ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి 50శాతం ఇవ్వండి

Devotees requested in Dial Your EO on Arjitha Seva tickets - Sakshi

ఆర్జిత సేవా టికెట్లపై ‘డయల్‌ యువర్‌ ఈవో’లో కోరిన భక్తులు

తిరుమల: తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్‌లైన్‌ డిప్‌ విధానం ద్వారా 50 శాతం, ముందుగా దరఖాస్తు చేసుకున్నవారికి మొదటి ప్రాధాన్యత కింద మరో 50శాతం టికెట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని భక్తులు టీటీడీ ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ను కోరారు. తిరుమలలో ప్రతి నెల మొదటి శుక్రవారం నిర్వహించే డయిల్‌ యువర్‌ ఈవో కార్యక్రమంలో 16 మంది భక్తులు తమ సూచనలు, సలహాలు, విన్నపాలు తెలియజేశారు. ఆర్జిత సేవలు పరిమితంగా ఉన్నాయని, లక్షమందికి పైగా భక్తులు నమోదు చేసుకుంటున్నారని వారిలో కేవలం 5 వేల మందికి మాత్రమే అవకాశం లభిస్తుందని ఈవో తెలిపారు.

వేసవి సెలవుల అనంతరం వృద్ధులు, దివ్యాంగులు 5ఏళ్ళలోపు చంటిపిల్లల తల్లిదండ్రులకు నెలలో 2రోజుల పాటు కల్పించే ప్రత్యేక దర్శన సౌకర్యాన్ని తిరిగి అమలు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా జూలై 10, 24 తేదీల్లో వృద్ధులు, దివ్యాంగులు, జూలై 11, 25 తేదీల్లో 5ఏళ్ళలోపు చంటిపిల్లలు, వారి తల్లిదండ్రులకు దర్శనభాగ్యాన్ని కల్పిస్తామన్నారు. కాగా, శ్రీవారి ఆలయంలో 12 సంవత్సరాలకు ఒకసారి నిర్వహించే అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణం, ఆగçస్టు 12 నుంచి 16 వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. ఈ తేదీల్లో ఆర్జిత సేవలన్నీ రద్దు చేశామన్నారు. 

ఆన్‌లైన్‌లో 53,642 ఆర్జిత సేవా టికెట్లు విడుదల
శ్రీవారి ఆర్జితసేవలకు సంబంధించి అక్టోబర్‌ నెల కోటాలో మొత్తం 53, 642 టికెట్లను శుక్రవారం ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ విడుదల చేశారు. ఆన్‌లైన్‌ డిప్‌ విధానంలో 9,742 సేవా టికెట్లు విడుదల చేశామని, ఇందులో సుప్రభాతం 7,597, తోమాల 90, అర్చన 90, అష్టదళ పాద పద్మారాధన 240, నిజపాద దర్శనం 1,725 టికెట్లు ఉన్నాయని ప్రకటించారు.

ఆన్‌లైన్‌లో జనరల్‌ కేటగిరీలో 43,900 సేవా టికెట్లు ఉండగా వీటిలో విశేష పూజ 2,000, కళ్యాణం 9,975, ఊంజలసేవ 3,150, ఆర్జిత బ్రహ్మోత్సం 5,775, వసంతోత్సవం 11,000, సహస్రదీపాలకంరణ సేవ 12,000 టికెట్లును విడుదల చేశారు. కాగా భక్తుల సౌకర్యార్థం అక్టోబర్‌ నెలకు సంబంధించి రూ.300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను ఆన్‌లైన్, ఈ– దర్శన్, పోస్టాఫీస్‌లో ఈనెల 10 మధ్యాహ్నం 12 గంటల నుంచి బుక్‌ చేసుకోవచ్చని టీటీడీ పేర్కొంది. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top