పేటలో కొత్తవారికే అందలం

Electoral results are always suited for newcomers In Chilakaluripet - Sakshi

సాక్షి, చిలకలూరిపేట : చిలకలూరిపేట నియోజకవర్గం 2004 వరకు ఎన్నికల ఫలితాల్లో నూతన విశిష్టత చాటుకునేది. ఇక్కడ ఎన్నికల ఫలితాలు ఎప్పుడూ కొత్తగా పోటీ చేసే వారికే అనుకూలంగా ఉంటాయి. ఈ నియోజకవర్గానికి తొలిసారి 1952లో ఎన్నికలు జరిగాయి. తొలి సారి పొటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో సీపీఐ తరఫున పోటీ చేసిన కరణం రంగారావు కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి పి.నాగయ్యపై గెలిచారు. పదేళ్ల పాటు నియోజకవర్గం ప్రకాశం జిల్లా మార్టూరులోకి వెళ్లింది.

తిరిగి 1967లో జరిగిన ఎన్నికల్లో ఇక్కడ తొలిసారి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో స్వతంత్ర పార్టీ అభ్యర్థి కందిమళ్ల బుచ్చయ్య, కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి నూతి వెంకటేశ్వర్లుపై విజయం సాధించారు. 1972 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా రెండోసారి పోటీ చేసిన కందిమళ్ల బుచ్చయ్యపై తొలిసారి రంగంలోకి దిగిన కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి బొబ్బాల సత్యనారాయణ గెలిచారు. 1978లో తొలిసారి పోటీ పడిన ఇద్దరు అభ్యర్థుల్లో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్య, జనతాపార్టీకి చెందిన భీమిరెడ్డి సుబ్బారెడ్డిపై విజయం సాధించారు.

1983లో జరిగిన ఎన్నికల్లో కొత్తగా రంగంలోకి దిగిన డాక్టర్‌ కాజా కృష్ణమూర్తి రెండోసారి పోటీ చేసిన కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్యపై విజయం సాధించారు. 1989 ఎన్నికల్లో టీడీపీ తరఫున కొత్తగా రంగంలోకి దిగిన డాక్టర్‌ కందిమళ్ల జయమ్మ, కాంగ్రెస్‌పార్టీ అభ్యర్థి సోమేపల్లి సాంబయ్యపై విజయం సాధించారు. 1999 ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన టీడీపీ అభ్యర్థి ప్రత్తిపాటి పుల్లారావు, కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సోమేపల్లి సాంబయ్యపై గెలుపొందారు.

2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌పార్టీ బలపరిచిన ఇండిపెండింట్‌ అభ్యర్థిగా తొలిసారి పోటీ చేసిన మర్రిరాజశేఖర్, టీడీపీకి చెందిన ప్రత్తిపాటి పుల్లారావుపై గెలిచారు. ఆ తదుపరి జరిగిన రెండు ఎన్నికల్లో మాత్రమే పాత అభ్యర్థులు పోటీ చేశారు. ప్రస్తుతం 2019లో టీడీపీ తరుఫున ప్రత్తిపాటి పుల్లారావు పోటీ చేస్తుండగా, వైఎస్సార్‌ సీపీ తరఫున కొత్తగా రాజకీయాల్లోకి వచ్చిన విడదల రజని బరిలో ఉన్నారు. ఈ నేపథ్యంలో మొదటి నుంచి తొలిసారి పోటీ చేసిన అభ్యర్థులకే అండగా నిలుస్తున్న నియోజకవర్గం సెంటిమెంట్‌ పునరావృతం అవుతుందని, రజనికి విజయావకాశాలు మెండుగా ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top