ఆపరేషన్ ఏరివేత | Culling operation | Sakshi
Sakshi News home page

ఆపరేషన్ ఏరివేత

Sep 13 2014 1:51 AM | Updated on Sep 2 2017 1:16 PM

ఆపరేషన్ ఏరివేత

ఆపరేషన్ ఏరివేత

ఆధార్ సీడింగ్ పేరుతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆప‘రేషన్ ఏరివేత’ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నారు. కారణమేదైనా ఆధార్ కార్డు ఇవ్వకపోతే బోగస్ కార్డుల కింద భావించి రేషన్ సరుకుల సరఫరాను నిలిపివేస్తున్నారు.

  •     ఆధార్ సీడింగ్ పేరుతో5,36,102 మందికి రేషన్ కట్
  •      2,144 టన్నుల బియ్యం కోత
  •      పేదలకు ఇబ్బందులు
  •      సరుకుల్లోనూ కుదింపు
  •      రేషన్ షాపు యజమానులకూ కష్టకాలం
  • మచిలీపట్నం : ఆధార్ సీడింగ్ పేరుతో పౌరసరఫరాల శాఖ అధికారులు ఆప‘రేషన్ ఏరివేత’ కార్యక్రమాన్ని   విజయవంతంగా అమలు చేస్తున్నారు. కారణమేదైనా ఆధార్ కార్డు ఇవ్వకపోతే బోగస్ కార్డుల కింద భావించి రేషన్ సరుకుల సరఫరాను నిలిపివేస్తున్నారు. ఈ విధంగా రెండు నెలల నుంచి సేకరించిన సమాచారం మేరకు ఇప్పటి వరకు 5లక్షల మందికి పైగా లబ్ధిదారులకు సరుకుల సరఫరా నిలిపివేశారు. దీంతో జిల్లా వ్యాప్తంగా పేదలు అల్లాడుతున్నారు.

    కార్డులు జారీ చేసినప్పుడు తెలియదా.!

    జిల్లాలో 11,23,944 తెల్ల రేషన్‌కార్డులు ఉన్నాయి. ఆయా కార్డుల్లో 37,10,501 మంది సభ్యులు ఉన్నారు. ఇప్పటి వరకు 31,37,710 మందికి సంబంధించిన ఆధార్‌కార్డుల సీడింగ్ పూర్తి చేశారు. వారిలో 5,36,102 మందిని అనర్హులుగా గుర్తించినట్లు అధికారులు తెలిపారు. వీరందరికీ నెలకు నాలుగు కిలోల చొప్పున ఇప్పటి వరకు బియ్యం కేటాయిస్తూ వచ్చారు. ఈ నెలలో అనర్హులుగా గుర్తించిన వారికి రేషన్ బియ్యం నిలిపివేయడంతో దాదాపు 2,144 టన్నుల బియ్యం మిగిలిపోయాయి. అన్ని రేషన్‌కార్డులకు ఆధార్ సీడింగ్ పూర్తయితే అనర్హుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పౌరసరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు.

    ఆధార్ సీడింగ్‌కు ఇప్పటి వరకు రాని రేషన్‌కార్డుల్లో ఎక్కువ శాతం బోగస్‌వేనని భావిస్తున్నారు. కొంతమందికి మాత్రమే ఆధార్ కార్డులు ఇంకా అందలేదని చెబుతున్నారు. ఇప్పటి వరకు బోగస్ కార్డులు తమ వద్దే పెట్టుకుని ప్రతి నెలా రేషన్ పొందుతున్న డీలర్ల ఆటలు ఇక సాగవని అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు బోగస్ కార్డుల వ్యవహారం అధికారులకు తెలియదా.. మంజూరు చేసే సమయంలో నిబంధనలు పాటించలేదా.. అని లబ్ధిదారులు మండిపడుతున్నారు.
     
    ఎంఎల్‌ఎస్ పాయింట్ల కంప్యూటరీకరణ

    జిల్లా వ్యాప్తంగా 17ఎంఎల్‌ఎస్ పాయింట్లు ఉన్నాయి. ఇప్పటి వరకు రేషన్ విడుదల, రికార్డులు రాయడం తదితర ప్రక్రియలు మాన్యువల్‌గానే జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎంఎల్‌ఎస్ పాయింట్ల వద్ద అనేక అవకతవకలకు అవకాశం ఉంటోంది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఎంఎల్‌ఎస్ పాయింట్లను కంప్యూటరీకరించేందుకు రంగం సిద్ధమైంది.

    ఎంఎల్‌ఎస్ పాయింట్లలో కంప్యూటర్లను, ఆపరేటర్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సివిల్ సప్లయిస్ జిల్లా మేనేజరు సింగ్ తెలిపారు. ఇప్పటికే తహశీల్దార్ కార్యాలయాల్లో రేషన్ డీలర్ల వద్ద ఉన్న స్టాకు వివరాలను ఈ-పీడీఎస్ పద్ధతి ద్వారా సేకరిస్తున్నామని ఆయన తెలిపారు. ఈ పద్ధతి ద్వారా ఒక్కో రేషన్ షాపునకు ప్రతి నెలా ఎంత  మేర సరుకులు కేటాయించాలనేది నిర్ణయిస్తున్నట్లు చెప్పారు. డీలర్ల వద్ద నిల్వలు మినహాయించి మిగిలిన సరుకులను ఇస్తున్నట్లు ఆయన చెప్పారు.
     
    మిల్లర్లకు ఇబ్బందులు!

    కేంద్ర ప్రభుత్వం లేవీ బియ్యం కిలో రూ.26 చొప్పున కొనుగోలు చేసి కార్డుదారులకు సరఫరా చేస్తుంది. బోగస్ కార్డుల ద్వారా ఆ బియ్యం పొందిన డీలర్లు వాటిని మిల్లర్లకు రూ.16 చొప్పు విక్రయించడం, మిల్లర్లు అవే బియ్యాన్ని ఎఫ్‌సీఐకి మళ్లీ రూ.26 లేవీ బియ్యంగా విక్రయించడం జరుగుతోంది. ఈ నెలలో 2,144 టన్నుల బియ్యం కోత విధించడంతో మిల్లర్లు కూడా మండిపడుతున్నారు.
     
    నాలుగు సరుకులు మాత్రమే

    గతంలో అమ్మహస్తం పథకం ద్వారా తొమ్మిది రకాల సరుకులను రేషన్ షాపుల ద్వారా పంపిణీ చేసేవారు. ఆరు నెలలుగా కేంద్ర ప్రభుత్వం పామోలిన్‌పై సబ్సిడీ ఎత్తివేయడంతో రేషన్ షాపుల్లో పంపిణీ చేయడంలేదు. కార్డులో పేరు ఉన్న సభ్యునికి నాలుగు కిలోల బియ్యంతోపాటు ఒక్కో కార్డుకు అర కిలో పంచదార, లీటరు కిరోసిన్ మాత్రమే పంపిణీ చేస్తున్నారు. పెరిగిన ధరలకు బయట కొనుగోలు చేయలేక పేదలు ఇబ్బందులు పడుతున్నారు.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement