తెర..చిరిగింది | distribution of mosquito nets in manyam | Sakshi
Sakshi News home page

తెర..చిరిగింది

Aug 8 2015 12:36 AM | Updated on Sep 3 2017 6:59 AM

తెర..చిరిగింది

తెర..చిరిగింది

మన్యంలో గిరిజనులకు పంపిణీ చేసిన దోమ తెరల కాలం చెల్లింది. ప్రస్తుతం ఆదివాసీలకు ఇవి అందుబాటులో లేవు.

మన్యంలో పంపిణీకాని దోమ తెరలు
దృష్టి సారించని సర్కారు
మలేరియాతో  ఆదివాసీలు సతమతం

 
 పాడేరు: మన్యంలో గిరిజనులకు పంపిణీ చేసిన దోమ తెరల కాలం చెల్లింది. ప్రస్తుతం ఆదివాసీలకు ఇవి అందుబాటులో లేవు. గ్రామాలలో దోమల బెడద ఎక్కువైంది. ఏజెన్సీ అంతటా మలేరియా ప్రబలుతోంది. ఏటా ఎపిడమిక్‌లో ఆదివాసీలు మలేరియాతో సతమతం కావడం సాధారణం. ఈ మహమ్మారి  తీవ్రత దృష్ట్యా 2011-12లో 3,566 గ్రామాలలో 1,17,806 కుటుంబాలకు 3 లక్షల 866  దోమ తెరలను ప్రభుత్వం పంపిణీ చేసింది. దోమల నివారణకు దోహదపడేలా సింథటిక్ పెరిథ్రిన్ మందు పూతతో ప్రత్యేకంగా తయారు చేసిన దోమ తెరలను ఉగాండా దేశం నుంచి తెప్పించారు. 3 నుంచి 5గురు సభ్యులు ఉన్న ఒక్కో కుటుంబానికి రెండు చొప్పున, ఆరుగురు పైబడిఉన్న కుటుంబాలకు 3 చొప్పున అందజేశారు. వీటి వల్ల ఏజెన్సీలో మలేరియా తీవ్రత కొంత తగ్గుముఖం పట్టింది. వీటి వినియోగకాలం రెండేళ్లే. అంటే 2013-14లో వీటిని మళ్లీ పంపిణీ చేయాలి. ఈమేరకు దోమ తెరల కోసం అధికారులు ప్రతిపాదించినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఏజెన్సీలో ఏటా ఏప్రిల్ నుంచి నవంబరు వరకు మలేరియా విజృంభిస్తుంటుంది.

ఈ కాలంలో ఇక్కడి వారికి దోమ తెరల వినియోగం తప్పనిసరి. నిద్రించే సమయంలో దోమలు కుట్టడం వల్లే మలేరియా ప్రబలుతున్నట్లు వైద్యాధికారులు నిర్ధారించారు. దోమల నివారణకు గ్రామాల్లో ఆల్ఫాసైనో మైథీన్(మలేరియా నివారణ మందు)ను పిచికారీ చేస్తున్నప్పటికీ మలేరియా అదుపులోకి రావడం లేదు. ఈ ఏడాది రెండు విడతలుగా హైరిస్క్ గ్రామాలు (2,550)లో స్ప్రేయింగ్ నిర్వహించారు. అయినప్పటికీ వ్యాధి తగ్గుముఖం పట్టే చాయలు లేవు. ఇప్పటికే ఏజెన్సీలో 5వేలకు పైగా మలేరియా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఎనాఫిలస్ దోమ కారణంగా ఫాల్సీఫారం మలేరియా ప్రబలుతోంది. ఇది సెరిబ్రెల్‌కు దారి తీసి మరణాలు చోటుచేసుకుంటున్నాయి. దీని నివారణకు దోమ తెరల పంపిణీయే శ్రేయస్కరమని వైద్య నిపుణుల బృందం అధ్యయనం ద్వారా తేలింది. అయితే వీటి పంపిణీ ఒక్కసారికే పరిమితమైంది. పోషకాహార కొరతను ఎదుర్కొంటున్న గిరిజనులు మలేరియా జ్వరాలతో మృత్యువాత పడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement