ఉసురు తీసిన ఉపాధి

electrician Died With Power Shock In Guntur - Sakshi

ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు

మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి డిమాండ్‌

నిత్యం విద్యుత్‌ తీగలతోనే సావాసం.. విద్యుత్‌ పరికరాల మరమ్మతులే ఉపాధి మార్గం.. చివరికి అవే మృత్యుపాశాలయ్యాయి.. నిండు ప్రాణాన్ని హరించాయి.. నరసరావుపేటలో ఆదివారం విద్యుత్‌ తీగలకు ప్లాస్టిక్‌ పైపులు అమర్చే పనిలో నిమగ్నమైన ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌ సుభాని షాక్‌కు గురై ఆ తీగలపైనే ప్రాణాలొదిలాడు. అచేతనంగా విద్యుత్‌ తీగలపై వేలాడుతున్న అతని మృతదేహం చూపరుల హృదయాలను ద్రవింపజేసింది.

గుంటూరు, నరసరావుపేట టౌన్‌: విద్యుత్‌ షాక్‌కు గురై ప్రైవేట్‌ ఎలక్ట్రీషియన్‌ మృతి చెందిన సంఘటన ఆదివారం పట్టణంలో చోటుచేసుకుంది. మృతికి కారణమైన విద్యుత్‌ అధికారులు, గృహ యజమానిపై చర్యలు తీసుకోవాలని బాధిత బంధువులు ఆందోళనకు దిగటంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. టూటౌన్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇస్లాంపేటకు చెందిన షేక్‌ కావూరు సుభాని(55) పాతికేళ్లుగా విద్యుత్‌ శాఖ అధికారులకు సహాయంగా లైన్‌మెన్, ఎలక్ట్రీషియన్‌ పనులు చేస్తుంటాడు. ఆదివారం ఇస్లాంపేట మొదటి లైను రెండో అడ్డరోడ్డులో  విద్యుత్‌ లైన్లకు ప్లాస్టిక్‌ పైపులు అమరుస్తూ విద్యుత్‌ షాక్‌తో  తీగలపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే అధికారులు విద్యుత్‌ సరఫరా నిలిపివేశారు.

మృతుని బంధువులు, కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి వచ్చి ఆందోళన చేశారు. టూటౌన్‌ సీఐ బీ ఆదినారాయణ, ఎస్సై లోక్‌నాథ్‌ సిబ్బందితో వచ్చి మృతదేహాన్ని విద్యుత్‌ తీగల మీద నుంచి కిందకు దించే ప్రయత్నం చేయగా మృతుడి బంధువులు అడ్డుకున్నారు. సుభాని మృతికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అనంతరం పలు పార్టీల నాయకులు, వార్డు పెద్దలు చర్చలు జరపడంతో వివాదం సద్దుమణిగింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏరియా వైద్యశాలకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

రూ.10 లక్షలు పరిహారమివ్వాలిఎమ్మెల్యే గోపిరెడ్డి
ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇస్లాంపేటకు చేరుకొని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అండగా ఉంటుందన్నారు. రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. అనంతరం విద్యుత్‌ శాఖ డివిజనల్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. పరిహారం అందిస్తామని డీఈ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ జీ అలెగ్జాండర్‌ సుధాకర్, జనసేన పార్టీ నాయకులు సయ్యద్‌ జిలానీ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ మీరావలి మృతుని కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top