Sakshi News home page

ఉద్యమంలా డిజిటల్ ఇండియా కార్యక్రమం

Published Sun, Jul 5 2015 2:23 AM

ఉద్యమంలా డిజిటల్ ఇండియా కార్యక్రమం

- ర్యాలీని ప్రారంభించిన జాయింట్ కలెక్టర్ చంద్రుడు
విజయవాడ :
డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగస్వామ్యం అవ్వడం ద్వారా పర్యావరణ పరిరక్షణకు మనవంతు బాధ్యత నిర్వహించినట్లేనని జాయింట్ కలెక్టర్ గంధం చంద్రుడు విద్యార్థులకు పిలుపునిచ్చారు. స్థానిక బెంజిసర్కిల్ వద్ద 2కె డిజిటల్ ఇండియా ర్యాలీని శనివారం ఆయన ప్రారంభించారు.

ర్యాలీ బందరు రోడ్డులోని సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. అనంతరం జేసీ మాట్లాడుతూ డిజిటల్ ఇండియా కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేసేందుకు ఆధార్ నంబర్‌ను అనుసంధానంగా సంబంధిత వ్యక్తుల సర్టిఫికెట్లు తదితర ధ్రువపత్రాలను భద్రపర్చుకొనే సౌలభ్యం కల్పించినట్లు వివరించారు. ఈ విధానం ద్వారా విద్యార్థులు సర్టిఫికెట్లను అంతర్జాలంలో ఉంచుకోవడం ద్వారా పూర్తి భద్రతకు అవకాశం ఉందన్నారు.

ప్రతి నిత్యం కోట్ల కొద్ది పేపర్ల ద్వారా లావాదేవీలు నిర్వహించాల్సి ఉన్న నేపథ్యంలో పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ డిజిటల్ లాకర్‌ను పొందాలని అన్నారు. మీ-సేవా కేంద్రాల్లో నమోదు చేసుకునే అవకాశం కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు. ప్రాంతీయ ఇంటర్మీడియెట్ అధికారి రాజారావు, జిల్లా ఎన్‌ఐసీ అధికారి శర్మ, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి రామకృష్ణ, అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు పాల్గొన్నారు.

Advertisement
Advertisement