గోదావరి – కృష్ణా అనుసంధానంపై ముసాయిదా డీపీఆర్‌ సిద్ధం

DPR drafted on Godavari-Krishna integration - Sakshi

ఈ ప్రాజెక్టుకు ఆర్థిక సహాయం అందించాలని ఏపీ సీఎం కోరారు 

రాజ్యసభలో వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు జల శక్తి మంత్రి జవాబు

సాక్షి, న్యూఢిల్లీ: గోదావరి నుంచి కృష్ణా, కృష్ణా నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్లింపు కోసం నేషనల్‌ వాటర్‌ డవలప్‌మెంట్‌ ఏజెన్సీ (ఎన్‌డబ్లు్యడీఏ) ముసాయిదా సమగ్ర ప్రాజెక్టు నివేదిక రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌ షెకావత్‌ సోమవారం రాజ్యసభలో వివరించారు. వైఎస్సార్సీ పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆదుకునేందుకు గోదావరి బేసిన్‌ నుంచి కృష్ణా బేసిన్‌కు నీరు మళ్లించే అవకాశాలను పరిశీలించవలసిందిగా కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌æ ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని వివరించారు.

గోదావరి–కృష్ణా నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా సీఎం కోరినట్లు మంత్రి చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై ఎన్‌డబ్లు్యడీఏ సిద్ధం చేసిన ముసాయిదా డీపీఆర్‌పై తమ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతూ సంబంధిత రాష్ట్రాలకు పంపించినట్లు షెకావత్‌ చెప్పారు. గోదావరి–కావేరీ లింక్‌ ప్రాజెక్ట్‌లో ప్రధానంగా మూడు లింక్‌లు ఉంటాయని, ఆయా ప్రాజెక్ట్‌ల ద్వారా నిరుపయోగంగా పోతున్న 247 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. గోదావరి–కృష్ణా లింక్‌  ప్రాజెక్ట్‌ ద్వారా కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 3.45 లక్షల నుంచి 5.04 లక్షల హెక్టార్ల భూములకు ఏటా సాగునీటి వసతి కల్పించవచ్చని చెప్పారు. నదుల అనుసంధానం ప్రాజెక్ట్‌పై సంబంధిత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన అనంతరం తుది డీపీఆర్‌ రూపొందించి, చట్టపరమైన అనుమతులు పొందిన తరువాత పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు.

సాగరమాల కింద ఏపీలో 32 రోడ్డు, 21 రైల్‌ ప్రాజెక్ట్‌లు
సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్‌ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు 32 రోడ్డు, 21 రైల్‌ప్రాజెక్ట్‌లు కేటాయించినట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్‌ మాండవీయ సమాధానమిచ్చారు.

ఏపీలోని 9 జిల్లాల్లో సంప్రదాయ పారిశ్రామిక క్లస్టర్లు
సాంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రత్యేక నిధితో ఒక పథకాన్ని ప్రారంభించినట్లు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మంత్రి నితిన్‌గడ్కరీ రాజ్యసభలో చెప్పారు. విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ ఈ పథకంలో భాగంగా ఖాదీ, క్వాయర్, విలేజ్‌ ఇండస్ట్రీస్‌ ఆధ్వర్యంలో సంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసి తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఏపీలోని చిత్తూరు (కలంకారీ), విజయనగరం (క్వాయర్‌ పరుపుల తయారీ), చిత్తూరు (క్వాయర్‌ ఉత్పాదనలు), కృష్ణా (కొండపల్లి బొమ్మలు), తూర్పుగోదావరి (జొన్నాడ ఫుడ్‌ప్రాసెసింగ్‌), చిత్తూరు (చింతపండు), గుంటూరు (మంగళగిరి బంగారు ఆభరణాలు), తూర్పు గోదావరి (కడియపులంక కొబ్బరిపీచు ఉత్పాదనలు) జిల్లాల్లో మొత్తం 9 సంప్రదాయ పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top