గజరాజుల మరణమృదంగం

The Elephants Death By Electrocution - Sakshi

ట్రాన్స్‌ఫార్మర్‌ వైర్లు తగిలి గున్న ఏనుగు మృతి 

తక్కువ ఎత్తులో కరెంటు తీగలతో ఘటన 

వారం రోజుల్లో రెండో ఏనుగు మృతి    

పోస్టుమార్టం చేస్తుండగా ఘీంకారాలు చేసిన ఏనుగులు

అడవిని దాటి వస్తున్న గజరాజులకు ప్రాణగండం తప్పడం లేదు. అడవిలో మేత, నీరు లేకపోవడంతో పొలాల బాట పడుతున్నాయి. సక్రమంగా చేపట్టని ఎలిఫెంట్‌ ట్రెంచ్‌లు, తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ తాజాగా ఓ గున్న ఏనుగు ప్రాణం పోయేందుకు కారణాలయ్యాయి. ఈ ఘటన పలమనేరు మున్సిపాలిటీ పరిధిలోని గొబ్బిళ్లకోటూరు మున్సిపల్‌ డంపింగ్‌ యార్డు వద్ద శనివారం రాత్రి చోటుచేసుకోగా, ఆదివారం ఉదయం వెలుగుచూసింది.

సాక్షి, పలమనేరు: పలమనేరు కౌండిన్య అభయారణ్యంలో 35కిపైగా ఏనుగులు గుంపులుగా సంచరిస్తున్నాయి. అడవిలో తగిన మేత, నీరులేక కొన్నాళ్లుగా రైతుల పంటలపై పడుతున్నాయి. ఏనుగులు అడవిలోంచి రాకుండా అటవీ శాఖ ఎలిఫెంట్‌ ట్రెంచ్‌లను గత ప్రభుత్వంలో తవ్వించింది. కాంట్రాక్టర్లు రాళ్లు, వాగులున్న చోట ఈ పనులు చేపట్టలేదు. ఈ క్రమంలో ఏనుగులు ఆ మార్గాల్లో వచ్చి వెళుతున్నాయి. శనివారం రాత్రి ఏనుగుల గుంపు డంపింగ్‌ యార్డు పక్కనుంచి సుబ్రమణ్యంకు చెందిన పొలంలోకి ప్రవేశించాయి. అక్కడి మల్బరీతోటలో కాసేపు తిరిగి అడవిలోకి వెళ్లేందుకు వెళుతూ పొలం గట్టెక్కే ప్రయత్నంలో పక్కనే తక్కువ ఎత్తులో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను గున్న ఏనుగు ముట్టుకోవడంతో మృతిచెందింది.

ఏనుగుల ఘీంకారాలతో..
ఆదివారం ఉదయం పొలం వద్దకెళ్లిన రైతు సుబ్రమణ్యం ఏనుగుల ఘీంకారాలు విని కాస్త దూరం నుంచి చూడగా ఏనుగు మృతిచెందిన విషయాన్ని గుర్తించాడు. జరిగిన విషయాన్ని స్థానిక అటవీ శాఖకు తెలిపాడు. ఎఫ్‌ఆర్వో మదన్‌మోహన్‌రెడ్డి, సిబ్బంది, ట్రాకర్స్‌ అక్కడికి చేరుకున్నారు. అప్పటికి బిడ్డ వద్ద తల్లి ఏనుగు తల్లడిల్లుతోంది. రంగంలోకి దిగిన ట్రాకర్స్‌ తల్లి ఏనుగును టపాసులు పేల్చుతూ సమీపంలోని అడవిలోకి మళ్లించారు. ఆపై ఏనుగు మృతిచెందిన ప్రదేశానికి వెళ్లి మృతికి కారణాలను గమనించారు. తక్కువ ఎత్తులో ఉన్న కరెంటు తీగల కారణంగానే మృతిచెందిందని నిర్ధారించారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేశారు.

తల్లడిల్లిన తల్లి ఏనుగు
శనివారం రాత్రి గున్న ఏనుగు మృతిచెందగానే తల్లి ఏనుగుతో సహా మిగిలిన ఏనుగులు దా న్ని లేపేందుకు చాలా ప్రయత్నించినట్టు తెలు స్తోంది. ఆదివారం ఉదయానికి అన్ని ఏనుగులు అడవిలోకి వెళ్లినా తల్లి ఏనుగు మాత్రం బిడ్డను వదిలిపోలేదు. ట్రాకర్స్‌ దాన్ని అడవిలోకి మళ్లించి నా ఘటనా స్థలానికి దగ్గరలో ఉంటూ నాలుగైదుసార్లు ఘీంకారాలు చేస్తూ బిడ్డవద్దకు పరుగులు పెడుతూ రాసాగింది. తల్లి ఏనుగు కళ్లలో కారుతున్న కన్నీటిని చూసిన జనం ఆవేదన చెందారు. తల్లి ప్రేమను చూసి కన్నీటిపర్యంతమయ్యారు.

