శవాలై తిరిగొచ్చారు..

Died In Drainage Three Students - Sakshi

ముగ్గురు చిన్నారులను బలిగొన్న రాజధాని రహదారి

అంతర్గత డ్రెయినేజీ కోసం తీసిన గుంతలో దిగి మృత్యువాత

శోకసంద్రంలో తల్లిదండ్రులు

ఆ పసి మొగ్గలకు నీళ్లలో దిగి ఆడుకుంటే బాగుంటుందని తెలుసు.. కానీ నీళ్లలో ఈదాలని మాత్రం తెలియదు. తోటి మిత్రులతోపాటు కుంటలో తామూ దిగాలని తెలుసు.. కానీ ఆ కుంట ఎంత లోతు ఉంటుందో మాత్రం తెలియదు.అందరూ కలిసి నీళ్లలో ఉత్సాహంగా మునిగి తేలొచ్చని తెలుసు.. కానీ ఆ నీళ్లలో మునిగితే ఊపిరాడదని మాత్రం తెలియదు. గుంతలో దిగితే అమ్మనాన్న దండిస్తారని తెలుసు.. కానీ ఆ గుంత తమను మింగేస్తే వారి గుండెలు బద్దలవుతాయని మాత్రం తెలియదు.అందుకే రాజధాని ప్రాంతంలో అభంశుభం తెలియని ముగ్గురు చిన్నారులు రహదారి డ్రెయినేజీ గుంతలో పడి మృత్యువు ఒడిలో మునిగిపోయారు.పట్టుమని పదేళ్లు నిండకుండా కన్నపేగుపై నూరేళ్లకు సరిపడా విషాదం మిగిల్చి శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.   

దొండపాడు(తుళ్లూరురూరల్‌) : ఇంటిలో సందడిగా అప్పటి వరకు కళ్లెదుట అడుకున్న పిల్లలు అనంతలోకాలకు వెళ్లారనే సమాచారం తెలియడంతో ఆ తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. తుళ్లూరు మండలం దొండపాడు గ్రామానికి చెందిన ముగ్గురు చిన్నారులు శనివారం ఎన్‌–15 రహదారికి అంతర్గత డ్రెయినేజీ కోసం తీసిన పూడికలో ఈతకు వెళ్లి మృత్యువాత పడ్డారు. బండి సాద్విక్‌(10) ఉప్పలపాటి అమల(10), ఉప్పలపాటి దినేష్‌(7) మృతుల్లో ఉన్నారు. 

శవాలై తిరిగొచ్చారే..
దొండపాడు గ్రామానికి చెందిన ఉప్పలపాటి రామకృష్ణ, త్రివేణిలకు అమల, దినేష్‌ సంతానం. అక్కాతమ్ముడు ఇద్దరు కలిసిమెలసి ఉండేవారు. తల్లిదండ్రులు కూలి పనులు చేసుకుని జీవనం సాగించే వారు. రాజధాని ప్రాంతం కావడంతో పిల్లలకు మంచి చదువులు చదివించాలని ప్రైవేటు పాఠశాలలో చేర్పించారు. స్థోమతకు మించినా రెక్కల కష్టంతో చదివిస్తున్నారు. వారిపైనే ఆశలు పెట్టుకుని బతుకుతున్నారు.

పగలు చేసిన కష్టమంతా సాయంత్రానికి బిడ్డలను చూసుకుని మరిచిపోయే వారికి .. శనివారం గుండె పగిలే కష్టం మిగిలింది. ఆడుకుంటానికి వెళ్లిన బిడ్డలు విగతజీవులై రావడంతో శోకసంద్రంలో మునిగిపోయారు.‘ఇప్పుడే ఇద్దరు బిడ్డలకు స్నానం చేయించి..ఎండ ఎక్కువగా ఉంది బయటకు వెళ్లవద్దని చెప్పి.. పనులకు వెళ్లామయ్యా..కొద్ది సేపటికే శవాలుగా ఇంటికి తిరిగొచ్చారే’..అంటూ పిల్లల మృతదేహాలపై పడి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. ఇక మేమెవరి కోసం బతకాలంటూ ఆ తండ్రి కుప్పకూలిపోయాడు. వీరిని చూసిన ప్రతి ఒక్కరి గుండె కన్నీటి చెమ్మగా మారింది.

కడుపుకోత మిగిల్చావు కదయ్యా..
చిన్నారి సాద్విక్‌ తల్లి దేవకి కూలీ పని, తండ్రి కిరణ్‌ అటో నడుపుకుంటూ జీవనం సాగిస్తుంటారు. వీరికి ఇద్దరు బిడ్డలు. పెద్ద కుమారుడు సాద్విక్‌. కుమారుడి మృతి చెందిన విషయం తెలుసుకుని తండ్రి కిరణ్‌ స్పృహ కోల్పోయారు. తల్లి దేవకి ‘ఎంత పని చేశావు నాయనా.. కడుపుకోత మిగిల్చావు కదయ్యా’ అంటూ కన్నీరుమున్నీరైంది. ‘నా కొడుకుకి జరిగిన విధంగా ఎవరికీ జరగకూడదు...ఏ తల్లికి కడుపుకోత ఉండకూడదు.. త్వరగా ఆ పూడికను పూడ్చి వేయండయ్యా’ అంటూ విలపించింది.

నిర్మాణ సంస్థలపై ఆగ్రహం...
నిర్మాణ సంస్థల అధికారులు సంఘటన స్థలానికి రాకపోవడంపై గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఇంత జరిగినా వారిని పిలవరా ? అని పోలీసులు, ఏడీసీ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్మాణ సంస్థల ప్రతినిధులు వచ్చే వరకు రహదారిపై రాకపోకలు నిలిపివేస్తామంటూ హెచ్చరించారు. దీంతో తుళ్లూరు డీఏస్పీ పీ శ్రీనివాస్‌ గ్రామస్తులతో మాట్లాడి ఎన్‌ 15 రహదారి నిర్మాణ సంస్థ ప్రతినిధులను పిలిపించారు. గ్రామ పెద్దల సమక్షంలో మృతుల తల్లిదండ్రులకు చేయూతనిస్తామని వారితో భరోసా ఇప్పించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top