నామినేషన్‌పై మందుల కొను‘గోల్‌మాల్‌’ | E-Procurement Tender Cancel In ESI | Sakshi
Sakshi News home page

నామినేషన్‌పై మందుల కొను‘గోల్‌మాల్‌’

Oct 14 2019 4:26 AM | Updated on Oct 14 2019 4:26 AM

E-Procurement Tender Cancel In ESI - Sakshi

సాక్షి, అమరావతి : కార్మిక రాజ్య బీమా (ఈఎస్‌ఐ) పరిధిలోని ఆస్పత్రుల్లో మరో భారీ కుంభకోణానికి అధికారులు తెరతీశారు. గత ప్రభుత్వ హయాంలో మందుల కొనుగోళ్లలో విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలు జరిగాయని తేలడంతో ఓ వైపు విజిలెన్స్‌ అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా దాడులు చేస్తుంటే మరోవైపు ఈఎస్‌ఐ పరిధిలోని ఆస్పత్రుల్లో కనీస మందులు లేక కార్మికులు, వారి కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతున్నారు. ఇవన్నీ ఏమీ పట్టని అధికారులు తాము అనుకున్నదే రూలు అన్నట్టు వందల కోట్ల రూపాయల విలువైన మందుల కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు మార్గం సుగమం చేశారు. పారదర్శకంగా మందుల కొనుగోలు జరగాలంటే ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ పద్ధతి సరైనదని భావించిన అధికారులు కొత్త సర్కారు రాగానే ఈ విధానాన్ని అమలులోకి తెచ్చారు. అప్పటి కార్మిక శాఖ అధికారిగా ఉన్న ఐఏఎస్‌ అధికారి మాధవీలత ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రక్రియ మొదలు పెట్టారు. అయితే కొద్ది రోజులకే ఆమె కృష్ణా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

ఆ తర్వాత లావణ్యవేణి అనే మరో అధికారి ఈ శాఖకు వచ్చారు. ఈమె ఆధ్వర్యంలో టెండర్లు పూర్తి చేసి, ఎల్‌1గా నిలిచిన కంపెనీల నుంచి మందులు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. తీరా ఎల్‌1గా నిలిచిన కంపెనీలపై ఫిర్యాదులున్నాయని, మామూలు ధరల కంటే ఎక్కువ రేటు ఉందని ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ విధానాన్ని నిలిపివేశారు. నామినేషన్‌ కింద మందుల సరఫరాకు అనుమతి ఇచ్చేందుకు ఈఎస్‌ఐ డైరెక్టరే కొన్ని కంపెనీలను ఎంపిక చేశారు. నామినేషన్‌ కింద అయితే భారీగా డబ్బులొస్తాయని భావించిన అధికార వర్గాలు ఈ విధానానికి తెరలేపాయని సమాచారం. ఇదే సమయంలో తక్కువ ధరకు మందులు ఇస్తామని చెప్పిన కంపెనీలు ఎందుకు ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్లలో పాల్గొన లేదన్నదానికి అధికారుల నుంచి జవాబు లేదు. దీంతో రెండు మాసాల పాటు ఇద్దరు ఐఏఎస్‌ అధికారులు కసరత్తు చేసిన ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండర్ల విధానం మొత్తం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది.

ధరలు మామూలుగా ఉన్నాయన్న కమిటీ
ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ పూర్తయ్యాక రేట్లు ఎక్కువగా ఉన్నాయన్న విమర్శలు రాగానే రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) కొనుగోలు చేసే మందుల ధరకూ, ఈఎస్‌ఐ ఇప్రొక్యూర్‌మెంట్‌లో కోట్‌ చేసిన ధరలకూ బేరీజు వేయాలని ఉన్నతాధికారులు ముగ్గురు సభ్యులతో కమిటీ వేశారు. చంద్రశేఖర్, రామకృష్ణ, గాంధి అనే ముగ్గురు వైద్యులతో కూడిన కమిటీ  సుమారు 265 రకాల మందుల ధరలను పరిశీలించింది.

ఈఎస్‌ఐ టెండర్లలో పాల్గొన్న కంపెనీలు వేసిన ధరలకూ, ఏపీఎంఎస్‌ఐడీసీ ధరలకూ తేడా లేదని తేల్చింది. ఇలాంటప్పుడు ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చని నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను అమలు చేయాలని కార్మిక శాఖ ముఖ్య కార్యదర్శి కూడా ఆదేశాలు జారీ చేశారు. వీటన్నింటినీ పట్టించుకోకుండా నామినేషన్‌ ద్వారా కొనుగోళ్లవైపే మొగ్గు చూపారు. ఇప్పటికే ఏఏ కంపెనీకి ఆర్డర్లు ఇవ్వాలో కూడా నిర్ణయించి వారికి జిల్లాల వారీగా మందుల ఇండెంట్‌ ఇచ్చారు. తొలి దశలో సుమారు రూ.40 కోట్లతో మందులు కొనుగోలు చేయనున్నారు.

ధరలు ఎక్కువని ఇస్తున్నాం
ఇ–ప్రొక్యూర్‌మెంట్‌ టెండరులో ధరలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్లే నామినేషన్‌ కింద ఇస్తున్నాం. ఏపీఎంఎస్‌ఐడీసీ సరఫరా చేసే మందులు అదే ధరకు వచ్చినా వాటినెవరైనా తింటారా? మా రోగులు అలాంటి మాత్రలు తినరు. ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో మందులు లేని విషయం వాస్తవమే. అందుకే నామినేషన్‌ కింద ఆర్డర్‌ ఇచ్చి తెప్పిస్తున్నాం. పైగా ఈఎస్‌ఐ మందుల టెండర్లలో పాల్గొన్న కంపెనీల ద్వారా మందులు కొంటే రూ.230 కోట్లు నష్టం వస్తుంది.  – సామ్రాజ్యం, ఈఎస్‌ఐ డైరెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement