
1,410 టన్నులు సీజ్‌చేసిన విజిలెన్స్
67 మంది డీలర్లపై కేసులు
9 మందిపై క్రిమినల్ కేసులు
సాక్షి, అమరావతి: యూరియా దారిమళ్లటం నిజమేనని తేలింది. విజిలెన్స్ అధికారులు సోదాలు చేసి అక్రమ నిల్వ, అధిక ధరలకు విక్రయం తదితర కారణాలతో రూ. 3.27 కోట్ల విలువైన 1,410 టన్నుల యూరియాను సీజ్ చేశారు. దీన్లో తెలంగాణకు తరలిపోయిన 400 టన్నులకు పైగా యూరియా కూడా ఉంది. యూరియాను వ్యవసాయేతర అవసరాలకు కూడా దారిమళ్లిస్తున్న విషయం విజిలెన్స్ సోదాల్లో బట్టబయలైంది. వాస్తవానికి విజిలెన్స్ అధికారులు స్వా«దీనం చేసుకున్నదానికన్నా పదిరెట్లకుపైగా యూరియా అక్రమంగా తరలిపోయినట్లు తెలుస్తోంది.
విజిలెన్స్ అధికారులు 4,862 చోట్ల సోదాలు చేసి అవకతవకలకు పాల్పడిన 67 మంది డీలర్లపై 6ఏ కేసులు నమోదు చేశారు. యూరియాను పెద్ద ఎత్తున దారిమళ్లించిన నేరానికి తొమ్మిదిమందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. అత్యధికంగా ప్రకాశం, ఎన్టీఆర్ జిల్లాల్లో 11 చొప్పున, కర్నూలులో తొమ్మిది, నంద్యాలలో ఆరు, ఏలూరులో ఐదు, అనకాపల్లిలో నాలుగు కేసులు నమోదుచేశారు. మిగిలిన జిల్లాల్లో 2–3 కేసులు నమోదయ్యాయి.
దారిమళ్లింపుతో పాటు ఎమ్మార్పికి మించి విక్రయాలు, బ్లాక్ మార్కెటింగ్, హోర్డింగ్, ట్యాగింగ్ వంటి అవకతవకలకు పాల్పడినందుకు 20 మందికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, కర్నూలు, పల్నాడు జిల్లాల నుంచి తెలంగాణ రాష్ట్రానికి యూరియా అక్రమంగా తరలి పోయినట్టుగా గుర్తించారు. కర్నూలు జిల్లా సహా పలు జిల్లాల్లో యూరియాను టీడీపీ నేతలే దారిమళ్లించినట్టు వార్తలొచ్చాయి. కానీ టీడీపీ నేతలపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదు.
ఈ దాడులన్నీ మొక్కుబడి తంతుగానే సాగాయి. బీర్ల తయారీ ప్లాంట్లు, పెయింట్లు, వారి్నష్, ప్‌లైవుడ్, యాడ్–బ్లూ ద్రావణం, పశువులు, కోళ్లు, ఆక్వాదాణా, కల్తీపాల తయారీలో యూరియా విచ్చలవిడిగా వినియోగిస్తున్నట్టు బహిరంగంగానే చెబుతున్నారు. కానీ విజిలెన్స్ బృందాలు వీటిజోలికి వెళ్లలేదు. ఈ పరిశ్రమలతోపాటు టీడీపీ నేతల గోదాముల్లో తనిఖీలు నిర్వహించి ఉంటే వేలాది టన్నుల యూరియా బయటపడేదని చెబుతున్నారు.
అందుబాటులో ఉన్నది 63,874 టన్నులే
సెపె్టంబర్ నెలకు సంబంధించి 1.55 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా.. ప్రస్తుతం 63,874 టన్నుల నిల్వలు మాత్రమే ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. 10 రోజుల్లో మరో 41,040 టన్నుల యూరియా వస్తుందని ప్రభుత్వం వారం రోజులుగా చెబుతూనే ఉంది. కాగా సీజన్‌లో 6.22 లక్షల టన్నుల యూరియా అవసరం కాగా, పాత నిల్వలు, కేంద్రం నుంచి వచ్చిన నిల్వలు కలిపి 6.71 లక్షల టన్నులు అందుబాటులో ఉండగా, ఇప్పటివరకు 5.90 లక్షల టన్నుల అమ్మకాలు జరిగాయని ప్రభుత్వం చెబుతోంది.