breaking news
donkarayi
-
ఎలాగండి?
సీలేరు: సీలేరు విద్యుత్ కాంప్లెక్సు పరిధి డొంకరాయి పవర్ కెనాల్‌కు భారీ గండి పడింది. డొంకరాయి జలవిద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేసి అనంతరం పవర్ కెనాల్ ద్వారా ఏవీపీ డ్యాంలోకి నీరు వెళ్లే కెనాల్ ఆదివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో సుమారు 30 మీటర్ల పొడవులో ఒక్కసారిగా పగిలి గండిపడింది. దీంతో జెన్కో అధికారులు ఉలిక్కి పడ్డారు. గతంలో ఎప్పుడూ ఈ స్థాయిలో గండిపడిన సందర్భాలు లేకపోవడంతో ఆందోళన చెందారు. గండితో జెన్కోకు భారీగా నష్టం వాటిల్లినట్టు తెలిసింది. డొంకరాయిలో ఉన్న నీటి ద్వారా విద్యుత్‌ఉత్పత్తి అయిన అనంతరం ఆ నీరు ఏవీపీ డ్యామ్ వరకు కెనల్ మార్గంలో వెళ్తుంది. అయితే డొంకరాయి వద్ద వంతెనకు ఆనుకుని ఉన్న పవర్ కెనాల్‌కు అర్ధరాత్రి వేళ గండిపడి నీరంతా డొంకరాయి గ్రామంలోని ప్రవహించింది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. గండిపడిన ప్రాంతానికి కూతవేటు దూరంలో పోలీస్ స్టేషను ఉండడంతో భారీగా వచ్చిన శబ్దాన్ని గుర్తించిన పోలీసు సిబ్బంది విషయాన్ని జెన్కో అధికారులకు తెలియజేయడంతో హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే గండి పడి కెనాల్‌లోని నీరంతా గ్రామంలోకి పోయింది. దీంతో ఒకపక్క కెనాల్ గండి, మరో పక్క నీరు వృథా, విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో జెన్కోకు కోట్లలో నష్టం వాటిల్లి ఉండవచ్చునని అధికారులు భావిస్తున్నారు. విషయం తెలుసుకున్న ఏపీ జెన్కో చీఫ్ ఇంజినీర్ మోహన్‌రావు, సూపరింటెండెంట్ ఇంజినీర్ రామకోటి లింగేశ్వరరావు, ఎగ్జిక్యుటివ్ ఇంజినీర్ వి.ఎల్.రమేష్‌తో పాటు జెన్కో అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. గండికి కారణాలపై ఆరా తీశారు. విషయాన్ని జెన్కో ఉన్నతాధికారులకు తెలియజేశారు. రానున్న నిపుణుల కమిటీ: డొంకరాయి పవర్ కెనాల్లో ఎన్నడు లేనివిధంగా భారీగా గండి పడిన సంఘటన జెన్కోలో తీవ్ర ఆందోళన రేపింది. ఈ పవర్ కెనాల్ నిర్మాణం చాలా ఏళ్ల కింద చేపట్టారు. అప్పుడప్పుడు నీటి ఉధృతికి దెబ్బతిన్న పవర్ కెనాల్‌కు మరమ్మతులు చేపడుతుంటారు. అయితే ఒక్కసారిగా ఈ సంఘటన జరగడంతో అమరావతికి చెందిన నిపుణుల కమిటీ బృందం సంఘటన స్థలానికి మంగళవారం రానుంది. వారు వచ్చిన అనంతరం పవర్ కెనాల్‌కు గండి ఎలా ఏర్పడింది, ముందుగా ఎందుకు గుర్తించలేకపోయారో అనే విషయాలపై విచారణ చేపట్టే అవకాశం ఉంది. నిలిచిపోయిన విద్యుత్ ఉత్పత్తి: పవర్ కెనాల్‌కు గండి పడిన అనంతరం డొంకరాయి విద్యుత్ కేంద్రంలో ఒక యూనిట్ 22 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేశారు. విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఆ నీరు వృథా అవుతుందని భావించిన అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. జలాశయం నీటిమట్టం ఎక్కువగా ఉండడంతో దాన్ని నిలకడగా ఉంచాలంటే జలవిద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి చేయాలి. పవర్ కెనాల్‌కు గండి కొట్టేయడంతో విద్యుత్ ఉత్పత్తి చేయడం జరగదు. ఈ నేపథ్యంలో మళ్లీ వర్షాలు కురుస్తుండడంతో మెయిన్ గేట్ల ద్వారా నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి వస్తుందేమోనని అధికారులు ఆందోళన చెందుతున్నారు. మరోపక్క సీలేరు జలవిద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి అయిన అనంతరం విడుదలైన నీరు కూడా డొంకరాయి జలాశయంలోనే చేరుతుంది. -
నీటివసతులున్నా నిర్లక్ష్యం
డొంకరాయి (వై.రామవరం) : రాష్ట్రాన్ని విద్యుత్ కొరత వేధిస్తోంది. ఈనేపథ్యంలో అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని సాధ్యమైనంత మేరకు విద్యుత్ ఉత్పత్తిని పెంచుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అయినప్పటికీ ఎందుకోగానీ డొంకరాయిలోని ఏపీ జెన్కో జలవిద్యుత్ కేంద్రం ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచే విషయంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. దానికి కావాల్సిన నీటివనరులు పుష్కలంగా ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదు. డొంకరాయి విద్యుత్ కేంద్రంలో 4.10.1983న ఉత్పత్తి ప్రారంభమైంది. ఇక్కడ 25 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. డొంకరాయి నదికి పైన ఉన్న సీలేరులో అదే నదిపై ఉన్న ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రంలో 260 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. అదే నదిపై ఉన్న డొంకరాయి జల విద్యుత్ కేంద్రంలో ఒకే ఒక్క టర్బైన్ ద్వారా 25 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారు. ఈ జలవిద్యుత్ కేంద్రం పవర్ కెనాల్ ద్వారా విడుదలయ్యే నీటితో నడుస్తున్న ఖమ్మంజిల్లాలోని పొల్లూరు జల విద్యుత్ కేంద్రంలో 440 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతోంది. డొంకరాయి నది ప్రమాద స్థాయిని మించి పారుతున్నప్పుడు డ్యాం గేట్ల ద్వారా వృథాగా నీరును వదిలేస్తున్నారు. దీంతో పల్లపు ప్రాంతాలైన చింతూరు మండల లోతట్టు గ్రామాలు జలమయం అవుతున్నాయి. ఆ నీటిని సద్వినియోగం చేసుకొని విద్యుత్ ఉత్పత్తికి చర్యలు చేపట్టాలని ఆ ప్రాంతవాసులు కోరుతున్నారు. సామర్థ్యం పెంచాలి డొంకరాయిలో విద్యుత్ ఉత్పత్తి సామర్ధ్యాన్ని పెంపొం దించాలి. దీనివల్ల విద్యుత్ కొరత తీరడంతోపాటు, ఏపీ జెన్కో సంస్థకు అధిక ఆదాయం వస్తుంది. కంచం పద్మ , బొడ్డగండి 1 ఎంపీటీసీ, వై.రామవరం మండలం ఉపాధి పెరుగుతుంది డొంకరాయిలోని ఏపీ జెన్కో జల విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి సామర్థ్యం పెంచడం వలన ఎంతోమంది నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది. తక్షణమే ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించడానికి చర్యలు తీసుకోవాలి. ముర్ల దేవి, బొడ్డగండి 2 ఎంపీటీసీ, వై.రామవరం మండలం -
బలమెల జలాశయంలో ప్రమాద స్థాయిలో నీటి మట్టం
పై-లీన్ తుపాన్ వల్ల ఉత్తరాంధ్రలోని భారీగా వర్షాలు కురిశాయి. దాంతో సీలేరు, డొంకారాయి, బలమెల జలాశయాలోకి భారీగా వర్షపు నీరు చేరుకుంది. దాంతో అధివారం ఉదయం నాటికి అయా జలాశయాల్లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరింది. అయితే బలమెల జలాశయంలో నీరు గరిష్ట స్థాయికి మించి ప్రమాద స్థాయికి చేరుకుంది. దాంతో18 వేల క్యూసెక్కుల నీటీని అధికారులు ఆదివారం దిగువకు విడుదల చేశారు.