‘డెంగీ’తో దొంగాట | Dengue fever spreading fast in East Godavari | Sakshi
Sakshi News home page

‘డెంగీ’తో దొంగాట

Oct 27 2013 2:15 AM | Updated on Sep 2 2017 12:00 AM

జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. వందల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్లేట్‌లెట్‌లకు డిమాండ్ పెరిగింది. రక్త దాతల కోసం బాధితులు అష్టకష్టాలు పడి వెతుకుతున్నారు.

సాక్షి, రాజమండ్రి : జిల్లాలో డెంగీ విజృంభిస్తోంది. వందల్లో కేసులు నమోదవుతున్నాయి. ప్లేట్‌లెట్‌లకు డిమాండ్ పెరిగింది. రక్త దాతల కోసం బాధితులు అష్టకష్టాలు పడి వెతుకుతున్నారు. రూ.400 పలికే యూనిట్ రక్తం రూ.2500 పైన పలుకుతోంది. ఇదీ జిల్లాలోని పరిస్థితి. అయినా జిల్లాలో ఎక్కడా డెంగీ కేసులను గుర్తించ లేదని, అనుమానాస్పద కేసులకు మాత్రమే చికిత్స చేస్తున్నామని అధికారులు చెప్పుకొస్తున్నారు. భారీ వర్షాలతో కాకినాడ, రాజమండ్రి నగరాలతో పాటు పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో వైరల్ వ్యాధులు పడగ విప్పాయి. వీటిలో అతి ప్రమాదకరమైన డెంగీ కోరలు చాస్తోంది. ఈ నేపథ్యంలో వ్యాధి నిర్ధారణలో అధికారులు అవలంబిస్తున్న వైఖరి రోగుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. వారం రోజులుగా జిల్లాలో సుమారు 300కు పైగా డెంగీ కేసులు నమోదయ్యాయని తెలుస్తోంది.
 
 సాక్షాత్తూ జాయింట్ కలెక్టర్ ముత్యాలరాజు జిల్లాలో 120 మంది డెంగీ లక్షణాలు కలిగిన రోగులను గుర్తించారని, వారిలో 40 మంది రాజమండ్రిలోనే ఉన్నారని చెప్పడం గమనార్హం. కాకినాడ, రాజమండ్రి  ప్రభుత్వాస్పత్రులతో పాటు అపోలో, జీఎస్‌ఎల్ తదితర ఆస్పత్రుల్లో పలువురు రోగులు చికిత్స పొందుతున్నారు. కానీ డెంగీకి సంబంధించిన ప్రాథమిక లక్షణాలతో చేరిన రోగులను కూడా డెంగీ బాధితులుగా గుర్తించేందుకు ప్రైవేట్, ప్రభుత్వాస్పత్రుల వారు వెనుకాడుతున్నారు.    
   
 ప్రైవేట్ ఆస్పత్రులపై అధికారుల ఒత్తిడి
 ఆస్పత్రిలో చేరిన రోగులకు డెంగీ నిర్ధారణ అయితే తక్షణం జిల్లా వైద్య ఆరోగ్య అధికారికి సమాచారం అందించాలి. అనంతరం వ్యాధిగ్రస్తులకు ప్రభుత్వం మెరుగైన చికిత్స అందించాల్సి ఉంటుంది. కాగా వ్యాధిని గుర్తించినా లక్షణాలు గల పేషెంట్లుగా మాత్రమే చికిత్స చేయాలని అధికారుల నుంచి ఒత్తిడి వస్తున్నట్టు ప్రైవేట్ ఆస్పత్రుల నిర్వాహకులు చెపుతున్నారు. ఈమేరకు రాజమండ్రి, కాకినాడ నగరపాలక సంస్థ ల నుంచి ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు అందినట్టు తెలుస్తోంది.   ప్రైవేట్ ఆస్పత్రుల్లో కేసులను గుర్తించి సమాచారం అందిస్తే వైద్య ఆరోగ్య శాఖ అధికారులు ప్రశ్నలతో వేధిస్తున్నారని చెపుతున్నారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రుల్లోనే అనుమానాస్పద కేసుల పేరుతో చికిత్స చేస్తుండడంతో పాటు ప్లేట్‌లెట్స్ పేరుతో వేలు దండుకుంటున్నారని పేదరోగులు వాపోతున్నారు.
 
 రూ.50 వేల వరకు వ్యయం
 వ్యాధి నిర్ధారణ లేకుండా చికిత్స చేస్తుం డడంతో ప్రభుత్వపరంగా సహకారం అందడం లేదని రోగులువాపోతున్నారు. అధికారుల వైఖరి వల్ల కూడా ప్రైవేట్ ఆస్పత్రులు  వేలు దండుకుంటున్నాయి. ప్రస్తుతం డెంగీ సోకిన రోగి మామూలు మనిషి కావాలంటే సుమారు రూ.40 వేల నుంచి రూ.50 వేలు అవుతోందని అంచనా. రోగిలో అసాధారణ పరిస్థితుల్లో ప్లేట్‌లెట్స్ తగ్గుతూ, దాన్ని డెంగీ వ్యాధిగా అనుమానిస్తున్న సందర్భం లో ప్రభుత్వాస్పత్రికి తరలించి చికిత్స అందించాలని పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement