మెక్కేశారు | disqualified as if exploited, robbed | Sakshi
Sakshi News home page

మెక్కేశారు

Oct 23 2014 3:45 AM | Updated on Sep 2 2017 3:15 PM

మెక్కేశారు

మెక్కేశారు

దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లుగా దోచుకున్నారు. విద్యార్థులకు అండదండగా నిలవాల్సిన యంత్రాంగం చేతివాటం ప్రదర్శిస్తోంది.

సాక్షి ప్రతినిధి, కడప: దోపిడీకి కాదేది అనర్హం అన్నట్లుగా దోచుకున్నారు. విద్యార్థులకు అండదండగా నిలవాల్సిన యంత్రాంగం చేతివాటం ప్రదర్శిస్తోంది. విద్యార్థుల నుంచి చేపట్టిన వసూళ్లు, ప్రభుత్వం మంజూరు చేసిన నిధులు మెక్కేశారు. క్రీడా విద్యార్థులకు సౌకర్యాలను కాలరాస్తూ స్పెషల్ ఆఫీసర్ పాలన అవినీతి మయంగా మారింది. ఒక్కొక్కటిగా అనేక రుజువులున్నా పాలకులకు అవేవీ కన్పించడం లేదు.. విన్పించడం లేదనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కడప గడపలో క్రీడా పాఠశాలను వరంగా ప్రజానీకం భావించారు.

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నెలకొల్పిన క్రీడా పాఠశాల దినదినాభివృద్ధి  చెందుతోంది.  సదుద్ధేశంతో ఏర్పాటు చేసిన పాఠశాలలో కొందరు రాబందుల్లా చేరారు. దీంతో అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగు చూశాయి. ప్రభుత్వ నిధులను యథేచ్ఛగా దుర్వినియోగం చేస్తూ వచ్చారు. క్రీడా పాఠశాల అభివృద్ధి మాటున అక్రమాలు తెరపైకి  రాలేకపోయాయి. విద్యార్థుల ఇన్సూరెన్స్ నిధులను కూడా మింగేశారు. నిత్యం సాహసాలతో వ్యవహరించే విద్యార్థులకు ప్రమాదాలు ఎలా పొంచి ఉంటాయో తెలియని పరిస్థితి. అలాంటి వారికి ప్రభుత్వమే ఇన్సూరెన్సు చేయించాల్సి ఉండగా తద్భిన్నంగా వ్యవహరించారు. ప్రభుత్వ నిధులు దేవుడెరుగు విద్యార్థుల నుంచి సుమారు రూ.2లక్షలు కాజేశారు.
 
ట్రాక్ షూట్ సైతం....

క్రీడా విద్యార్థులకు ట్రాక్ షూట్, బూట్లు అందించాల్సి ఉంది. అయితే అక్కడి సూపర్‌వైజర్లు ఒక్కొక్క విద్యార్థి నుంచి రూ.1600 వసూలు చేశారు. విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన షూట్‌నే అందిస్తూ ఆ మొత్తం కాజేసినట్లు తెలుస్తోంది. విద్యార్థుల ఇన్సూరెన్సు కోసం మంజూరు చేసిన మొత్తం, ట్రాక్ షూ పేరిట మంజూరు అయిన మొత్తం ఓ ఉన్నతాధికారికి సమర్పించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా అవినీతి ఆరోపణలపె క్లీన్‌చిట్ లభించినట్లు సమాచారం. ప్రస్తుతం క్రీడా పాఠశాల స్పెషల్ ఆఫీసర్‌గా డిప్యూటీ డీఈఓ ప్రసన్నాంజనేయులు బాధ్యతలు నిర్వరిస్తున్నారు. విద్యార్థుల ఇన్సూరెన్సు కోసం మంజూరైన నిధులు కాజేసినట్లు తెలిసినా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు.
 
ఇన్సూరెన్స్ కోసం డబ్బులు చెల్లించాం..

ఇన్సూరెన్స్‌కు డబ్బులు చెల్లించాలని అధ్యాపకులు చెప్పడంతో గతేడాది చెల్లించాం. రూ.1200 చెల్లించాం. ఏవైనా గాయాలు తగిలితే డబ్బులు వస్తాయని చెప్పారు. అయితే ఇన్సూరెన్సు చెల్లించలేదని తెలుస్తోంది.
 - ప్రసాద్, (ప్రకాశంజిల్లా) 9వ తరగతి విద్యార్థి,

రూ. 1200 చెల్లించాం..
మీ పేరుమీద ఇన్సూరెన్స్ చేయిస్తాం.. డబ్బులు చెల్లించాలని అధికారులు తెలిపారు.  2013లో 6వ తరగతి చదువుతున్నప్పుడు రూ.1200 కట్టాను. ఏవైనా సామాగ్రి పోగొట్టినా, ఏవైనా గాయాలు తగిలినా ఇన్సూరెన్స్ వస్తుందని చెప్పారు.
 - శ్రీనివాస్,  (నిజామాబాద్ జిల్లా) 7వ తరగతి

 గాయాలైతే.. ఇన్సూరెన్స్ వస్తుందని..
 ఏవైనా దెబ్బలు తగిలినా అనుకోని సంఘటనలు జరిగితే ప్రభుత్వం డబ్బులు చెల్లిస్తుందని పాఠశాలలో చేరిన తొలి సంవత్సరం రూ. 1200 చెల్లించాలని చెప్పారు. 4వ తరగతిలో ప్రవేశం పొందినప్పుడు డబ్బులు చెల్లించా.
 - టి. సౌజన్య, (చిత్తూరు జిల్లా) 5వ తరగతి,

కొందరు చెల్లించారు.. మరికొందరు చెల్లించలేదు..
అందరూ ఇన్సూరెన్స్ చేయించుకోవాలని అధికారులు చెప్పారు. ఇష్టం ఉన్న వారు చేయించుకున్నారు.. లేనివారు చేయించుకోలేదు. 4వ తరగతిలో ప్రవేశం పొందన వెంటనే రూ. 1200 చెల్లించాను.
 - అశ్విని, (మహబూబ్‌నగర్), 5వ తరగతి,
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement