సాహితీ ప్రసంగంలో ద్వా.నా.శాస్త్రి రికార్డు


హైదరాబాద్, న్యూస్‌లైన్: ప్రముఖ రచయిత, పోటీ పరీక్షల విద్యార్థులకు తెలుగు పాఠాలు బోధించే ప్రముఖ సాహితీవేత్త, సాహిత్య సవ్యసాచి డాక్టర్ ద్వాదశి నాగేశ్వర శాస్త్రి (ద్వా.నా.శాస్త్రి) సాహిత్య ప్రసంగంలో సరికొత్త రికార్డు నెలకొల్పారు. ఏకధాటిగా 12 గంటలపాటు తెలుగు భాషా సాహిత్యాలపై ప్రసంగించారు. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా, వంశీ విజ్ఞాన పీఠం ఆధ్వర్యంలో ఆదివారమిక్కడి శ్రీ త్యాగరాయ గానసభలో ఉదయం 8 గంటలకు నుంచి సాయంత్రం 8 గంటల వరకు ఆయన ప్రసంగధార కొనసాగింది.

 

 ఉదయం ఏడున్నర గంటలకు రాష్ట్ర సాంస్కృతిక శాఖ సంచాలకులు డా. రాళ్లబండి కవితా ప్రసాద్ జ్యోతి వెలిగించి సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా రాళ్లబండి ప్రసంగిస్తూ.. తెలుగు భాషపై సాధికారత, సాహిత్యంలోని అన్ని ప్రక్రియలపై సమగ్ర అవగాహన, లోతైన అధ్యయనం ఉంటేనే ప్రసంగధార విజయవంతమవుతుందని చెబుతూ ద్వా.నా.శాస్త్రికి సాహిత్యంలోని అన్ని ప్రక్రియలలో సాధికారత ఉందని పేర్కొన్నారు.

 

 అనంతరం ద్వా.నా.శాస్త్రి తన నిర్విరామ ప్రసంగధారలో తెలుగు భాష పుట్టు పూర్వోత్తరాలు, కవిత్వ నిర్వచనాలు, ప్రయోజనాలు, జానపద సాహిత్యం, కవిత్రయ భారతం, శ్రీనాథయుగం, రాయలయుగం, పదకవిత్వం, శతక సాహిత్యం, ఆధునిక కావ్యాల్లో మైలురాళ్లు, కవితోద్యమాలు, ఆధునిక వచన ప్రక్రియలు, ఆధునిక కవితా రూపాలను వివరించారు. సాయంత్రం జరిగిన ముగింపు సభలో రిటైర్డ్ జడ్జి జస్టిస్ సముద్రాల గోవిందరాజులు, బైస దేవదాసు, కళాదీక్షితులు, డా.తెన్నేటి సుధాదేవి, వంశీ రామరాజు, తె లుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి సి.హెచ్. వెంకటాచారి, బి.ఎన్.గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్వా.నా.శాస్త్రిని ఘనంగా సత్కరించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top