‘దొర’ల రాజ్యంలో.. ధర్మం చెర

Daughters Fight on Father Suspicious death Visakhapatnam - Sakshi

ఆర్నెల్లుగా ఇద్దరు నిరుపేద ఆడకూతుళ్ల ఆక్రందన

పనిచేస్తున్న చోటే తండ్రి అనుమానాస్పద మృతి

ఫిర్యాదు చేసినా.. సంఘటన స్థలానికి రాని పోలీసులు

స్టేషన్‌కు వెళ్లి కేసు పెట్టబోతే సీఐ రుద్రతాండవం

రూ.50 వేలు ఇచ్చి నోరు మూయించడానికి టీడీపీ నేతల యత్నం

ఎస్పీని కలిస్తే.. పరిశీలించమని ఏఎస్పీకి ఆదేశాలు

ఎమ్మెల్యేను ఆశ్రయిస్తే ఈసడింపులు, గదమాయింపులే మిగులు

న్యాయం కోసం అభాగ్యుల అలుపెరుగని పోరాటం

పొట్టకూటి కోసం వాచ్‌మన్‌ ఉద్యోగంలో చేరిన ఓ వృద్ధుడు అనుమానాస్పద స్థితిలో రక్తగాయాలతో మృతి చెందాడు..ఇదెలా జరిగిందని ప్రశ్నించిన అతని కూతుళ్లపై రూ.50 వేలు విసిరేసి.. ఇక మాట్లాడొద్దని బిల్డర్‌ హుకుం..పోలీసుల వద్దకు వెళ్తే.. తీసుకున్న డబ్బులు చాల్లేదా అని సీఐ, ఎస్సైల బూతుపురాణం..ప్రజాప్రతినిధిని ఆశ్రయిద్దామంటే.. డబ్బులు తీసుకుని మళ్లీ ఈ న్యూసెన్స్‌ ఏమిటని గదమాయింపు..
జిల్లా ఎస్పీని కలిస్తే ఏఎస్పీకి అప్పగింత.. ఏఎస్పీని కలిస్తే.. ఇదిగో వస్తున్నా.. అని చెప్పి అర్నెల్లకుపైగా గడిచిపోయింది. కేసు అతీగతీ లేదు.ఏమిటీ.. ఆడకూతుళ్లకు ఇంత అన్యాయం ఎక్కడ జరిగిందనా మీ సందేహం..ఇంకెక్కడ.. అన్యాయాలకు, అక్రమాలకు ఖిల్లాగా మారిన పాయకరావుపేట ఇలాకాలో..‘మా నాన్నను చంపేశారు.. మాకు ఫలానా వారి మీద అనుమానముందని నక్కపల్లి సీఐ రుద్రశేఖర్‌కు ఫిర్యాదు చేస్తే..  అస్సలు నేను రిపోర్టే తీసుకోను.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి.. సినిమాలు. టీవీలు చూసి నాటకాలు ఆడుతున్నారా.. ఆడోళ్లు కాబట్టి బతికిపోయారు.. లేదంటేనా’.. అని కొట్టినంత పని చేసి భయాందోళనకు గురిచేసినా...దీన్ని ఇక్కడితో వదిలేయండని టీడీపీ నేతలు బెదిరించినా.. పోలీసు ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోని తీరు వివాదాస్పదమవుతోంది.

సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: పాయకరావుపేట మండలం అరట్లకోట గ్రామానికి చెందిన శకునాల సత్యనారాయణ.. రాజుగారి బీడు సమీపంలోని ఓ భవన నిర్మాణం వద్ద నైట్‌వాచ్‌మన్‌గా పనిచేస్తూ ఈ ఏడాది జనవరి 5న అక్కడే అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. సదరు బిల్డర్, గ్రామానికి చెందిన పోతంశెట్టి రాజబాబు ఆ రోజు ఉదయం వాచ్‌మన్‌ ఇంటికి వెళ్లి ‘మీ నాన్న చనిపోయాడంట’ అని చెప్పడంతో కుమార్తెలు శకునాల లత, దొండపాటి రమతో పాటు బంధువులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. తండ్రి శరీరంపై రక్త గాయాలు గమనించి తమ తండ్రిని హత్య చేశారని అనుమానం వ్యక్తం చేస్తూ ఎస్సై ఎల్‌.రామకృష్ణకు ఫోన్‌లో ఫిర్యాదు చేశారు. పావు గంటలో వస్తామని ఆయన చెప్పడంతో దహన సంస్కారాలు నిలిపివేసి వేచిచూశారు. మూడు గంటలు గడిచినా ఎస్సై రాకపోవడంతో చివరికి దహన సంస్కారాలు పూర్తి చేశారు. ఆ తర్వాత జనవరి 25న పాయకరావుపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఎస్సై రామకృష్ణ ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయకుండా మీరు వెళ్లండి నేను చూస్తానని చెప్పి పంపించేశారు. సరిగ్గా అదే రోజు స్థానిక టీడీపీ నేత కట్టా శ్రీను, పోతంశెట్టి రాజబాబులు వచ్చి ‘రూ.50వేలు ఇచ్చి.. ఖర్చులకు ఉంచండని చెబుతూనే ఏదో రాసిన బాండ్‌ పేపర్‌పై సంతకం పెట్టాలని ఒత్తిడి తెచ్చారు. ఇందుకు బాధితులు నిరాకరించడంతో వెళ్లిపోయారు. అక్కడికి వారం తర్వాత ఫిబ్రవరి 2న ఎస్సై ఫోన్‌ చేసి సీఐ రమ్మంటున్నారని చెప్పారు. దాంతో వారు నక్కపల్లి సర్కిల్‌ ఆఫీసుకు వెళ్లారు.

పోలీస్‌స్టేషన్ల చుట్టూ ప్రదక్షిణలు
ఫిబ్రవరి 23న రాయవరం ఎస్సై కుమారస్వామి ఫోన్‌చేసి ‘ఎస్పీ వద్దకు వెళ్లారు కదా.. ఏఎస్పీకి అప్పజెబితే ఆయన కేసు విచారణ నామీద పెట్టారు. మీరు రాయవరం రావాలని’ చెప్పడంతో అక్కడికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఓ రిపోర్ట్‌ సిద్ధంగా ఉంది.. దానిపై సంతకం పెట్టాలని ఎస్సై సూచించారు. ఆ భాష అర్ధం కాకపోయినా న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో సంతకం పెట్టారు. కానీ విచారణ అతీగతీ లేకపోవడంతో మార్చి 27న మళ్లీ ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మను కలిసి ఈసారి ఇంగ్లీషులో రాసిన ఫిర్యాదు కాపీ ఇచ్చారు. దాన్ని  చదివిన ఎస్పీ రేపు ఉదయమే ఏఎస్పీ అఫీజ్‌ మీ వద్దకు వస్తారని చెప్పారు. కానీ ఓ నెలంతా వేచి చూసినా ఏఎస్పీ రాలేదు. చివరికి నేరుగా ఏఎస్పీని ఐదారుసార్లు కలిస్తే... నేనొస్తానని అన్నారే గానీ రాలేదు. అయితే కొత్తకోట సీఐ జూన్‌ 23న ఇంటికి రాగా మొత్తం వివరాలన్నీ చెప్పారు. అన్నీ పరిశీలించి వెళ్లారే గానీ ఇంతవరకు ప్రగతి లేదు.  ఈలోగా టీడీపీ స్థానిక నేత కట్టా శ్రీను ఆ మహిళలపై వీరంగం వేశాడు. మీరు ఎంతమంది పోలీసులను కలిసినా ఏమీ పీకలేరు.. అని నోటికొచ్చినట్టు దూషించారు.

