శివనామస్మరణలతో మారుమోగుతున్న శైవక్షేత్రాలు

 Devotees throng temples on Maha Shivratri - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఉన్న శైవ క్షేత్రాలు భక్తుల శివనామస్మరణలతో మారుమోగుతున్నాయి. తెల్లవారు జామునుంచే భక్తులు శివాలయాలకు పొటెత్తారు. బిల్వార్చనలు, క్షీరాభిషేకాలతో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. శ్రీకాళహస్తీ, శ్రీశైలం, వేములవాడ రాజన్న ఆలయాల్లో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. 

♦శ్రీకాళహస్తీశ్వరాలయానికి తెల్లవారుజాము నుంచే భక్తులు బారులు తీరారు. శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా పరమేశ్వరుడు  శ్రీజ్ఞానప్రసూనాంబ సమేత వాయులింగేశ్వరస్వామిగా  భక్తులకు దర్శనమిస్తున్నాడు. ఇవాళ ఇంద్ర విమానం, నందివాహనం, సింహ వాహన సేవలు, అర్ధరాత్రి ఒంటి గంట నుంచి బుధవారం ఉదయం 6 గంటల వరకు లింగోద్భవ దర్శనం కార్యక్రమాలు నిర్వహించనున్నారు. భక్తులు పొటేత్తడంతో ఆలయ అధికారులు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు.

♦ పశ్చిమ గోదావరి జిల్లా కొవ్వూరు, భీమవరం సోమేశ్వరాలయం, పట్టిసీమ వీరభద్రేశ్వరస్వామి,  పాలకొల్లు శ్రీక్షీరారామలింగేశ్వర స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి.గోష్పాద క్షేతంలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తున్నారు.

♦ శ్రీశైలంలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇవాళ స్వామి అమ్మవార్లకు నందివాహన సేవ, లింగోద్భవకాల మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వార్ల కళ్యాణ మహోత్సవ వంటి కార్యక్రమాలు జరుగునున్నాయి.

♦ తిరుపతి కపిల తీర్థం కపిలేశ్వరాలయంలో మహాశివరాత్రి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మూలమూర్తికి మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం చేశారు. స్వామి వారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

♦ విజయనగరంలో మహాశివరాత్రి వేడుకల్లో భాగంగా పశుపతి నాధేశ్వరీ, ఉమారామలింగేశ్వర స్వామి, జయితి శ్రీమల్లికార్జున స్వామి, పుణ్యగిరిలోని సన్యాసేశ్వరస్వామి ఆలయాలకు భక్తులు పొటేత్తారు. 

♦ వేముల వాడ రాజన్న ఆలయానికి భక్తులు పొటెత్తారు. భక్తులకు ఆలయ సమాచారం కోసం అధికారులు ప్రత్యేకయాప్‌ను రూపొందించారు. స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు.

♦తూర్పుగోదావరి జిల్లాలోని శైవక్షేత్రాలు కిటకిటలాడుతున్నాయి. పంచారమ క్షేత్రాలు ద్రాక్షారమం, సామర్లకోట ఆలయాలకు భక్తులు పోటెత్తారు. పిఠాపురం కుక్కుటేశ్వరస్వామి, కోటపల్లి ఛాయాసోమేశ్వరాలయం, ముక్తేశ్వరం, ఉమాకోటిలింగేశ్వరుని ఆలయాల్లో శివరాత్రి సందడి నెలకొంది. భక్తులు గోదావరిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

♦ అమరావతిలో వైభవంగా శివరాత్రి వేడుకలు ప్రారంభమయ్యాయి. అమరేశ్వరాలయానికి భక్తులు పోటెత్తారు. భక్తులు కృష్ణానదిలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. కోటప్పకొండలోని తిరునాళ్లకు భక్తులు భారీగా తరలివస్తున్నారు.

వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల ప్రజలకు వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు తెలిపారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top