ఆమె అందరికీ అమ్మ

 Doing Social Service For Tribals As Responsible Citizen - Sakshi

జట్టు ఆశ్రమ నిర్వాహకురాలు పద్మజ

సాక్షి, విజయనగరం : ఆమె అందరు ఆడపిల్లల్లాగే చదువుకుంది. గ్రూప్‌–1 ఉద్యోగాన్ని సంపాదించింది. ఆకర్షణీయమైన ప్రభుత్వ ఉద్యోగం.. హాయిగా పెళ్లి చేసుకొని సంతోషంగా ఉండొచ్చు.. కానీ ఆమె ఆలోచనలు మాత్రం అందుకు భిన్నంగా ఉన్నాయి. సమాజ సేవ చేయాలి. ఆ సేవ చేయడంలోనే ఆనందం పొందాలి.. ఆ ఆలోచనలతోనే ఆమె అన్నింటినీ త్యజించి అనాథలకు సేవ చేయాలని నిర్ణయించుకుంది. ఆలోచన రావడమే మొదలు ఇక ఆగలేదు. సమాజ సేవే లక్ష్యంగా ముందుకెళ్తూ.. ప్రస్తుతం అందరికీ అమ్మ అయ్యింది.

ఆమె ప్రకాశం జిల్లాకు చెందిన వెనిగండ్ల పద్మజ. ఎమ్మెస్సీ చదివిన పద్మజ ప్రకాశం జిల్లాలో ఎంపీడీఓగా, హైదరాబాద్‌లో చైల్డ్‌ లేబర్‌ కో–ఆర్డినేటర్‌గా పనిచేశారు. అయినప్పటికీ ఆమెకు ఆ ఉద్యోగాలు సంతృప్తిని ఇవ్వలేదు. అభాగ్యులకు సేవచేయాలి.. అందులోనే నిజమైన ఆనందం పొందాలని భావించారు. అమాయక గిరిజనులకు సేవ చేయాలనే ధృడ సంకల్పం ఆమెలో మెండుగా ఉండేది. దీంతో శ్రీకాకుళం జిల్లా సీతంపేట ఏజన్సీలో గిరిజనులకు సేవలు అందించాలని నిర్ణయించారు. అప్పట్లో సెర్స్‌ సీఈఓగా పనిచేసిన విజయకుమార్‌ పరిచయంతో విజయనగరం జిల్లా పార్వతీపురంలోని జట్టు ఆశ్రమాన్ని సందర్శించారు.

2004లో జట్టు ఆశ్రమాన్ని చూసేందుకు వచ్చిన ఆమె ఇక్కడి పిల్లలు, వాతావరణాన్ని చూసి ఈ ప్రాంత గిరిజనులకు సేవ చేయాలని నిర్ణయించుకున్నారు. 2007లో పూర్తిగా కుటుంబ సభ్యులను విడిచిపెట్టి కట్టుబట్టలతో వచ్చేశారు. అప్పటినుంచి ఆశ్రమ బాధ్యతలు ఎన్నో ఒడిదొడుకుల నడుమ నిర్వర్తిస్తూ ఆశ్రమంలోని పిల్లలకు ఆమ్మయ్యారు. వివాహం చేసుకుంటే ఆ బంధం ఎక్కడ అడ్డు వస్తుందో.. ఎక్కడ సమస్యలు ఉత్పన్నమవుతాయో అని భావించి ఒంటరిగా ఉంటున్నారు. పిల్లల యోగ క్షేమాలను చూసుకుంటున్నారు.

నాటి నుంచి నేటి వరకు 150 మంది వరకు పిల్లలను అక్కున చేర్చుకుని చదివిస్తున్నారు. ఏటా నలుగురైదుగురు పిల్లల వివాహాలు కూడా చేస్తున్నారు. ఆశ్రమాన్ని ఎంతో అభివృద్ధి చేశారు. గాంధేయ మార్గంలో తెలుపు నూలు వస్త్రాలను ధరిస్తూ సాదాసీదా జీవితాన్ని గడుపుతున్నారు. సమాజ సేవ చేయడంలో తాను పొందుతున్న ఆనందం చెప్పలేనిదని.. అది అనుభవిస్తే తప్ప అర్థం కాదంటున్నారు. స్త్రీ శక్తిమంతురాలని.. ఆ శక్తిని పదిమందికి ఉపయోగపడేలా  వినియోగించాలి తప్ప.. వినిమయ వస్తువుగా మిగిలిపోరాదని హితవు పలికారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top