చూశారనే చంపేశాడు


అనంతపురం టౌన్, న్యూస్‌లైన్ : మడకశిరలో ఈ నెల మూడో తేదీన సంచలనం రేకెత్తించిన చిన్నారుల హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. నిందితుడు నరసింహప్పను బుధవారం సాయంత్రం అరెస్ట్ చేసి, అతడి నుంచి రూ.74 వేలు విలువ చేసే 26 గ్రాముల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు చిన్నారులకు స్వయానా బంధువు కావడం గమనార్హం. తాను దొంగతనం చేస్తుండగా చిన్నారులు చూశారనే హత్య చేశానని నిందితుడు పోలీసుల విచారణలో ఒప్పుకున్నాడు. ఇందుకు సంబంధించిన వివరాలను ఎస్పీ సెంథిల్‌కుమార్ గురువారం మీడియాకు వెల్లడించారు.

 

 మడకశిరలోని తలారి వీధిలో టీచర్ ఆనందప్ప కుటుంబం నివాసం ఉంటోంది. ఆనందప్పకు బంధువైన నీలకంఠాపురానికి చెందిన ఎన్.నరసింహప్ప తరచూ వీరి ఇంటికి వచ్చి వెళ్లేవాడు. వివాహితుడైన ఇతడికి కర్ణాటక రాష్ర్టం పావగడ తాలూకాలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. తన ఆర్థిక అవసరాల కోసం ప్రియురాలి ఆభరణాలను ఓ నగల దుకాణంలో తాకట్టుపెట్టాడు. అయితే ఇటీవల కాలంలో నగలు విడిపించాలని ఆమె నుంచి ఒత్తిడి పెరిగింది. ఏమి చేయాలో పాలుపోని నరసింహప్ప దొంగత నమే మార్గంగా ఎంచుకున్నాడు. ఈ నెల మూడో తేదీన టీచర్ దంపతులు ఆనందప్ప, సాకమ్మ స్కూలుకు వెళ్లాక వీరి ఇంటికి వచ్చాడు.

 

 పిల్లలు మంజువాణి (13), రంగనాథ్ (8)లు ఇంటికి గడియ పెట్టి సమీపంలోని దుకాణానికి వెళ్లారు. ఇదే అదనుగా భావించిన నరసింహప్ప సరిగ్గా 11.30 గంటల సమయంలో ఆ ఇంట్లోకి ప్రవే శించాడు. అందుబాటులో ఉన్న తాళాలతో బీరువా తెరిచి రూ.74 వేలు విలువ చేసే బంగారు గొలుసు, డాలర్, ఉంగరం జేబులో వేసుకున్నాడు. ఇంతలో రంగనాథ్ ఇంట్లోకి వచ్చి చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులను గమనించాడు. అక్కడే ఉన్న నరసింహప్ప.. ఆ బాలుడు తన గుట్టు ఎక్కడ విప్పుతాడోనని టవల్‌తో గొంతు బిగించి చంపేశాడు. కాసేపటి తర్వాత తమ్ముడిని పిలుస్తూ బయటి నుంచి మంజువాణి లోపలికి వచ్చింది.

 

 ఆ బాలిక ను కూడా నిర్దాక్షిణ్యంగా చున్నీతో గొంతు బిగించి హతమార్చి.. చోరీ చేసిన సొమ్ముతో ఉడాయించాడు. అభం శుభం తెలియని చిన్నారుల హత్య సంచలనం రేపింది. వారం వరకు చిన్న క్లూ కూడా లభించక పోవడంతో పోలీసుల పనితీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కేసును ఎస్పీ సవాల్‌గా తీసుకుని దర్యాప్తు ముమ్మరం చేయించారు. అదనపు ఎస్పీ టి.రామప్రసాదరావు పర్యవేక్షణలో పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు, మడకశిర, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్లు నాగరాజు, హరినాథ్, ఎస్‌ఐలు ధరణి కిశోర్, సద్గురుడు, ఆంజనేయులు, ఏఎస్‌ఐ బాలాజీ నాయక్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం కేసు దర్యాప్తు చేపట్టింది. బుధవారం సాయంత్రం నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేసి, అతని నుంచి బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు. గురువారం మడకశిర కోర్టులో హాజరు పరిచారు. మే 6వ తేదీ వరకు రిమాండ్ విధించడంతో నిందితున్ని హిందూపురం సబ్‌జైలుకు తరలించారు. కేసును చాకచక్యంగా ఛేదించిన డీఎస్పీ, డీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్లు, పోలీసు సిబ్బందిని ఎస్పీ అభినందించారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top