
దూబగుంట రోశమ్మ
నాటి సారా వ్యతిరేకోద్యమం సారధి దూబగుంట రోశమ్మ పేరుని పించను జాబితా నుంచి ఏపి రాష్ట్రప్రభుత్వం తొలగించింది.
నెల్లూరు: నాటి సారా వ్యతిరేకోద్యమం సారధి దూబగుంట రోశమ్మ పేరుని పించను జాబితా నుంచి ఏపి రాష్ట్రప్రభుత్వం తొలగించింది. పించనుకు అర్హురాలు అయినప్పటికీ తమ తల్లి పేరుని తొలగించారని ఆమె కుమారుడు చెప్పారు. తన తల్లి పేరు ఎందుకు తొలగించారని ఆమె కుమారుడు అధికారులను నిలదీశారు. తాము ఏమీ చేయలేమని, కమిటీ నివేదిక ప్రకారం తొలగించినట్లు వారు చెప్పారు. ఫిర్యాదు చేసుకోమని కూడా చెప్పారు.
దూబగుంట రోశమ్మ పేరు వింటేనే ఉద్యమకారులకు రోమాలు నిక్కబొడుచుకుంటాయి. 1993 ప్రాంతంలో రాష్ట్రవ్యాప్తంగా ఉవ్వెత్తున సాగిన సారా వ్యతిరేకోద్యమానికి నెల్లూరు జిల్లా కలికిరి మండలం దూబగుంట అనే కుగ్రామంలో శ్రీకారం చుట్టిన ధీరవనిత ఆమె. అప్పట్లో ఏ గ్రామంలోనైనా సరే సారా అమ్ముతున్నట్లు కనపడితే చాలు, మహిళలు అపర కాళికలుగా మారి దుకాణాలను ధ్వంసం చేసేవారు.
అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆమెను సన్మానించారు. గిన్నీస్ బుక్ రికార్డు కూడా దక్కింది. ఆమె ఉద్యమ ఫలితంగానే అప్పట్లో ఎన్టీఆర్ తాను గెలిచిన తర్వాత రాష్ట్రంలో సంపూర్ణ మద్యనిషేధాన్ని విధించారు. అప్పట్లో ఆమెకు ఎంతో సాయం చేస్తామని పాలకులు హామీలిచ్చారు. కాలక్రమంలో వాటిని మరిచిపోయారు. కాలచక్రం గిర్రున తిరిగింది. చంద్రబాబు అధికారంలోకి రాగానే మద్య నిషేధం కాస్తా ఎత్తివేశారు.
సారాపై ప్రజల్లో చైతన్యం నింపి, ఊరు పేరును ఇంటి పేరుగా మార్చుకున్న ఆమె వయసు 86 ఏళ్లు. ప్రస్తుతం ఆమె అనారోగ్యంతో, ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్నారు. అటువంటి రోశమ్మకు పించను నిలిపివేయడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది.
**