పీఎం చేస్తుండగా ఏనుగుల ఘీంకారాలు
విషయం తెలుసుకున్న డీఎఫ్‌ఓ సునీల్‌కుమార్‌ రెడ్డి అక్కడికి చేరుకున్నారు. తిరుపతి జూ నుంచి వచ్చిన డాక్టర్‌ తోయిబాసింగ్, స్థానిక వెటర్నరీ డాక్టర్‌ చిట్టిబాబు తదితరులు మృతిచెందిన ఏనుగుకు పోస్టుమార్టం నిర్వహించారు. ఘటనా స్థలం నుంచి ఏనుగును తరలించినప్పటి నుంచి పీఎం పూర్తయ్యేదాకా అక్కడికి సమీపంలో ఏనుగులు ఘీంకరిస్తూ, తల్లి తచ్చాడుతూ కనిపించాయి.

రూ.2.61కోట్లు పెట్టినా నెరవేరని లక్ష్యం
పలమనేరు కౌండిన్య ఎలిఫెంట్‌ శాంక్చురీలో ఏనుగులు అడవిలోంచి బయటకు రాకుండా 142 కి.మీలో రూ.2.61కోట్లతో ఎలిఫెంట్‌ ప్రూఫ్‌ ట్రెంచ్‌ల నిర్మాణం సాగింది. అయితే రాళ్లు, వాగులున్న చోట సంబంధిత కాంట్రాక్టర్లు పనులు చేపట్టలేదు. ఈ మార్గాల్లో ఏనుగులు అడవిలోంచి వెలుపలకు వచ్చేస్తున్నాయి. మట్టి మెత్తగా ఉన్న చోట్ల ఏనుగులు వీటిని పూడ్చి బయటకొస్తున్నాయి. ఇన్ని కోట్లు వెచ్చించినా ఫలితం లేకుండా పోయిందనే విమర్శలున్నాయి.

సమస్య పరిష్కారానికి చర్యలు
జిల్లాలోని పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో ఏనుగుల సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని డీఎఫ్‌ఓ సునీల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఆదివారం కరెంట్‌ షాక్‌తో మృతి చెందిన ఏనుగును ఆయన పరిశీలిస్తుండగా మంజునాథ్‌ అనే రైతు తనకు నష్టపరిహారం అందలేదని అధికారులను విన్నవించారు. దీనిపై  మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మైగ్రేటెడ్‌ ఏనుగులు 36 దాకా ఉన్నాయన్నారు. వాటికి ఇక్కడి చిట్టడవులు సురక్షితం కాదన్నారు. వాటికి అడవిలో తగిన మేత, నీరులేక అడవిని దాటి వెళుతున్నాయని తెలిపారు. ఏనుగుల సమస్యకు తాత్కాలిక పరిష్కారంగా ఎలిఫెంట్‌ ట్రాకర్ల సంఖ్యను పెంచుతామన్నారు.

రెండేసి కిలోమీటర్లలో ఇద్దరేసి పహారా కాసేలా చూస్తామన్నారు. అడవిలో ఏనుగులకు నీటి సౌకర్యం కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎలిఫెంట్‌ ట్రెంచ్‌లు ఎక్కడ ఏర్పాటు చేయలేదో ఆ వివరాలను తెప్పించి అక్కడ ఏమి చేయాలో చూస్తామన్నారు. 2014 నుంచి 1,514మంది రైతులకు సంబంధించి రూ.74లక్షలు పరిహారం పంపిణీ చేశామన్నారు. పెండింగ్‌లో ఉన్న రూ.5లక్షలు త్వరలోనే అందుతుందని తెలిపారు. పీలేరు స్క్వాడ్‌ డీఎఫ్‌ఓ వెంకటనరసింహారావు, స్థానిక ఎఫ్‌ఆర్‌ఓ మదన్‌మోహన్‌రెడ్డి తదితరులున్నారు.

ట్రాన్స్‌కో నిర్లక్ష్యం
ఇక్కడి రైతుల పొలాల వద్ద తక్కువ ఎత్తులోని ట్రాన్స్‌ఫార్మర్లు అనేకం కనిపిస్తున్నాయి. మనుషులకు ప్రమాదం తప్పదని రైతు సుబ్రమణ్యం పలుమార్లు ట్రాన్స్‌కో అధికారులకు విన్నవించి నా వారు పట్టించుకోలేదని వాపోయాడు. దీనిపై కలత చెందిన ఎఫ్‌ఆర్‌ఓ స్థానిక ట్రాన్స్‌కో అధికారులపై చర్యలు తీసుకునేలా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కనీసం కరెంటు తీగలకు బదులు ఫైబర్‌ వైర్లను అమర్చినా ఈ ప్రమాదం జరిగేది కాదన్నారు.

సీఎం దృష్టికి తీసుకెళతాం
పలమనేరు వద్ద ఏనుగు మృతిచెందిన ఘటన బాధాకరం. ఈ సమస్యను ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తా. ఇప్పటికే దీనికి సంబంధించిన పూర్తి సమాచారంతో సిద్ధంగా ఉన్నాం. పెండింగ్‌లోని రైతుల నష్టపరిహారం చెల్లింపు, నష్టపరిహారం పెంపు తదితరాలపై శాసనసభలో ప్రస్తావిస్తా.         – పలమనేరు ఎమ్మెల్యే వెంకటేగౌడ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top