శిఖరాన్ని వంచింది
ప్రకృతి పాఠశాల అంటే భరణికి చిన్నప్పటి నుంచి ఇష్టం. ఆ ఇష్టమే ఆమెను ఫారెస్ట్ డిపార్ట్మెంట్లోకి వచ్చేలా చేసింది. కొండలు, కోనలు భరణి నేస్తాలు. ఆ స్నేహమే ప్రపంచంలోని ప్రసిద్ధ పర్వతాలు అధిరోహించేలా చేస్తోంది. లద్ఖాఖ్‌లోని కాంగ్ యాప్సే నుంచి రష్యాలోని ఎల్ బ్రస్ పర్వతం వరకు ఎన్నో పర్వతాలను అధిరోహించిన చిత్తూరు జిల్లా డివిజినల్ ఫారెస్ట్ ఆఫీసర్ (డీఎఫ్‌వో) భరణి గురించి...స్ఫూర్తినిచ్చే సాహసికుల గురించి వినడం, చదవడం భరణికి ఎంతో ఇష్టమైన పని. అలా విన్నప్పుడు, చదివినప్పుడు తాను కూడా ఆ పర్వతాలను అధిరోహించినట్లు కల కనేవారు. ఆ కల నిజమయ్యే సమయం రానే వచ్చింది. ఐపీఎస్ అధికారి అతుల్ కరవాల్ 50 ఏళ్ల వయసులో ఎవరెస్టు అధిరోహించడం భరణిని ప్రభావితం చేసింది. అతుల్ కరవాల్ ఎవరెస్ట్ అధిరోహించినట్లే తానూ ప్రపంచంలో మేటి శిఖరాలను అధిరోహించాలనుకున్నారు. 30 రోజులపాటు శిక్షణ తీసుకున్నారు భరణి.శిక్షణ తరువాత... ఎన్నో శిఖరాలురంపచోడవరంలో ఉప అటవీశాఖ అధికారిణిగా పనిచేస్తూనే డార్జిలింగ్‌లో కేంద్ర రక్షణ శాఖ నిర్వహిస్తోన్న హిమాలయన్ మౌంటెనరీ ఇన్ స్టిట్యూట్లో కోర్సు పూర్తి చేశారు. తొలి ప్రయత్నం గా లద్దాఖ్‌లోని కాంగ్ యాప్సే పర్వతాన్ని అధిరోహించారు.తొలి ప్రయత్నం... తొలి విజయం.తన మీద తనకు ఎంతో నమ్మకం వచ్చింది. మరింత ఉత్సాహం వచ్చింది. ఆ తరువాత...ఉత్తరాఖండ్‌లోని 4,200 మీటర్ల మల్లార్ లేక్ శిఖరాన్ని, రష్యాలో 5,642 మీటర్ల ఎత్తైన ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించారు.కిలిమంజారో పిలిచిందిఎన్నోసార్లు ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతం గురించి ఆసక్తిగా విన్న భరణి ఆ పర్వతాన్ని అధిరోహించాలనుకున్నారు. కిలిమంజారో ఎత్తు 5,895 మీటర్లు. వీపుపై 28 కిలోల బరువును మోస్తూ ఏటవాలుగా ఉన్న కొండలను ఎక్కడమంటే పెద్ద సాహసమే. ఏమాత్రం పట్టు తప్పినా ప్రాణాలకే ప్రమాదం. అయినా సరే కంటిముందు లక్ష్యం మాత్రమే కనిపించిందని భరణి చెబుతారు. 26 గంటలపాటు సుదీర్ఘంగా కిలిమంజారో అధిరోహణ సాగిందని, పర్వత శిఖరాగ్రంపై పాదం మోపిన వెంటనే కష్టాలన్నీ క్షణంలో మరచిపోయానని అంటారు భరణి.ప్రకృతి పాఠశాలలో...తమిళనాడులోని కోయంబత్తూరు భరణి జన్మస్థలం. తండ్రి సాథూర్ స్వామి ఆర్మీ ఆఫీసర్. తల్లి పద్మ టీచర్. నాన్న ఉద్యోగరీత్యా రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో ఆమె చదువు కొనసాగింది. తమిళనాడు వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ పూర్తి చేసింది. తొమ్మిదో తరగతిలో కొడైకెనాల్‌కు విహారానికి వెళ్లినప్పుడు ఆ దట్టమైన అటవీప్రాంతం, సరస్సులు, కొండల నడుమ జాలువారే జలపాతాలు భరణి మనసును కట్టిపడేశాయి. పర్వత్రపాంతాలకు వెళ్లేటప్పుడు పర్వతారోహణకి సంబంధించి మెలకువలు నేర్చుకున్నారు. భవిష్యత్‌లో మరిన్ని శిఖరాలను అధిరోహించాలనేది భరణి కల. ఆమె కల నెరవేరాలని ఆశిద్దాం.ప్రతి సాహసం ఒక పాఠమేప్రతి ప్రయాణం, ప్రతి సాహసం ఎన్నో పాఠాలు నేర్పుతుంది. అలా ఎప్పటికప్పుడు కొత్త కొత్త పాఠాలు నేర్చుకుంటున్నాను. ‘హాయిగా ఉద్యోగం చేసుకోకుండా ఎందుకు ఈ రిస్క్?’ అనే వాళ్లు కూడా ఉంటారు. అయితే రిస్క్ లేనిది ఎక్కడా! సాహసం చేస్తేనే దానిలో ఉన్న మజా ఏమిటో తెలుస్తుంది. ఒక సాహసం మరొక సాహసానికి స్ఫూర్తినిస్తుంది. పర్వతారోహణ అనేది మనలోని ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసే సాహసం. భవిష్యత్‌లో మరిన్ని ప్రసిద్ధ పర్వతాలను అధిరోహించాలనుకుంటున్నాను.– భరణి– నామా హరీశ్, సాక్షి. చిత్తూరు