అనుమతి ఒక చోట.. నిర్మాణం మరోచోట

Demolishing Cell Tower In Nellore - Sakshi

కంటేపల్లిలో టీడీపీ మండలాధ్యక్షుడి నిర్వాకం

అధికారుల విచారణలో వెలుగుచూస్తున్న వాస్తవాలు

అక్రమ సెల్‌ టవర్‌ తొలగింపునకు అధికారుల శ్రీకారం

గత టీడీపీ ప్రభుత్వం పాలనలో అవినీతి, అక్రమాలకు అడ్డే లేకుండా పోయింది. అక్రమాలకు కాదేదీ అనర్హం అన్నట్లు గ్రావెల్‌ తవ్వకాలు, మరుగుదొడ్ల నిర్మాణాలు, నీరు–చెట్టు పనులు అన్నింటిలోనూ తెలుగు తమ్ముళ్లు బరితెగించి సొమ్ము చేసుకున్నారు. చివరకు సెల్‌ టవర్‌ నిర్మాణంలోనూ అధికారాన్ని అడ్డంపెట్టుకున్న టీడీపీ మండల అధ్యక్షుడు నాగేంద్రప్రసాద్‌ అనుమతి ఒక చోట చూపి ప్రభుత్వ భూమిలో సెల్‌ టవర్‌ నిర్మించి టవర్‌ యాజమాన్యం ప్రతినెలా ఇచ్చే అద్దెను జేబులో నింపుకున్న విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు సెల్‌ టవర్‌ తొలగింపునకు శ్రీకారం చుట్టారు.

సాక్షి, వెంకటాచలం (నెల్లూరు): వెంకటాచలం మండలం కంటేపల్లి గ్రామ పరిధిలో రిలయన్స్‌ జియో సెల్‌ టవర్‌ నిర్మించేందుకు టీడీపీ మండల అధ్యక్షుడు కుంకాల నాగేంద్ర ప్రసాద్‌ రిలయన్స్‌ యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు. గ్రామ పరిధిలోని సర్వే నంబరు 184–3, 184–6,184–7,184–8లో టవర్‌ ఏర్పాటునకు గత ఏడాది ఫిబ్రవరి ఏడో తేదీన పంచాయతీ నుంచి తీర్మానం పొందాడు. అయితే టీడీపీ అధికారంలో ఉండడంతో సెల్‌ టవర్‌ను సర్వే నంబరు 184–2లో ఉన్న 50 సెంట్ల గ్రామ కంఠం విస్తీర్ణంలో నిర్మించాడు. ఈ విషయం రిలయన్స్‌ జియో టవర్‌ ప్రతినిధులకు తెలిసినా మౌనం వహించారనే విమర్శలున్నాయి.

గ్రామ కంఠం భూమిలో సెల్‌  టవర్‌ను అక్రమంగా నిర్మించారని పత్రికల్లో కథనాలు వచ్చినా, మండల సర్వసభ్య సమావేశంలో పలువురు ప్రజా ప్రతినిధులు ప్రశ్నించినా అధికారులు చర్యలు చేపట్టలేదు. మాజీ మంత్రి సోమిరెడ్డి అండతో అక్రమంగా నిర్మించిన సెల్‌ టవర్‌ జోలికి ఎవరూ రాకుండా నాగేంద్రప్రసాద్‌ అధికారులను బెదిరించాడు. దీంతో అప్పట్లో అధికారులు మౌనం వహించారు. మళ్లీ కొందరు జిల్లా అధికారులకు ఫిర్యాదు చేయడంతో సెల్‌ టవర్‌ నిర్మాణం గ్రామ కంఠం భూమి సర్వే నంబరు 184–2లో నిర్మించారని సర్వేయర్‌ సర్వేచేసి తేల్చడంతో వాస్తవాలు వెలుగుచూశాయి.

సర్వేలో వాస్తవాలు బయటపడటంతో సెల్‌ టవర్‌ నిర్మాణాన్ని పరిశీలించి నిర్మించిన వారికి నోటీసులు ఇచ్చి తొలగించేలా చర్యలు చేపట్టాలని డీపీఓ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో వెంకటాచలం మండల పంచాయతీ విస్తరణాధికారి రవీంద్రబాబు వెంటనే నోటీసులు ఇచ్చి తొలగించాలని గ్రామకార్యదర్శి నాగవేణును ఆదేశించారు. దీంతో గత నెల 21తేదీన టీడీపీ మండల అధ్యక్షుడు నాగేంద్ర ప్రసాద్‌తోపాటుగా రిలయన్స్‌ జియో టవర్‌ యాజమాన్యానికి నోటీసులు ఇచ్చారు. అధికారుల ఇచ్చిన నోటీసులకు వారం రోజులలో ఎవరూ స్పందించలేదు.

సెల్‌ టవర్‌ తొలగింపునకు ఆదేశాలు
కంటేపల్లిలో గ్రామ కంఠం భూమిలో నిర్మించిన అక్రమ సెల్‌ టవర్‌ నిర్మాణానికి సంబంధించి నోటీసులు ఇచ్చినా స్పందించక పోవడంతో అధికారులు మంగళవారం సెల్‌ టవర్‌ తొలగింపునకు శ్రీకారం చుట్టారు. కంటేపల్లి టవర్‌ వద్దకు గ్రామ కార్యదర్శి నాగవేణు, రెవెన్యూ అధికారులు వెళ్లారు. నాలుగు జేసీబీలు, ఒక పొక్లెయినర్‌ను తీసుకొచ్చి సెల్‌ టవర్‌ తొలగింపును ప్రారంభించారు. విషయం తెలుసుకున్న రిలయన్స్‌ జియో టవర్‌ ప్రతినిధులు సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డిని కలిశారు. భూమి యజమాని  నిర్లక్ష్యానికి తమ కంపెనీకి తీవ్ర నష్టం జరుగుతుందని, గ్రామ కంఠం విస్తీర్ణంలో సెల్‌ టవర్‌ ఏర్పాటు చేసినందువల్ల ఆ పంచాయతికే ప్రతినెలా బాడుగ ఇస్తామని వివరించారు. దీంతో ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధికారులతో ఫోన్లో మాట్లాడి సెల్‌ టవర్‌ తొలగింపు పనులు తాత్కాలికంగా నిలిపి వేయించారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top