ఉద్రిక్తం.. దర్గా స్వాధీన యత్నం

Dargah Hazrat takeover attempt - Sakshi

భవానీపురం హజరత్‌ సయ్యద్‌ గాలీబ్‌ షహీద్‌ దర్గా స్వాధీనానికి వక్ఫ్‌బోర్డు అధికారుల యత్నం

అడ్డుకున్న స్థానికులు

అధికారుల ఘోరావ్‌

భవానీపురం: దర్గాను స్వాధీనం చేసుకునేందుకు వక్ఫ్‌ బోర్డు అధికారులు చేసిన ప్రయత్నాలను స్థానికులు అడ్డుకున్న ఘటన శనివారం జరిగింది. వివరాల్లోకి వెళితే భవానీపురంలో జాతీయ రహదారి పక్కనేగల హజరత్‌ సయ్యద్‌ గాలీబ్‌ షహీద్‌ వక్ఫ్‌బోర్డ్‌ అసిస్టెంట్‌ సెక్రటరీలు అబ్దుల్‌ ఖుద్దూస్, షంషుద్దీన్, ఆదాం షఫీ, డెప్యూటీ సెక్రటరీ షెకామత్‌ సాహెబ్, ఇనస్పెక్టర్లు అలీం, యుహూ అలీషాలు భవానీపురం తహసీల్దార్‌ ఇంతియాజ్‌ పాషా,  పోలీసులను వెంటబెట్టుకుని వచ్చారు. తొలుత దర్గా బయట ఉన్న దర్గా మేనేజ్‌మెంట్‌ కమిటీ ఆఫీస్‌కు తాళాలు వేసేందుకు యత్నించారు.

 దీంతో దర్గా ముజావర్ల కమిటీ సభ్యులు, స్థానిక ముస్లింలు వారిని అడ్డుకున్నారు. పోలీసులు వారిని వారించినా ఆఫీస్‌కు తాళాలు వెయ్యటానికి వీల్లేదంటూ పెద్దఎత్తున నిరసన తెలిపారు. మహిళలు ఆఫీస్‌కు అడ్డంగా నిలబడ్డారు. ముస్లింలందరూ గుమిగూడి ఆందోళన వ్యక్తం చేయటంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. తహసీల్దార్‌ ఇంతియాజ్‌ పాషా, వక్ఫ్‌బోర్డ్‌ అధికారులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో  భవానీపురం సీఐ డీకేఎన్‌ మోహన్‌రెడ్డి ఆందోళన చేస్తున్న వారితో మాట్లాడారు. ఇప్పటికిప్పుడు వచ్చి స్వాధీనం చేసుకుంటామంటే తాము చూస్తూ ఊరుకోమని కమిటీ సభ్యులు తేల్చిచెప్పారు.

 ముఖ్యంగా తాము ఆరాధించే బాబా సమాధిగల గదికి తాళాలు వేసేందుకు ప్రాణాలు పోయినా ఒప్పుకునేది లేదని ఖరాఖండిగా చెప్పారు. సుధీర్ఘ చర్చల అనంతరం తమకు ఐదు రోజుల గడువు కావాలని కమిటీ కోరింది. దీంతో వక్ఫ్‌బోర్డ్‌ ఆదేశాలను అమలు చేయటమే తన డ్యూటీ అని, గడువు విషయం అధికారులు నిర్ణయించుకోవాలని తహసీల్దార్‌ ఇంతియాజ్‌ పాషా చెప్పారు. దీనిపై అధికారులు తర్జనభర్జనపడి చివరికి చేసేది లేక వెనుదిరిగారు. ఒకదశలో స్థానిక ముస్లింలు అధికారులను ఘోరావ్‌ చేశారు. పోలీసులు వారికి రక్షణగా నిలబడి పంపించివేశారు.

జలీల్‌ఖాన్‌ ఆదేశాల మేరకే.. !
భవానీపురం: స్థానిక హజరత్‌ సయ్యద్‌ గాలీబ్‌ షహీద్‌ దర్గా ఆదాయంలో 30 శాతం వక్ఫ్‌బోర్డుకు ఇవ్వాలని వక్ఫ్‌బోర్డ్‌ చైర్మన్‌ జలీల్‌ఖాన్‌ దర్గా ముజావర్ల కమిటీకి మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. దానికి కమిటీ సభ్యులు ఒప్పుకోనందునే శనివారం వక్ఫ్‌బోర్డు అధికారులను దర్గాపైకి పంపారని సమాచారం. వాస్తవానికి దర్గా భూములపై వచ్చే ఆదాయంలో 7 శాతం వక్ఫ్‌బోర్డ్‌కు ట్యాక్స్‌ కింద చెల్లించాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా జలీల్‌ఖాన్‌ 30 శాతాన్ని డిమాండ్‌ చేయటం వెనుక ఉన్న మతలబు ఏమిటంటే 7 శాతాన్ని వక్ఫ్‌బోర్డుకు చెల్లించి మిగిలిన 23 శాతాన్ని తన జేబులోకి వేసుకునేందుకేనని దర్గా కమిటీ సభ్యులు కొందరు తెలిపారు. దర్గా భూములలో సోమా కంపెనీకి ఇచ్చిన లీజు కింద దాదాపు రూ.3 కోట్లు త్వరలో రానున్న నేపథ్యంలోనే 30 శాతం తమకు ఇవ్వాలని జలీల్‌ఖాన్‌ ఇటీవల తెరమీదకు తెచ్చినట్లు తెలిసింది. దర్గా కమిటీని దారిలోకి తెచ్చుకునేందుకే కమిటీని రద్దు చేసేశామని చెప్పటం, ఆ క్రమంలోనే శనివారం అధికారులను పంపించి హడావుడి చేశారని సమాచారం.  

జలీల్‌ఖాన్‌కు అక్షింతలు !
దర్గా వద్ద ఉద్రిక్తత చోటు చేసుకున్న తరుణంలో టీడీపీ నాయకులు ఫతావుల్లా, మాజీ కార్పొరేటర్‌ అబ్దుల్‌ ఖాదర్‌ అక్కడి వచ్చి కమిటీకి మద్దతు పలికారు. దర్గా వద్ద హడావుడి తగ్గిన తరువాత కమిటీ సభ్యులు, స్థానికులు ఎంపీ కేశినేని శ్రీనివాస్‌ దగ్గరకు వెళ్లారు. వారితోపాటు టీడీపీ నాయకులుకూడా వెళ్లారు. సమస్య విన్న కేశినేని శ్రీనివాస్‌ సానుకూలంగా స్పందించి ముస్లిలకు వ్యతిరేకంగా ఏమీ చేయమని, ముఖ్యమంత్రి దృష్టికికూడా తీసుకువెళతానని హామీ ఇచ్చారని కమిటీ సభ్యులు చెప్పారు. కాగా కేశినేని ఈ  విషయాన్ని ఎమ్మెల్సీ తొండెపు జనార్ధన్‌కు చెప్పటంతో ఆయన జలీల్‌ఖాన్‌పై సీరియసై అక్షింతలు వేసినట్లు సమాచారం. ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఈ పిచ్చి పనులేమిటని తీవ్రంగా మందలించినట్లు తెలిసింది.  

వక్ప్‌బోర్డ్‌ కుట్ర ఇది...
వక్ప్‌బోర్డ్‌ను అడ్డంపెట్టుకుని దర్గాకు చెందిన ఆస్తులను కాజేయటానికి చైర్మన్‌ జలీల్‌ఖాన్, డైరెక్టర్లు కుట్ర పన్నారని దర్గా ముజావర్ల కమిటీ అధ్యక్షుడు ముస్తాక్‌ అహ్మద్‌ ఆరోపించారు. వన్‌టౌన్‌ కాళేశ్వరరావు మార్కెట్‌ వద్దగల జుమా మసీదుకు చెందిన స్థలాన్ని ఒక వస్త్ర దుకాణ సంస్థకు అప్పగించి జలీల్‌ఖాన్, డైరెక్టర్లు లబ్ధి పొందుదామనుకున్నారని, అయితే అదికాస్తా బెడిసికొట్టేసరికి దర్గాపై కన్నేశారన్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top