
ఎరువుల లారీని అడ్డుకున్న సర్పంచ్, రైతులు
మలకాం టీడీపీ సర్పంచ్ శ్రీనివాసరావు ఆరోపణ
ఎరువుల లారీకి అడ్డుగా నిలబడి నిరసన
పొందూరు: రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడిగాపులు పడుతుంటే... వచి్చన ఎరువుల్లో మంత్రులు చేతివాటం చూపుతున్నారని సాక్షాత్తూ అధికార పక్షం నాయకులే విమర్శిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం మలకాం గ్రామానికి రావాల్సిన ఎరువులను మంత్రి అచ్చెన్నాయుడే తరలించారంటూ టీడీపీ సర్పంచ్ జాడ శ్రీనివాసరావు ఆరోపించారు. సోమవారం మలకాం గ్రామానికి వచి్చన ఎరువుల లారీని బయటకు వెళ్లనీయకుండా సర్పంచ్‌తో పాటు రైతులు సచివాలయం వద్ద అడ్డుకున్నారు.
తమ గ్రామానికి పూర్తి స్థాయిలో ఎరువులు పంపాలని డిమాండ్ చేశారు. తొలివిడతలో 444 యూరియా బస్తాలు రాగా రెండో విడతలో వచి్చన ఎరువులను వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడే పక్కదారి పట్టించారని ఆయన ఆరోపించారు. తమ గ్రామానికి అధికారులు 330 బస్తాలు కేటాయించారని సర్పంచ్ చెప్పారు. అయితే సోమవారం 110 బస్తాలు మాత్రమే వచ్చాయని, మిగిలిన 220 బస్తాలు మాటేంటని ఆందోళన వ్యక్తం చేశారు. తమ గ్రామానికి రావాల్సిన ఎరువులు సరఫరా అయ్యేంత వరకు లారీలోని 110 బస్తాల లోడును దించబోమని, లారీని ఇక్కడ నుంచి వెళ్లనిచ్చే ప్రసక్తే లేదని అడ్డుగా నిలబడి నిరసన తెలిపారు.