గడ్డు కాలం!

Egg Prices Down Fall in Krishna - Sakshi

క్షీణించిన గుడ్డు ధరలు

పెరిగిన దాణా ధరలు

రూ.4.30 నుంచి రూ.3.05 పడిపోయిన ధర

ఆర్థికంగా నష్టపోతున్న కోళ్ల రైతులు

పెరిగిన మాంసం ధరలు

కోళ్ల పరిశ్రమకు గడ్డుకాలం వచ్చింది. భానుడు ప్రతాపాన్ని చూపుతుండటంతో ఎండ వేడిమికి పరిశ్రమ కుదేలవుతోంది. గుడ్డు ధరలు నిరాశపరుస్తున్నాయి. ప్రస్తుతం గుడ్డు ధర తక్కువగా ఉంటే పెరిగిన దాణా ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ పరిస్థితి రైతులను తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది.  రోజుకు గుడ్డుపై రూ.1.5 నష్టపోతున్నామని కోళ్ల రైతులు చెబుతున్నారు.

సాక్షి, మచిలీపట్నం: జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే.. చల్లపల్లి, లక్ష్మీపురం, కూచిపూడి, వక్కలగడ్డ, చిన్నకళ్లేపల్లి, చిట్టూర్పు, పెదపూడి, నిమ్మగడ్డ, నూజివీడు, ఉయ్యూరు, కంకిపాడు తదితర ప్రాంతాల్లో కోళ్ల ఫారాలున్నాయి. ప్రతి రోజూ దాదాపు 1.2 కోట్ల మేర గుడ్లు ఉత్పత్తి చేస్తున్నారు. ప్రతి రోజు వాటికి అందించే ఆహారంలో అత్యధికంగా మొక్కజొన్న. అధిక పోషకాలుండటంతో దానికే అధిక ప్రాధాన్యం ఇస్తారు. ప్రస్తుతం మొక్కజొన్న ధర క్వింటా రూ.2,500 చేరింది. గతంలో రూ.1300 నుంచి రూ.1500 మధ్య ఉండేది. ఒకే సారి దాదాపుగా రెట్టింపయింది. కోళ్లకు దాణాగా వినియోగించే ఇతర ఆహార పదార్థాలకు కూడా రెక్కలు వచ్చాయి. గతంలో రూ.1200 నుంచి రూ.2100కు, నూనె తీసిన తవుడు క్వింటాలు గతంలో రూ.900 పలికితే, ప్రస్తుతం రూ.1500లకు చేరాయి. మొక్కజొన్న ధర భారీగా పెరిగిన ప్రతిసారీ రైతులు జొన్నలు వగైరా వాటిని ప్రత్యామ్నాయంగా వినియోగిస్తారు. ప్రస్తుతం జొన్నల ధర కూడా పెరిగి రైతులను  కలవరపెడుతోంది. దాణా ధరలు భారీగా పెరిగాయి కనుక గుడ్డు ధర పెరుగుతుందా అంటే అది ప్రస్తుతం రూ.3.05 పలుకుతోంది. ఇది ఏ మాత్రం గిట్టుబాటు కాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ముంచుతున్న కత్తెర పురుగు..
కోళ్ల పరిశ్రమపై కత్తెర పురుగు ప్రభావం చూపుతోంది. మొక్కజొన్న పంటను నాశనం చేస్తుండటం, దిగుబడి తక్కువగా అందుతుండటంతో ప్రస్తుతం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. కత్తెర పురుగు ఉద్ధృతి కారణంగా రైతులు ఈ ఏడా ది మొక్కజొన్న స్థానంలో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్లారు. దీంతో రాష్ట్రంలో మొక్కజొన్న నామమాత్రంగానే సాగు చేశారు. దీనికి తోడు ఇథనాల్‌ తయారీ, గ్లూకోజ్‌ తయారీ వంటి వాణిజ్య పరమైన పరిశ్రమల్లో కూడా మొక్కజొన్నకు ఈ ఏడాది విపరీతమైన డిమాండ్‌ ఏర్పడింది. దీంతో భారీగా ధర పెరిగింది. కొత్తపంట నవంబరులో వచ్చే వరకు ధరలు ఇలాగే ఉంటాయన్న అంశం రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.

ఎండ వేడిమికి..
భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. ఉదయం 10 గంటలు అయితే చాలు ఎండవేడిమి విపరీతంగా పెరుగుతోంది. ఈ వేడిగాలుల తీవ్రతను తట్టుకోలేక కోళ్లు విలవిల్లాడుతున్నాయి. సాధారణంగా శరీరంలోని వేడి చమట రూపంలో బయటకు వస్తోంది. కోడికి చమల గ్రంథులు లేకపోవడంతో శరీరంలో వేడి బయటకు రాక మృత్యువాత పడుతున్నాయి. ఫిబ్రవరి నెలాఖరు నుంచి కోళ్ల ఫారాల్లో వీటి మరణాల సంఖ్య పెరిగింది. ఎండ వేడిమి నుంచి వాటిని రక్షించుకునేందుకు కోళ్ల ఫారాల యజమానులు రక్షణ చర్యలు చేపడుతున్నారు. షెడ్డు పైభాగాన స్పింక్లర్లతో నీటిని తడపడం, లోపల ఫాటర్లు (మంచులా నీరు పడే పద్ధతి)తో ఉష్ణోగ్రతలు తగ్గేలా కోళ్ల రైతులు ప్రయత్నిస్తున్నారు. అయినా కోళ్ల మరణాలు మాత్రం ఆగడం లేదు. ప్రస్తుతం 40 డిగ్రీలున్న ఉష్ణోగ్రత మేలో ఇంకా అధికంగా నమోదవుతాయనే అంచనాలతో కోళ్ల రైతులు తలలుపట్టుకుంటున్నారు.   

ఆశాజనకంగా మాంసం ధర..
ఎండ వేడిమికి కోళ్లు మృత్యువాత పడుతుండటంతో మాంసం ధరలు ఆశాజనకంగా ఉంటున్నాయి. ఈ అంశం కాస్త కోళ్ల రైతులకు ఊరట కలిగిస్తోంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో చికెన్‌ రూ.184, స్కిన్‌లెస్‌ రూ.210 పలుకుతోంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top