పోస్టులు పెంచమంటే కొట్టిస్తారా?

DSC Candidates Protests Against Chandrababu Naidu - Sakshi

సీఎం స్పందించకపోవడం దారుణం

గతంలో ప్రకటించిన పోస్టులను భర్తీ చేయమంటే అమానుషంగా ప్రవర్తిస్తారా?

చంద్రబాబు తీరుపై సర్వత్రా విమర్శలు

గుంటూరు, అవనిగడ్డ : ‘గతంలో 23 వేలు ఖాళీ పోస్టులు భర్తీ చేస్తామన్నారు. ఇప్పుడు 7 వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చారు. పోస్టులు పెంచాలని పెద్ద ఎత్తున ఆందోళనలు చేశాం.. అయినా పాలకుల్లో స్పందన లేదు. పోస్టులు పెంచమని బుధవారం సీఎం సభలో ప్లకార్డులు ప్రదర్శిస్తే ముఖ్యమంత్రి స్పందించకపోగా, పోలీసులతో దౌర్జన్యం చేయిస్తారా..’ అని డీఎస్సీ అభ్యర్థులు, ప్రజా సంఘాల నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి..
2016లో 23 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 2017లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన నివేదికలో 23 వేల పోస్టులు చూపించారు. అదే ఏడాది డిసెంబర్‌లో 17 వేల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. ఇప్పుడు 7 వేల పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వడంపై డీఎస్సీ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అవసరం లేకపోయినా ఈ ఏడాదిలో రెండు సార్లు టెట్‌ పరీక్షలు నిర్వహించారని, ఇప్పుడేమో టెట్‌ అవసరం లేదంటున్నారని పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రే స్పందించకపోతే ఎవరికి చెప్పుకోవాలి..
గతంలో ప్రకటించిన విధంగా 23 వేల డీఎస్సీ పోస్టులు ఇవ్వాలని చల్లపల్లిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సభలో శాంతియుతంగా ప్లకార్డుల ప్రదర్శన చేసినా సీఎం స్పందింకపోవడం దారుణమన్నారు. పోలీసులు బలవంతంగా తీసుకెళ్తున్నా పట్టించుకోలేదని, ముఖ్యమంత్రే ఇలా వ్యవహరిస్తే మేమెవరికి చెప్పుకోవాలని పలువురు డీఎస్సీ అభ్యర్థులు ప్రశ్నిస్తున్నారు. సీఎం స్పందించకపోగా రౌడీలు, గూండాల వలె తమను పలు పోలీస్‌ స్టేషన్లకు తరలించి ఇబ్బందులు పెట్టడం ఎంతవరకు సమంజసమని నిలదీస్తున్నారు. డీఎస్సీ కోసం నాలుగేళ్లుగా అహర్నిశలు శ్రమిస్తున్నామని, పోస్టులు తగ్గించడం వల్ల తీవ్రంగా నష్టపోతామని పలువురు అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి స్పందించి 23వేల పోస్టులు భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నారు.

ప్రయివేట్‌ ఉద్యోగాలు మానుకుని వచ్చాం..
23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ వేస్తామని చెబితే ప్రయివేటు ఉద్యోగాలు, పనులు అన్నీ మానుకుని డీఎస్సీకి ప్రిపేర్‌ అవుతున్నాం. రెండుసార్లు టెట్‌ పెట్టారు. ఇప్పుడేమో అవసరం లేదంటున్నారు. అప్పులు తెచ్చి డీఎస్సీకి ప్రిపేర్‌ అవుతుంటే ఏడు వేల పోస్టులు వేయడం వల్ల తీవ్రంగా నష్టపోయాం. గతంలో ప్రకటించిన విధంగా డీఎస్సీ పోస్టులు పెంచాలి.
– సీహెచ్‌ కిశోర్, రెడ్డిగూడెం, కృష్ణా జిల్లా

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top