‘కోడ్‌’ ముగిసినా ఎక్కడి అధికారులు అక్కడే

Decision on transfers is after forming a new government - Sakshi

కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాకే బదిలీలపై నిర్ణయం

పరిస్థితిని వివరిస్తూ ఫైలు పంపిన రెవెన్యూ శాఖ

ఆర్థిక శాఖ వద్ద ఫైలు

ముఖ్యమంత్రి నిర్ణయమే అంతిమమంటున్న అధికారులు

ఇక సాధారణ పరిపాలన వేగవంతం

సాక్షి, అమరావతి : ఎన్నికల నిబంధనావళి అమల్లో భాగంగా సార్వత్రిక ఎన్నికల నిర్వహణ కోసం ఇతర జిల్లాలకు బదిలీపై వెళ్లిన అధికారులు ‘కోడ్‌’తో నిమిత్తం లేకుండా తదుపరి ఆదేశాలు జారీ అయ్యే వరకూ ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది. ఎన్నికలు ముగిసినందున వారిని పాత జిల్లాలకు పంపించాలా? లేక ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలా? అనేది కీలకమైన అంశమైనందున ఆపద్ధర్మ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి వీల్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో అధికారులను ప్రస్తుతం పనిచేస్తున్న జిల్లాల్లోనే కొనసాగించాలా? లేక ఎన్నికల ముందు వరకూ పనిచేసిన జిల్లాలకు తిరిగి బదిలీ చేయాలా? అనే అంశంపై స్పష్టమైన విధివిధానాల్లేవు. అందువల్ల కొత్త ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటే దానిని అమలుచేస్తామని అధికార యంత్రాంగం చెబుతోంది. అయితే, ఎన్నికలు ముగిసినందున ఎన్నికల ముందు పనిచేసిన స్థానాలకే అధికారులను తిరిగి బదిలీ చేయాలని రెవెన్యూ ఉద్యోగుల సంఘం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. కానీ, ఇలాంటి నిబంధనేమీ లేదని రెవెన్యూ శాఖ స్పష్టం చేసింది. కొత్త ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయన ఎలా చెబితే అలా చేయాలని రెవెన్యూ శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగానే ఫైలును సీఎం పరిశీలన కోసం పంపింది. 

ఎందుకిలా?
రాష్ట్రంలో విధానసభ, దేశవ్యాప్తంగా లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్‌.. మోడల్‌ కోడ్‌ (నిబంధనావళి) ప్రకారం రెవెన్యూ శాఖలో 530 మందికి పైగా తహసీల్దార్లను ఒక జిల్లా నుంచి మరో జిల్లాకు బదిలీ చేశారు. ఇదే నిబంధనావళి ప్రకారం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఇతర శాఖల్లో ఇదే కేడర్‌లో పనిచేస్తున్న మరికొందరిని కూడా వేరే జిల్లాలకు బదిలీ చేశారు. ఎన్నికల కమిషన్‌ విధుల్లో భాగస్వాములను చేసే వారిని సొంత జిల్లాల నుంచి వేరే జిల్లాలకు బదిలీ చేయాలని నిబంధన ఉంది. అలాగే, మూడేళ్లుపైగా ఒకేచోట ఉన్న వారిని కూడా బదిలీ చేయాలని ఉంది. దీంతో ఎన్నికల విధులతో సంబంధం ఉన్న ఆయా శాఖల అధికారులను బదిలీ చేశారు. కొందరు రెవెన్యూ డివిజనల్‌ అధికారులు సైతం ఇలాగే బదిలీ అయ్యారు. ఈ బదిలీలన్నీ మార్చి 10న వచ్చిన ఎన్నికల షెడ్యూల్‌ ప్రకటనకు ముందే జరిగాయి. ఈ నేపథ్యంలో.. ‘ఈనెల 30న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కొత్త ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్షించిన అనంతరమే బదిలీ అయిన వారిని పూర్వ స్థానాలకు పంపించాలా? ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలా? అనే దానిపై నిర్ణయం తీసుకుంటాం. అందుకోసం ఫైలు ఇప్పటికే పంపించాం’.. అని రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌సింగ్‌ ‘సాక్షి’కి తెలిపారు. ఇతర విభాగాల వారి విషయంలోనూ ఇదే విధానం అమలవుతుందని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి చెప్పారు. 

సాధారణ పరిపాలన వేగవంతం
ఇదిలా ఉంటే.. ఎన్నికల కోడ్‌ ముగిసినందున అధికార యంత్రాంగం ఇక పూర్తిగా ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. గత మూడు నెలలుగా ఎన్నికల పనులు, తర్వాత ‘కోడ్‌’ అంటూ క్షేత్రస్థాయి అధికారులు ప్రజల వినతులు, సమస్యల గురించి ఏమాత్రం పట్టించుకోలేదు. దీంతో రెవెన్యూ కార్యాలయాల్లో రోజువారీ సాగాల్సిన పనులన్నీ స్తంభించాయి. ‘వాస్తవంగా పట్టాదారు పాసుపుస్తకాల జారీ, రెవెన్యూ రికార్డుల మార్పులు చేర్పులు, సవరణలు (మ్యుటేషన్‌), భూముల కొలతలు, వ్యవసాయ ఆధార ధ్రువీకరణ పత్రాల జారీ, కుల ధ్రువీకరణ పత్రాల జారీ, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీ తదితర సాధారణ కార్యకలాపాలు నిత్యం చేయాల్సిందే. ఇవి ఎన్నికల కోడ్‌ పరిధిలోకి రావు. అయితే, అధికారులు పని భారాన్ని సాకుగా చూపుతూ ఈ పనులను నిలిపేశారు. ఇప్పుడు ఎన్నికల క్రతువు ముగిసినందున అధికారులు ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. ఈ మేరకు ఇప్పటికే ఆదేశాలు జారీచేశాం’.. అని ఒక ఉన్నతాధికారి వివరించారు. 

ముగిసిన ఎన్నికల కోడ్‌
దేశవ్యాప్తంగా లోక్‌సభ, రాష్ట్రంలో శాసనసభ సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి (మోడల్‌ కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌)ని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (సీఈసీ) ఎత్తివేసింది. ఎన్నికల షెడ్యూలు ప్రకటనతో మార్చి 10 నుంచి అమల్లోకి వచ్చిన ఈ ‘కోడ్‌’.. ఎన్నికల ప్రక్రియ ముగియడంతో దాని కాల పరిమితి ముగిసిందని కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఈసీఐ) కార్యదర్శి అజయ్‌కుమార్‌ తెలిపారు. ‘దేశవ్యాప్తంగా లోక్‌సభ, కొన్ని రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఫలితాలు వెల్లడి కావడంతో మోడల్‌ కోడ్‌ను ఎత్తివేస్తున్నాం. ఇది తక్షణమే అమల్లోకి వస్తుంది. ఈ మేరకు సంబంధిత అధికార యంత్రాంగం మొత్తానికి తెలియజేయండి’.. అని అజయ్‌ కుమార్‌ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్రపాలిత ప్రాంతాల అధికారులకు ఆదివారం కేంద్ర ఎన్నికల కమిషన్‌ సర్క్యులర్‌ జారీచేసింది.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top