మరో రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న అల్పపీడన, ఉపరితల ద్రోణుల ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది.
విశాఖపట్నం: మరో రెండు రోజులపాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కొద్ది రోజులుగా కొనసాగుతున్న అల్పపీడన, ఉపరితల ద్రోణుల ప్రభావం కాస్త తగ్గుముఖం పట్టింది. దీంతో ఉష్ణోగ్రతలు ఊపందుకుంటున్నాయి. రెండు రాష్ట్రాల్లో సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. ఉష్ణోగ్రతల పెరుగుదలతో నీటిలో ఆవిరి శాతం ఎక్కువై ఆకాశంలో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతున్నాయి. వీటి ఫలితంగా అకాల వర్షాలు, ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయి. వచ్చే రెండు రోజుల్లో ఉత్తరకోస్తా, కోస్తాంధ్రలతో పాటు రాయలసీమ, తెలంగాణల్లో ఒకటీ రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు శుక్రవారం రాత్రి తెలిపారు.
కోస్తాంధ్ర కంటే రాయలసీమ, తెలంగాణల్లో వర్షాల ప్రభావం ఒకింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. రెండు రోజుల తర్వాత పరిస్థితిలో మార్పు రావచ్చని అంచనా వేస్తున్నారు. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో ఉష్ణతాపం ఎక్కువగానే నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌లోని నందిగామ, కర్నూలుల్లో అత్యధికంగా 42 డిగ్రీలు, తెలంగాణలోని మహబూబ్‌నగర్, నిజామాబాద్‌లలో 43 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. రాయలసీమలో ఆరోగ్యవరం(37), కడప (39) మినహా మిగిలిన ప్రాంతాల్లోను, తెలంగాణలో మెదక్ (39), హకీంపేట(38)ల్లో తప్ప మిగతా చోట్ల 40 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.