
అభివృద్ధి చేసిన ఐసీఎంఆర్
న్యూఢిల్లీ: దోమకాటు ద్వారా సోకే మలేరి యా వ్యాధితో దేశ వ్యాప్తంగా ప్రతిఏటా వేలాది మంది మర ణిస్తున్నారు. ప్రాణాంతక మలేరియాను అరికట్టడానికి భారత వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్) దేశీయ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసింది. భువనేశ్వర్‌లోని రీజినల్ మెడికల్ రీసెర్చ్ సెంటర్, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్(ఎన్‌ఐఎంఆర్), నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇమ్యూనాలజీకి చెందిన డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ భాగస్వామ్యంతో ‘అడ్‌పాల్సి వ్యాక్స్’ పేరిట పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఈ టీకాను అభివృద్ధి చేసింది.
మలేరియా వ్యతిరేక పోరాటంలో ఈ టీకా కీలక అస్త్రం అవుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఇది రీకాంబినెంట్ మల్టీస్టేజ్ వ్యాక్సిన్ అని అంటున్నారు. ఇప్పటిదాకా నిర్వహించిన క్లినికల్ ప్రయోగాల్లో ఆశించిన ఫలితాలు లభించాయి. టీకా తీసుకున్న వారికి మలేరియా నుంచి పూర్తి రక్షణ లభించడంతోపాటు రోగ నిరోధక శక్తి తగ్గే ముప్పును ఇది గణనీయంగా నివారిస్తున్నట్లు తేలింది. మనుషుల్లో ప్లాస్మోడియం ఫాల్సిపరమ్ ఇన్ఫెక్షన్‌ను సమర్థంగా అడ్డుకుంటున్నట్లు వెల్లడయ్యింది. ‘అడ్‌పాల్సివ్యాక్స్’ తయారీ, విక్రయం కోసం అర్హత కలిగిన కంపెనీలకు లైసెన్స్‌లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఐసీఎంఆర్ ప్రకటించింది. ఆయా కంపెనీల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ(ఈఓఐ) దరఖాస్తులను ఆహ్వానించింది.