
సాక్షి, ఏలూరు: మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను కేవలం 8 నెలల్లోనే నెరవేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికే దక్కుతుందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో సోమవారం నిర్వహించిన రాష్ట్రస్థాయి సంక్రాంతి సంబరాల్లో ఆయన పాల్గొన్నారు. మంత్రితో పాటుగా కలెక్టర్ రేవు ముత్యాలరాజు, ఎమ్మెల్యే వాసుబాబు, ఆర్డీవో పనబాక రచన, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్రస్థాయి సంక్రాంతి సంబరాలకు పశ్చిమగోదావరి జిల్లాను ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా ఉందని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
గత టీడీపీ ప్రభుత్వం చేసిన తప్పులతో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని.. ప్రజలంతా వైఎస్ జగన్ ప్రభుత్వం కోసం ఎదురుచూశారని తెలిపారు. ప్రజల నమ్మకాన్ని నిలబెడుతూ.. సీఎం జగన్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని తెలిపారు. రైతు భరోసా, అమ్మ ఒడి పథకాలను ప్రవేశపెట్టి ఈ సంక్రాంతికి ప్రజలకు కానుకగా ఇచ్చారన్నారు. ప్రతి సంక్షేమ ఫలం ప్రజలకు చేరేవిధంగా సీఎం జగన్ కృషి చేస్తున్నారని ఆళ్ల నాని పేర్కొన్నారు.