‘రాజా’ విలాసం... డీసీసీబీ విలాపం

DCCB Chairman And CEO Spend Lakhs Of Rupees For Their Luxurious In East Godavari  - Sakshi

సాక్షి, రాజమహేంద్రవరం: సొమ్ము తమది కాదంటే సోకులకేమీ లోటుండదనే నానుడిని జిల్లా కేంద్ర సహకార బ్యాంకు చైర్మన్, సీఈఓ ఇతర అధికారులు బాగా వంట పట్టించుకున్నట్టున్నారు. అందుకే అధికారం చేతిలో ఉందనే ధైర్యంతో బరితెగించి మరీ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు నిధులను గడచిన ఐదేళ్లలో అడ్డగోలుగా దుబారా చేశారు. రైతుల రెక్కల కష్టంతో రాష్ట్రంలో లాభాల బాటలో పయనిస్తున్న డీసీసీబీలో మన డీసీసీబీ ఒకటి. అటువంటి బ్యాంకుపై రైతులు పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీస్తూ చైర్మన్, సీఈఓలు ఇష్టారాజ్యంగా ఎడాపెడా విలాసాలకు లక్షల రూపాయలు వెచ్చించారు. డీసీసీబీ ఆస్తులు అయినకాడికి అప్పనంగా కట్టబెట్టడం దగ్గర నుంచి అడ్డగోలుగా భవంతులు నిర్మించడంతోపాటు విలాసాల కోసం కార్లు కొనుగోలు వరకూ అన్నింటా లక్షలాది రూపాయలు అనవసర ఖర్చులు చూపించి బ్యాంకును నష్టాల బాటలోకి నెట్టి  అడ్డగోలుగా అప్పటి చైర్మన్‌ వరుపుల రాజా వాహనాలను కొనుగోలు చేయడం పట్ల పలు విమర్శలు వినిపిస్తున్నాయి. కార్ల పేరుతో లక్షలు దుబారా చేసినట్టు డీసీసీబీ ఆర్థిక లావాదేవీలపై నిర్వహించిన ప్రాథమిక విచారణలో నిగ్గు తేలింది. లక్షలు పెట్టి కొన్న కారు లక్షణంగా నడుస్తుంటే అది సరిపోదని కార్లపై కార్లు మార్చేసి ‘షి’కార్లు చేసి రైతుల నోట మట్టి కొట్టారు. 

2016 సెప్టెంబరు 21న బ్యాంకు తీర్మానం నంబర్‌–5 ప్రకారం చైర్మన్‌కు కొత్త కారు కొనుగోలు చేయాలనుకున్నారు. అప్పటికే ఫార్చునర్‌ కారు (ఏపీ 05 సీపీ 1234)ను చైర్మన్‌ వినియోగిస్తున్నారు. ఆ ఫార్చునర్‌ కారు లక్షన్నర కిలోమీటర్లు తిరగడంతో తరచూ మరమ్మతులకు వచ్చేస్తోందని భావించారు. అందునా భద్రతా కారణాల రీత్యా కూడా ఆ కారును మార్చేసి కొత్త కారు కొనుగోలు చేయాలని నిర్ణయించారు. కొత్త కారు కొనుగోలు కోసం ఏదో తీర్మానం రాశారు కానీ, అసలు డీసీసీబీ చైర్మన్‌ భద్రతకు వచ్చిన ముప్పు ఎక్కడుందని విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. సరే సీఈఓ ధర్మారావు పర్యవేక్షణలో డీసీసీబీ అధికారులు రూపొందించిన ప్రతిపాదనలన్నీ వాస్తవమే అనుకుందాం. ఆ క్రమంలోనే ఫార్చునర్‌ స్థానంలో కొత్త ఇన్నోవా క్రిస్టల్‌ కారు కొనుగోలు చేయాలనుకున్నారు. ఈ కారు కొనుగోలు కోసం డీసీసీబీ నుంచి రూ.26,67,825 (రిజిస్ట్రేషన్‌ మినహాయించి) డ్రా చేశారు.

చైర్మన్‌ పర్యటనలకు సౌకర్యవంతంగా లేదనే కారణంతో మరో కారు కొనుగోలుకు ప్రతిపాదించారు. ఇన్నోవా క్రిస్టల్‌ కారు కొనుగోలు చేసిన తొమ్మిది నెలలు కూడా తిరగకుండానే దానిని మార్పిడికి పెట్టి కొత్త కారు కొనుగోలుకు సిద్ధమయ్యారు. 2017 జూన్‌ 3వ తేదీన తీర్మానం నంబర్‌–42 ప్రకారం మరో కొత్త కారు టయోటా ఫార్చునర్‌ కొనుగోలుకు సిద్ధమయ్యారు. ఇన్నోవా క్రిస్టల్‌ కారును వద్దని టయోటా ఫార్చునర్‌ కారు కొనుగోలుకు వారు చూపించిన కారణాన్ని ప్రాథమిక నివేదికలో చూసి సహకారశాఖ ఉన్నతాధికారులే విస్మయానికి గురయ్యారు. కారు కొనుగోలు చేసి తొమ్మిది నెలలు కూడా గడవకుండానే, అందునా అన్ని విధాలా సౌకర్యవంతమైనదిగా భావించే ఇన్నోవా కారు చైర్మన్‌కు సౌకర్యవంతంగా లేదని పేర్కొనడం చాలా ఆశ్చర్యకరంగా కనిపిస్తోందంటున్నారు. పోనీ అంతకు ముందు కొనుగోలుచేసిన ఇన్నోవా క్రిస్టల్‌ కారు ధర కంటే ఈ టయోటా ఫార్చునర్‌ కారు తక్కువకు కొనుగోలు చేశారంటే అదీ లేదు.

అలా కొనుగోలుచేసి ఉంటే పోనీ బ్యాంకుకు భారం తగ్గించారనుకునే వారే. కానీ టయోటా ఫార్చునర్‌ కారును రూ.38,67,780కు కొనుగోలు చేశారు. అంటే రూ.15,67,780లకు కొత్త కారు కొనుగోలు చేయడం వల్ల బ్యాంకుపై అదనపు భారం పడింది. అంటే ఆ మేరకు బ్యాంకు లాభాల నుంచి కోత పడినట్టే కదా అని రైతు ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కానీ డీసీసీబీ సీఈఓ ఆధ్వర్యంలో రూపొందించిన రికార్డు ప్రకారం చూస్తే ఇన్నోవా క్రిస్టల్‌ కారు మారకం ద్వారా ఫార్చునర్‌ను కొనుగోలు చేయడం ద్వారా రూ.3,67,825 మాత్రమే నష్టం జరిగినట్టుగా ఉంది. అన్ని విధాలా సౌకర్యవంతమైన ఇన్నోవా కారు కొని తొమ్మిది నెలలు కూడా గడవకుండానే మారకం పెట్టడం ద్వారా కొత్త కారు కొనుగోలు చేయడంతో రూ.15,67,780 అదనపు భారం పడిందనే విషయాన్ని డీసీసీబీ అధికారులు, రైతుల స్వేదంతోనే తమకు ఇన్ని సౌకర్యాలు, హోదా వచ్చాయనే విషయాన్ని మరిచిపోవడం ఎంతవరకు సమంజసమని డీసీసీబీ శ్రేయోభిలాషులు పేర్కొంటున్నారు.(చదవండి: ఇది ‘ధర్మమా’..‘రాజా’? 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top