ఆణి'మత్స్యం'

Demanding in West Godavari Fish Market - Sakshi

మీనం.. ధర ఘనం

అన్నిరకాల చేపలకూ డిమాండ్‌

బొచ్చెకు యమక్రేజ్‌

కిలో రూ.180 వరకు ధర  

మీనం మీసం మెలేస్తోంది..నీలివిప్లవం సిరుల పండిస్తోంది..చేపల ధరలు రోజురోజుకూ పెరుగుతుండటంతో రైతుల మోముల్లో ఆనందంవెల్లివిరుస్తోంది. ప్రస్తుతం శీలావతి, బొచ్చె, రూప్‌చంద్‌ చేపలకు మంచి డిమాండ్‌ ఉంది. ధరలు ఆశాజనకంగా ఉండటంతో ఎగుమతులూ సంతృప్తిగా సాగుతున్నాయి. దీంతో చేపలరైతులు, ఎగుమతిదారులు హర్షంవ్యక్తం చేస్తున్నారు. 

పశ్చిమగోదావరి, ఆకివీడు: జిల్లాలో 1.40 లక్షల ఎకరాల్లో చేపల పెంపకం సాగవుతోంది. ప్రస్తుతం బొచ్చె, శీలావతి, రూప్‌చంద్, ఫంగస్, శీతల్‌ రకం చేపల్ని ఎక్కువగా సాగుచేస్తున్నారు. వీటితో పాటే నీటి ద్వారా వచ్చే థిలాఫియన్‌ (చైనాగురక) రకం చేపలు చెరువుల్లో భారీగా సాగవుతున్నాయి. ప్రస్తుతం చేపల పిల్లల ధరతో పాటు కిలో చేప నుంచి మూడు కిలోల పైబడిన చేపలకు మంచి డిమాండ్‌ ఉంది. చేపల చెరువుల్లో 100 గ్రా ముల చేప పిల్ల నుంచి అరకిలో లోపు చేపల్ని వేసి పెంచుతున్నారు. కిలో, రెండు కిలోలు ఎదిగిన తర్వాత వాటిని పట్టి విక్రయిస్తున్నారు. రెండు కిలోల పైబడి ఉన్న శీలావతి చేపలకు మంచి గిరాకీ ఉంది. బొచ్చె (కట్ల) రకం చేపకు కిలో నుంచే డిమాండ్‌ బాగుంది. ప్రస్తుతం మిగిలిన రకాలతో పోలిస్తే బొచ్చె కొద్దిగా తక్కువ విస్తీర్ణంలో సాగవుతోంది. దీంతో మూడు నుంచి ఐదు కిలోల బరువున్న చేపల ధర బాగుంది. ప్రస్తు తం మార్కెట్‌లో కిలో రూ.180 పైబడి ఉంది. ఫంగస్‌ ధర కూడా ఆశాజనకంగా ఉంది. థిలా ఫియన్‌ ధర కిలో రూ.60కు పైగా పలుకుతోంది. 

చేపల్లో ఎన్నో రకాలు...
మొదటి నుంచి జిల్లాలో అధికంగా శీలావతి, బొచ్చె రకాలనే సాగు చేస్తూ వస్తున్నారు. దశాబ్ద కాలం నుంచి ఫంగస్, రూప్‌చంద్, థిలాపియా, కొర్రమేను, సీబాస్‌ తదితర రకాలు కూడా సాగు చేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయిన చేపల్లో 95 శాతం వరకు పశ్చిమబెంగాల్, అసోంతో పాటు వాటికి సమీపంలోని ఇతర ఈశాన్య రాష్ట్రాలకు ఎగుమతి అవుతున్నాయి. దీని ద్వారా ఏటా సుమారు రూ.7 వేల కోట్ల ఆదాయం జిల్లాకు లభిస్తుంది. దీనిని మరింత ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ రకాల రాయితీలు ఇస్తోంది. నిత్యం వందల సంఖ్యలో చేపల లారీలు జిల్లా నుంచి కోల్‌కత్తాకు వెళ్తుంటాయి. ఇతర దేశాల మాదిరిగా ఇకనుంచి కొత్త రకాల చేపలను కూడా సాగు చేసేలా ప్రయత్నా లు జరుగుతున్నాయి. ఆక్వా ల్యాబ్‌లు, పరిశోధనా కేంద్రాలను మరిన్ని ఏర్పాటుచేసేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. 

మేత ధరలూ పెరిగాయి
చేపల ధరలతో పాటు మేత ధరలు పెరుగుతున్నాయి. చేపల మేతకు వినియోగించే డీఓబీ, వేరుశనగ చెక్క, కోళ్ల ఎరువుల ధరలు పెరిగాయి. లారీ డీఓబీ 10 టన్నులు రూ.1.95 లక్షలు, 70 కిలోల బస్తా వేరు శనగ చెక్క రూ.3,250 పలుకుతోంది. కోళ్లు ఎరువు 20 టన్నుల ధర రూ.25 వేలు పలుకుతోంది. దీంతో పాటు పత్తి పిండి ధర కూడా పెరిగింది. చేప మేత ఇటీవల 40 శాతం ధర పెరిగింది. ఈ నేపథ్యంలో చేపల ధర కూడా పెరగడం రైతులకు కొంత మేర ఊరట కలిగిస్తోంది. 

శీతాకాలం.. వ్యాధుల భయం
చేపలపై వ్యాధుల విజృంభించే సమయం ఆసన్నమైంది. శీతాకాలంలో వ్యాధుల తీవ్రత అధికంగా ఉంటుందని రైతులు అంటున్నారు. నీటి యాజమాన్య పద్ధతుల్లో లోపాలతో పాటు వాతావరణ ప్రభావం వ్యాధుల ఉధృతికి కారణమని నిపుణులు చెబుతున్నారు. శీతాకాలంలో బ్యాక్టీరియా, తాటాకు తెగులు, శంఖు జలగ, శంఖుపూత వ్యాధులు అధికంగా వచ్చే అవకాశాలున్నాయి. నీటి యాజమాన్య పద్ధతుల్ని పాటి స్తూ వ్యాధులబారిన పడకుండా చేపల్ని రక్షించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. చెరువుల్లోని చేపల స్థితిగతుల్ని మత్స్య అభివృద్ధి, సహాయ అధికారులు పర్యవేక్షించాల్సి ఉంది.   

జిల్లాలో సాగు1.40 లక్షల ఎకరాలు
ఏడాదిలో ఉత్పత్తి7 లక్షలటన్నులు
ఆదాయం సుమారుగారూ. 7వేల కోట్లు
సాగు చేసే రకాలుశీలావతి, బొచ్చెరూప్‌చంద్‌

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top