ఎలాగండి?

Electricity Generation Stop Donkarayi Power Plant - Sakshi

డొంకరాయి పవర్‌ కెనాల్‌కు గండి 

30 మీటర్ల వరకు కొట్టుకుపోయిన కెనాల్‌ 

నిలిచిన విద్యుత్‌ ఉత్పత్తి 

ఏపీ జెన్‌కోకు రూ.కోట్లలో నష్టం

సీలేరు: సీలేరు విద్యుత్‌ కాంప్లెక్సు పరిధి డొంకరాయి పవర్‌ కెనాల్‌కు భారీ గండి పడింది. డొంకరాయి జలవిద్యుత్‌ కేంద్రంలో ఒక యూనిట్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేసి అనంతరం పవర్‌ కెనాల్‌ ద్వారా ఏవీపీ డ్యాంలోకి నీరు వెళ్లే కెనాల్‌ ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సుమారు 30 మీటర్ల పొడవులో ఒక్కసారిగా పగిలి గండిపడింది. దీంతో జెన్‌కో అధికారులు ఉలిక్కి పడ్డారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో గండిపడిన సందర్భాలు లేకపోవడంతో ఆందోళన చెందారు. గండితో జెన్‌కోకు భారీగా నష్టం వాటిల్లినట్టు తెలిసింది. డొంకరాయిలో ఉన్న నీటి ద్వారా విద్యుత్‌ఉత్పత్తి అయిన అనంతరం ఆ నీరు ఏవీపీ డ్యామ్‌ వరకు కెనల్‌ మార్గంలో వెళ్తుంది.

అయితే డొంకరాయి వద్ద వంతెనకు ఆనుకుని ఉన్న పవర్‌ కెనాల్‌కు అర్ధరాత్రి వేళ గండిపడి నీరంతా డొంకరాయి గ్రామంలోని ప్రవహించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గండిపడిన ప్రాంతానికి కూతవేటు దూరంలో పోలీస్‌ స్టేషను ఉండడంతో భారీగా వచ్చిన శబ్దాన్ని గుర్తించిన పోలీసు సిబ్బంది విషయాన్ని జెన్‌కో అధికారులకు తెలియజేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే గండి పడి కెనాల్‌లోని నీరంతా గ్రామంలోకి పోయింది. దీంతో ఒకపక్క కెనాల్‌ గండి, మరో పక్క నీరు వృథా, విద్యుత్‌ ఉత్పత్తి నిలిచిపోవడంతో జెన్‌కోకు కోట్లలో నష్టం వాటిల్లి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏపీ జెన్‌కో చీఫ్‌ ఇంజినీర్‌ మోహన్‌రావు, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ రామకోటి లింగేశ్వరరావు, ఎగ్జిక్యుటివ్‌ ఇంజినీర్‌ వి.ఎల్‌.రమేష్‌తో పాటు జెన్‌కో అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గండికి కారణాలపై ఆరా తీశారు. విషయాన్ని జెన్‌కో ఉన్నతాధికారులకు తెలియజేశారు. 

రానున్న నిపుణుల కమిటీ: 
డొంకరాయి పవర్‌ కెనాల్‌లో ఎన్నడు లేనివిధంగా భారీగా గండి పడిన సంఘటన జెన్‌కోలో తీవ్ర ఆందోళన రేపింది. ఈ పవర్‌ కెనాల్‌ నిర్మాణం చాలా ఏళ్ల కింద చేపట్టారు. అప్పుడప్పుడు నీటి ఉధృతికి దెబ్బతిన్న పవర్‌ కెనాల్‌కు మరమ్మతులు చేపడుతుంటారు. అయితే ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో అమరావతికి చెందిన నిపుణుల కమిటీ బృందం సంఘటన స్థలానికి మంగళవారం రానుంది. వారు వచ్చిన అనంతరం పవర్‌ కెనాల్‌కు గండి ఎలా ఏర్పడింది, ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారో అనే విషయాలపై విచారణ చేపట్టే అవకాశం ఉంది.

నిలిచిపోయిన విద్యుత్‌ ఉత్పత్తి:
పవర్‌ కెనాల్‌కు గండి పడిన అనంతరం డొంకరాయి విద్యుత్‌ కేంద్రంలో ఒక యూనిట్‌ 22 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తిని నిలిపివేశారు. విద్యుత్‌ ఉత్పత్తి చేస్తే ఆ నీరు వృథా అవుతుందని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జలాశయం నీటిమట్టం ఎక్కువగా ఉండడంతో దాన్ని నిలకడగా ఉంచాలంటే జలవిద్యుత్‌ కేంద్రంలో   ఉత్పత్తి చేయాలి. పవర్‌ కెనాల్‌కు గండి కొట్టేయడంతో విద్యుత్‌ ఉత్పత్తి చేయడం జరగదు. ఈ నేపథ్యంలో మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో మెయిన్‌ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క సీలేరు జలవిద్యుత్‌ కేంద్రంలో విద్యుత్‌ ఉత్పత్తి అయిన అనంతరం విడుదలైన నీరు కూడా డొంకరాయి జలాశయంలోనే చేరుతుంది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top