మీ ఊరు గుర్తుందా.. ఎమ్మెల్యే సారు..?

Do You Remember Your Village .. MLA Sir? - Sakshi

సాక్షి, పెడన: బంటుమిల్లి  మండలంలోని నాగేశ్వరరావుపేట పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు స్వగ్రామం. నాగేశ్వరరావు పేట  పంచాయతీ పరిధిలో లక్ష్మీనారాయణపురం, జానకీరామపురం, గార్లగుంట శివారు గ్రామాలున్నాయి. కాగిత వెంకట్రావు 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. ఒకసారి టీటీడీ బోర్డు  చైర్మన్‌గాను, అంచనాల కమిటీ చైర్మన్, పబ్లిక్‌ అకౌంట్‌ కమిటీ చైర్మన్‌గాను, చీఫ్‌విప్‌గా చేసిన ఘనతా ఉంది. ఇన్ని పదవులు అలంకరించినా స్వగ్రామైన పంచాయతీలోని గ్రామాలు అభివృద్ధికి దూరంగానే ఉన్నాయి. రహదార్ల  నిర్మాణం, తాగునీటి సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉంది. జానకీరామపురం, లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో పేదలకు ఇచ్చిన కాలనీల్లో అనర్హులు పట్టాలు దక్కించుకున్న ఆరోపణలున్నాయి.

వారు స్థలాలను ఇతరులకు అమ్ముకుని సొమ్ము చేసుకున్నారట.  ప్రభుత్వం ప్రకటించిన ఇంటింటికీ కుళాయి పథకం ఎమ్మెల్యే కాగిత  స్వగ్రామంలో ప్రారంభానికి నోచుకోలేదు. ఎమ్మెల్యేగా 20 సంవత్సరాలు ఉన్నా కనీసం సొంత పంచాయతీ పరిధిలో మౌలిక సౌకర్యాల కల్పించ లేకపోయారు. కేంద్ర ప్రభుత్వం పుణ్యమా అని ఎన్‌ఆర్‌ఈజిఎస్‌ నిధులతో ఏర్పడిన సీసీ రోడ్లు తప్ప 20 సంవత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం నిర్మించిన రోడ్లు బహు అరుదు అని గ్రామస్తులు వ్యంగ్యంగా చెబుతుంటారు.  నాగేశ్వరరావుపేట గ్రామాన్ని ఆనుకుని బంటుమిల్లి ప్రధాన కాలువ ఉన్న గ్రామంలో తాగునీటికి గ్రామస్తులు ఎక్కువగా ఊట బావులపైనే ఆధారపడుతున్నారు. గార్లగుంట దళితవాడ రోడ్డు  నిర్మాణంలో నాణ్య ప్రమాణాలు మృగ్యమయ్యాయి.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top