్తున్నాడు. అయితే ప్రొద్దుటూరు ఫారెస్ట్‌ డివిజన్‌ కార్యాలయంలో సిబ్బంది కొరత ఉండటంతో ఏడాది నుంచి ఇక్కడే పని చేస్తున్నాడు. మరో సీనియర్‌ అసిస్టెంట్‌ షేక్‌ మహబూబ్‌బాషా 2015 నుంచి డివిజన్‌ కార్యాలయంలో పని చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం ఒక ఫైల్‌ కనిపించలేదనే విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆ రోజు నుంచి ఇద్దరికి ఒకరంటే మరొకరికి పడ దు. అప్పటి డీఎఫ్‌ఓ బదిలీ కావడంతో ఈ ఏడాది ఆగస్టులో గురుప్రభాకర్‌ డీఎఫ్‌ఓగా బాధ్యతలు చేపట్టారు. డీఎఫ్‌ఓ బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత ఉమామహేశ్వరరావు సెలవులో వెళ్లాడు. ఈ క్రమంలో సెలవు ముగించుకొని అతను సోమవారం విధుల్లో చేరడానికి వచ్చాడు. వనిపెంటలో రిపోర్టు చేసుకోవాలని డీఎఫ్‌ఓ చెప్పారు.

డీఎఫ్‌ఓ సమక్షంలోనే...
మహబూబ్‌బాషా చెప్పడం వల్లనే డీఎఫ్‌ఓ తనను వనిపెంటకు వెళ్లమన్నాడని ఉమామహేశ్వరరావు భావించాడు. దీంతో సోమవారం మధ్యాహ్నం సమయంలో డీఎఫ్‌ఓ కార్యాలయానికి వెళ్లాడు. బయటి నుంచే దూషిస్తూ కార్యాలయంలోకి వెళ్లడంతో మహబూబ్‌బాషా, రఫితో పాటు తోటి ఉద్యోగులు అతన్ని నచ్చచెప్పి ఇంటికి పంపించారు. ఈ వ్యవహారం అంతటితో సద్దుమణిగిందని ఉద్యోగులందరూ భావించారు. అయితే అదే రోజు రాత్రి 7.30 సమయంలో ఉమామహేశ్వరరావు పెన్నానగర్‌లో ఉన్న మునెయ్య, నరేష్, నాజీర్, సుబ్బరాయుడు అనే నలుగురు వ్యక్తులను తీసుకొని డీఎఫ్‌ఓ కార్యాలయంలోకి వెళ్లాడు. అక్కడున్న మహబూబ్‌బాషాపైకి దాడికి యత్నిం చాడు.  అతను తప్పించుకొని డీఎఫ్‌ఓ కార్యాలయంలోకి పరుగెత్తాడు.   ఉమామహేశ్వరరావును వారించడానికి డీఎఫ్‌ఓ ప్రయత్నించగా అతను వినిపించుకోలేదు. కొంత సేపు కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మహబూబ్‌బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ మధుమల్లేశ్వరరెడ్డి తెలిపారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top