దోపిడీదారులే ధర్నాలు చేయడం విడ్డూరం | Duvvada Srinivas Vocal About Sand Exploitation During Last Government Regime | Sakshi
Sakshi News home page

దోపిడీదారులే ధర్నాలు చేయడం విడ్డూరం

Nov 16 2019 8:52 AM | Updated on Nov 16 2019 8:52 AM

Duvvada Srinivas Vocal About Sand Exploitation During Last Government Regime - Sakshi

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న దువ్వాడ శ్రీనివాస్‌

సాక్షి, టెక్కలి: గత ప్రభుత్వ హయాంలో నారాలోకేష్‌ బినామీ సంస్థ బ్లూఫ్రాగ్‌ రూపొందించిన ‘మన శాండ్‌ యాప్‌’ ద్వారా లక్షల టన్నుల ఇసుక దోపిడీ చేసిన టీడీపీ నాయకులు ఇప్పుడు ఇసుక దీక్షల పేరుతో ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త దువ్వాడ శ్రీనివాస్‌ ధ్వజమెత్తారు. టెక్కలిలో శుక్రవారం విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేసి ఆయన మాట్లాడారు. ఇసుక దోపిడీపై ఎన్‌జీటీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ టీడీపీ ప్రభుత్వంపై వందల కోట్ల రూపాయలు జరిమాన విధించడాన్ని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పర్యావరణానికి నష్టం వాటిల్లకుండా ఇసుక సరఫరాలో సరికొత్త విధానాన్ని తీసుకువచ్చి అమలు చేస్తున్నారన్నారు. ఇసుక సరఫరాను ప్రైవేటు సంస్థ నుంచి ప్రభుత్వ సంస్థ అయిన ఏపీఎండీసీకి అప్పగించడం ద్వారా పారదర్శకతకు పెద్దపీఠవేశారని అన్నారు.

అయితే చంద్రబాబుకు బినామీగా ఉన్న బ్లూఫ్రాగ్‌ సంస్థ ద్వారా ఏపీఎండీసీ వెబ్‌సైట్‌ను హ్యాకింగ్‌ చేసి ఆన్‌లైన్‌లో ఇసుక బుకింగ్‌ జరగకుండా కుట్రలు పన్నారని దువ్వాడ ఆరోపించారు. కుట్రలు బయటపడడంతో సీఐడీ అధికారులు బ్లూఫ్రాగ్‌ సంస్థపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని పేర్కొన్నారు. ఇదే బ్లూఫ్రాగ్‌ సంస్థ ద్వారా ఎన్నికల ముందు ఏపీ ప్రజల వ్యక్తిగత సమాచారం సేకరించి ఓట్ల తొలగింపునకు టీడీపీ నాయకులు పాల్పడ్డారని అన్నారు. వీటన్నింటిపై ఏమాత్రం అవగాహన లేని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అసంబద్ధ ప్రేలాపనలు చేస్తున్నారని దువ్వాడ మండిపడ్డారు. 

పేదవారి పిల్లలు ఇంగ్లిష్‌లో చదవకూడదా..? 
పేదవాళ్ల పిల్లలు ఇంగ్లిష్‌ మీడియంలో చదువుకుని మంచి ఉద్యోగాల్లో స్థిరపడాలనే సదుద్దేశంతో సీఎం జగన్‌ ప్రభుత్వ పాఠశాల్లో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెట్టారని అన్నారు. దీనిపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లు ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారని అన్నారు. మీ పిల్లలు ఇంగ్లిష్‌ చదువులు చదవచ్చు.. పేదోడి పిల్లలు ఇంగ్లి‹Ùలో చదవకూడదా? అంటూ ప్రశ్నించారు. గత ప్రభుత్వ అవినీతి, అక్రమాలు.. పవన్‌కల్యాణ్‌ ప్యాకేజీలపై బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని దువ్వాడ సవాల్‌ విసిరారు. ఎన్నికల ముందు ప్రజలను మభ్య పెట్టేందుకు పేజీల కొద్దీ మేనిఫెస్టో విడుదల చేసిన మీకు, సింగిల్‌ పేజీ మేనిఫెస్టోతో.. అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఇచ్చిన అనేక హామీలను అమలు చేసి చూపించిన జగన్‌మోహన్‌రెడ్డిని విమర్శించే అర్హత లేదన్నారు. 

చంద్రబాబుది దొంగ దీక్ష : ఎమ్మెల్యే రెడ్డి శాంతి 
కొత్తూరు: రాష్ట్రంలో ఇసుక కొరత ఉందంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దొంగ దీక్షలు చేస్తున్నారని ఎమ్మెల్యే రెడ్డి శాంతి విమర్శించారు. అంగూరు వద్ద వంశధార నదిలో నిర్వహిస్తున్న ఇసుక రీచ్‌ను శుక్రవారం ఆమె పరిశీలించారు. రీచ్‌లో ఇసుక నిల్వల లభ్యత వివరాలను రీచ్‌ ఇన్‌చార్జి కూర్మరావు ఎమ్మెల్యేకు వివరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రెడ్డి శాంతి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో విచ్చలవిడిగా ఇసుక తవ్వకాలు చేపట్టడం వల్ల ఇసుక లభ్యత తగ్గిందన్నారు. ఇటీవల వర్షాలు, వరదల వల్ల ఇసుక సరఫరాలో కొంత జాప్యం నెలకొందన్నారు.

అంగూరు ఇసుక రీచ్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే రెడ్డి శాంతి   

అయినప్పటికీ ప్రజలకు తగినంత ఇసుక సరఫర చేస్తున్నట్లు చెప్పారు. మరో వారం రోజుల్లో వంశధార నదిలో మరికొన్ని రీచ్‌లు ప్రారంభిస్తామన్నారు. చంద్రబాబు పాలనలో ఉచిత ఇసుక పాలసీ పేరుతో జిల్లాలో టీడీపీ నేతలు కూన రవికుమార్, కలమట వెంకటరమణ, మాజీ మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు వారి అనుచరలు కోట్లాది రూపాయలు దోచుకున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు ఎస్‌.ప్రసాదరావు, మాజీ ఎంపీపీ చల్లం నాయుడు, గ్రంథాలయ సంస్థ జిల్లా మాజీ అధ్యక్షుడు తోట నందకుమార్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్‌.కన్నయ్య స్వామి, పార్టీ నేతలు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement