స్తంభం పటిష్టత గాలికెరుక

Current Polls Collapse in YSR Kadapa - Sakshi

చిన్నపాటి గాలికే కూలిపోతున్న విద్యుత్‌ స్తంభాలు

అంధకారంలో మగ్గిపోతున్న పల్లెలు

అధికారుల అవినీతి.. కాంట్రాక్టర్ల దోపిడీతో నాసిరకం స్తంభాలు

సంస్థకు ఏటా కోట్ల రూపాయల నష్టం

కడప అగ్రికల్చర్‌ : కోట్లాది రూపాయలు ఏటా ఖర్చు చేసి విద్యుత్‌ స్తంభాలు తయారు చేస్తున్నారు.  అయితే నాణ్యత ప్రమాణాలు గాలికొదిలేశారు. ఫలితంగా కొద్దిపాటి గాలి, వానలకే  నేలకొరుగుతున్నాయి. దీంతో విద్యుత్‌ సరఫరా ఆగిపోతోంది. గ్రామీణ ప్రాంతాలు అంధకారంలో అలమటిస్తున్నాయి. ఇందులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. పై స్థాయి నుంచి కిందిస్థాయి వరకుడబ్బులు చేతులు మారుతున్నట్లు శాఖలో చర్చ జరుగుతోంది. వారం రోజుల కిందట గాలివానల కారణంగా అల్లకల్లోల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో విద్యుత్‌ స్తంభాల పటిష్టత, భద్రతపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  స్తంభాలు, తీగలు పటిష్టత కోసం ఏటా కోట్లాది రూపాయలు వెచ్చిస్తున్నారు. అయితే  కాసింత గాలివీచినా, వర్షపు చినుకులు రాలినా విద్యుత్‌ సరఫరా ఆగిపోతోంది. అదేమంటే విద్యుత్‌ తీగలు తెగిపడ్డాయని, ట్రాన్స్‌ఫార్మర్లలో ఫీజులు పోయాయని, పెద్దలైన్లు మెలికపడ్డాయని, స్తంభాలు కూలిపోయాయని అధికారులు, సిబ్బంది సాకులు చెబుపుతుండటం నిత్యకృత్యమైపోయింది.

వారం రోజుల కిందట జిల్లాలో వీచిన గాలులకు జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, కొండాపురం, ముద్దనూరు, పోరుమావిళ్ల, బద్వేలు, కాశినాయన, చిన్నమండెం, రైల్వేకోడూరు, అట్లూరు, రాయచోటి, పులివెందుల, లింగాల, ఎర్రగుంట్ల, చెన్నూరు మండలాల్లో కలిపి 1392 స్తంభాలు విరిగిపోగా, 60 కిలో మీటర్ల వైర్లు పనికిరాకుండా పోయింది. మరో 200 ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బతిన్నాయి. దీని కారణంగా విద్యుత్‌ సంస్థకు రూ.3.05 కోట్లు నష్టం వాటిల్లినట్లు అధికారులు నష్ట నివేదికలు తయారు చేశారు. ఇదిలా ఉండగా ఆయా గ్రామాలు మూడు రోజులపాటు అంధకారంలో ఉండిపోయాయి. ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా వ్యవస్థ నిలిచిపోయి ప్రజలు అవస్థలు పడ్డారు. దీనికి ప్రధాన కారణం అధికారుల అవినీతి, అక్రమాలు, విద్యుత్‌ స్తంభాల తయారీ కాంట్రాక్టర్ల ఆశ వల్ల  తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో కమలాపురం, సిద్ధవటం మండల కేంద్రాల్లో ప్రభుత్వ పర్యవేక్షణలో విద్యుత్‌స్తంభాల తయారీ కేంద్రాలుండగా, రాయచోటి, ప్రొద్దుటూరు పట్టణాల్లో ప్రయివేటు ఆద్వర్యం లో ఉన్నాయి. ఇక్కడ తయారు చేసిన స్తంభా లు జిల్లాకు సరఫరా చేస్తున్నారు.  తయారీలో నాణ్యత పాటించకపోవడం వల్లే చిరుగాలి వీచినా  ఒరిగిపోతున్నాయి. దీంతో కోట్లాది రూపాయలు సంస్థకు నష్టంతోపాటు ప్రజల ఆస్తులకు నష్టవాటిల్లుతోంది.