టీవీలు చూసినాటకాలాడుతున్నారా..– సీఐ వీరంగం
బాధిత మహిళలను చూడగానే సీఐ రుద్రశేఖర్‌ రుద్రతాండవం చేశారు. అసలు నేను మీ రిపోర్ట్‌ తీసుకోను.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి.. సినిమా, టీవీలు చూసి నాటకాలు ఆడుతున్నారా... రోజూ పాయకరావుపేట పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఎస్సై మీద పడిపోతున్నారట, నా మీద ఎవరికి ఫిర్యాదు ఇచ్చినా నో ప్రొబ్లమ్, నన్ను ఏం చేయలేరు.  మహా అయితే ట్రాన్స్‌ఫర్‌ చేస్తారు.. ఒక్క క్షణం కూడా నాముందు ఉండొద్దు.. మీరు ఆడోళ్లు కాబట్టి బతికిపోయారు.. అని కొట్టినంత పనిచేశారు. తీవ్రవేదన చెందిన బాధితులు ఫిబ్రవరి 5న విశాఖ వచ్చి కలెక్టరేట్‌ గ్రీవెన్స్‌లో ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 12న జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ను కూడా కలిసి గోడు వెళ్లబోసుకోగా ఎస్పీ వెంటనే  స్పందించారు. నర్సీపట్నం ఏఎస్పీకి ఫోన్‌ చేసి ఈ కేసును పరిశీలించాలని ఆదేశించి.. ‘మీరు ఇంటికి వెళ్లండి.. మీ వద్దకే పోలీసులు వచ్చి విచారణ చేస్తారు అని ధైర్యం చెప్పారు. కానీ ఎవ్వరూ విచారణకు రాలేదు.

డబ్బులు తీసుకున్నారటగా..– ఎమ్మెల్యే అనిత వ్యంగ్యం
చివరికి ఎమ్మెల్యే అనితను ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందన్న ఆశతో ఆమెకు ఫోన్‌ చేశారు. మేం ఫలానా.. అని చెప్పేలోగానే ఫోన్‌ కట్‌ చేశారు. ఆ తర్వాత తమ ఇంటి మీదుగా వెళ్తున్న ఎమ్మెల్యే కారును అడ్డుకుని ‘మేడం న్యాయం చేయండి.. మా నాన్నను అన్యాయంగా చంపేశారు.. ఎవ్వరూ పట్టించుకోవడం లేదని చెప్పినా ఆమె పట్టించుకోకపోగా..  ‘మీరు డబ్బులు తీసుకున్నారట కదా’.. అని హేళన చేశారని శకునాల లత, రమ ఆవేదన వ్యక్తం చేశారు. ఆ బిల్డింగ్‌ మేస్త్రీ ప్రగడ నాగబాబుపైనే తమకు అనుమానముంది.. కనీసం ఆయన్ని విచారించమని ఎన్నిసార్లు అడిగినా ఎవ్వరూ పట్టించుకోవడం లేదని, ఇంతకంటే దారుణం ఇంకోటి ఉండదని  ఆ ఇద్దరు మహిళలు సాక్షి వద్ద తమ గోడు వెళ్లబోసుకున్నారు.

నేను మా వాళ్ళకుమరోసారి గట్టిగా చెబుతా –జిల్లా ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ
బాధిత మహిళలు రెండుసార్లు వచ్చి తనను కలిశారని ఎస్పీ రాహుల్‌దేవ్‌ శర్మ అంగీకరించారు. తాను వెంటనే సంబంధిత అధికారులకు చెప్పానన్నారు. మృతదేహం ఉండగానే పోలీసులు పరిశీలిస్తే కేసు విచారణ వేగంగా జరిగేదని, ఇప్పుడు  బాడీ లేదు.. కేవలం వీరి ఆరోపణల మీదే విచారణ చేయాల్సి వస్తోందని తమ అధికారులు అంటున్నారని సాక్షి ప్రతినిధితో మాట్లాడుతూ ఆయన చెప్పారు. మరోసారి సంబంధిత అధికారులకు చెబుతానని, నిందితులు ఎవరైనా వదిలేది లేదన్నారు. స్థానికంగా రాజకీయ ఒత్తిళ్లు ఉన్నాయేమో తెలియదు.. నిక్ష్పక్షపాతంగానే విచారణ చేయిస్తాను. ఇంత ఆలస్యం కావడం సరికాదు.. ఎప్పుడో ఈ కేసు క్లోజ్‌ కావాలని ఆయన వ్యాఖ్యానించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top