
గ్యాస్ సబ్సిడీ గల్లంతు
గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ వ్యవహారం రోజురోజుకూ గందరగోళంగా మారుతోంది. ఆధార్ నంబరు ఇచ్చినా బ్యాంకుల్లో అనుసంధానం కాని పరిస్థితి కొందరిది..
- సగం మందికి ఎగనామం
- సబ్సిడీ లేకుండా సొమ్ము వసూలు
- 10 వేల మంది బాధితులు
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : గ్యాస్ వినియోగదారులకు సబ్సిడీ వ్యవహారం రోజురోజుకూ గందరగోళంగా మారుతోంది. ఆధార్ నంబరు ఇచ్చినా బ్యాంకుల్లో అనుసంధానం కాని పరిస్థితి కొందరిది.. ఆధార్ అనుసంధానమైనా సబ్సిడీ సొమ్ము బ్యాంకుల్లో పడని స్థితి మరికొందరిది. అసలు ఆధార్ అనుసంధానమే అక్కర్లేదంటూ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా దానిని నేటికీ అమలులోకి తీసుకురాకపోవడంతో వినియోగదారులు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ ప్రక్రియను సమీక్షించేందుకు ఆయా శాఖల అధికారులను సమన్వయం చేసే నాథుడే కరువయ్యారు.
సబ్సిడీ లేకుండా వసూళ్లు...
సబ్సిడీ గ్యాస్‌కు ఆధార్ లింక్ తీసేస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినా ఆ మేరకు ఉత్తర్వులు ఏజెన్సీలకు నేటికీ అందలేదు. ఫలితంగా ఆధార్ నంబరు బ్యాంకు ఖాతాలకు అనుసంధానం కాని వినియోగదారుల నుంచి ఏజెన్సీలు సబ్సిడీ లేకుండా రూ.1210 వసూలు చేస్తున్నాయి. ఆధార్ నంబరు రానివారు, బ్యాంకులతో అనుసంధానం కానివారు సబ్సిడీ లేకుండా గ్యాస్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.
వారం రోజులుగా నానా ఇక్కట్లు...
జిల్లాలో గత వారం రోజులుగా ఆధార్ నంబర్లు ఇచ్చిన వారికి కూడా సబ్సిడీ సొమ్ము బ్యాంకులకు సరిగా పడటం లేదని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. గ్యాస్ ఏజెన్సీల వద్ద సబ్సిడీ సొమ్ము వినియోగదారుల ఖాతాల్లో పడిపోయిన ట్లు చూపిస్తోంది. వాస్తవానికి అవి ఖాతాల్లో జమపడటం లేదు. జిల్లాలో 74 గ్యాస్ ఏజెన్సీలు ఉండగా విజయవాడ నగరంలో 21 ఉన్నాయి. ఒక్కో గ్యాస్ ఏజెన్సీలో ఫిబ్రవరిలో 100 నుంచి 200 మంది వరకు వినియోగదారులకు బ్యాంకులో సబ్సిడీ సొమ్ము జమ కాలేదు.
ఈ లెక్కన జిల్లాలో 74 ఏజెన్సీలలో పదివేల మందికిపైగా వినియోగదారులకు సబ్సిడీ జమకాలేదని గ్యాస్ ఏజెన్సీల నిర్వహణ ద్వారా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన వినియోగదారులు సబ్సిడీ సొమ్ము కోసం నానా ప్రయాసలు పడుతున్నారు. ఈ సమస్యపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని వారు కోరుతున్నారు.