8 మీటర్ల స్తంభాల తయారీకి కంకర 0.139 క్యూబిక్‌ మీటర్లు, ఇసుక 0.0739 క్యూబిక్‌ మీటర్లు, సిమెంటు 73.92 కిలోలు, ఇనుము (హెచ్‌టీ 4 ఎం)10.25 కిలోలు వాడతారు.
9.1 మీటర్ల స్తంభాల తయారీలో కంకర 0.237 క్యూబిక్‌ మీటర్లు, ఇసుక 0.126 క్యూబిక్‌ మీటర్లు, సిమెంటు 126.5  కిలోలు, ఇనుము (హెచ్‌టీ 4 ఎం) 16 కిలోలు వాడుతున్నట్లు అధికారులు తెలిపారు. 8 మీటర్ల స్తంభం తయారీకి రూ.2000 ఖర్చు అవుతుందని, అదే 9.1 మీటర్ల స్తంభం తయారీకి రూ.3600 అవుతుందని చెబుతున్నారు. విద్యుత్‌ స్తంభాలు తయారు చేసే సంస్థలు సరైన పరిమాణంలో సిమెంటు, ఇనుము, కంకర వాడడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. పొలాల్లో సేద్యాలకు ఇబ్బందికరంగా ఉన్నాయంటూ స్తంభాలకు సపోర్టుగా ఉన్న స్టే వైర్లను రైతులు తొలగించడం వల్లనే వాలిపోతున్నాయని అధికారులు సాకు చూపుతున్నారే ఆరోపణలు ఉన్నాయి. అయినా కూడా వీటిని సరిచేయాలనే ధ్యాస అధికారులకు లేదనే విమర్శలున్నాయి.
ఒక్కో సెక్షన్‌ ఆఫీసర్‌ పరిధిలో 3 నుంచి 6 సబ్‌స్టేషన్లు ఉండడంతో పర్యవేక్షణ భారంగా మారిందని అధికారులు చెబుతున్నారు. ఇది ఇలా ఉండగా ఒకటి రెండు సబ్‌స్టేషన్లు మినహా ఇతర ప్రాంతాల్లో ఏడీఈలు, ఏఈలు ఫ్రీ మాన్‌సూన్‌ ఇన్‌స్పెక్షన్‌ పనులు చేపట్టడం లేదు. ఫలితంగా  సరఫరా ఆగిపోతుండడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  

స్తంభం ఎక్కేవారేరీ?
విద్యుత్‌ లైన్లలో సాంకేతిక సమస్య తలెత్తినప్పుడు స్తంభం ఎక్కేవారు కరువయ్యారు. ట్రాన్స్‌ఫార్మర్లలో ఫీజులు వేయాలన్నా, ఇన్సులేటర్లు, డిస్కులు మార్చాలన్నా, చుట్టాలన్నా సిబ్బంది ఉండడం లేదు.   హెల్పర్లు, లైన్‌మెన్లు, అసిస్టెంట్‌ లైన్‌మెన్లు స్తంభాలు ఎక్కలేకపోతున్నారు. తప్పదనిపిస్తే ఇలాంటి పనులను ప్రయివేటు వ్యక్తులతో చేయిస్తున్నారు.  
ఏటా మార్చి, ఏప్రిల్, మే నెలల్లో విద్యుత్‌శాఖ అధికారులు ఫ్రీ మాన్‌సూన్‌ ఇన్‌స్పెక్షన్‌(పీఎం) నిర్వహించాలి. ఇందుకోసం ఒక్కో డివిజన్‌కు రూ.50 లక్షల వరకు ఖర్చు చేస్తారని అంచనా. రుతుపవనాలు, గాలి దుమారాలు రాకముందే విద్యుత్‌ స్తంభాలు, లైన్ల పటిష్టత పనులు పూర్తి చేయాలి. ఇందులో భాగంగా అన్ని లైన్లకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలి. అయితే కొమ్మలు తొలగించడానికి, ఇతర మరమ్మతులకు నిధులు మంజూరు చేయకపోవడంతో ఆ భారం అధికారులపై పడుతోందని అంటున్నారు. అయినా కూడా పల్లెల్లో ఆయా పనులు చేపట్టడంలేదనే విమర్శలు వెలువెత్తుతున్నాయి.

నాణ్యత విషయంలో  రాజీ పడేదిలేదు..:
విద్యుత్‌ స్తంభాల నాణ్యత ప్రమాణ విషయంలో రాజీపడం. దగ్గర ఉండి ఇసుక, సిమెంటు, కంకర, ఇనుప కడ్డీలు తగు పరిమాణంలో ఉన్నాయా? లేదా? అని పరీక్షించిన తర్వాతే తయారీకి అనుమతులు ఇస్తాం. ఇందులో ఎలాంటి ప్రలోభాలకు లొంగేదిలేదు.–మధుసూదన్‌రావు, ఏడీఈ,నిర్మాణరంగం, జిల్లా విద్యుత్‌శాఖ.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top