
సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. నేడు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. పశ్చిమ వాయువ్య వాయుగుండగా బలపడే అవకాశముంది. ఏపీలో వారం రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. దక్షిణ కోస్తా, రాయలసీమలో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. రేపటి(అక్టోబర్ 22 బుధవారం) నుంచి మూడు రోజులపాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని.. మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
తూర్పు గోదావరి, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కృష్ణా, గుంటూరు జిల్లాలతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావం పెరిగే కొద్దీ వర్షాల తీవ్రత కూడా పెరగవచ్చని తెలిపారు. ఇవాళ (అక్టోబర్ 21)న పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలకు ఆస్కారం ఉంది.
22న బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, గుంటూరు, కృష్ణా, పల్నాడు, వైఎస్సార్ కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడొచ్చని అధికారులు తెలిపారు. 23న కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, బాపట్ల, ప్రకాశం, శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.