ఆ.. భవనం కూల్చివేతపై ఉత్తర్వులను రద్దు చేయండి

CRDA Commissioner Appeal To High Court - Sakshi

సీఆర్‌డీఏ కమిషనర్‌ అప్పీల్‌

ఆ నిర్మాణం అక్రమ కట్టడం

నదికి 100 మీటర్ల లోపు నిర్మాణాలపై నిషేధం ఉంది

నేడు విచారిస్తామన్న ధర్మాసనం

సాక్షి, అమరావతి : కృష్ణానది కరకట్ట సమీపంలో రైతు సంఘం భవన్‌ పేరుతో నిర్మించిన కట్టడం కూల్చివేత నిమిత్తం తాము జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వుల అమలును నిలిపేస్తూ సింగిల్‌ జడ్జి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై సీఆర్‌డీఏ కమిషనర్‌ అప్పీల్‌ దాఖలు చేశారు. సింగిల్‌ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. ఈ అప్పీల్‌పై మంగళవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ చాగరి ప్రవీణ్‌కుమార్, న్యాయమూర్తి జస్టిస్‌ మల్లవోలు సత్యనారాయణమూర్తితో కూడిన ధర్మాసనం విచారణ జరపనుంది. ‘ఏదైనా వ్యవహారంలో ప్రత్యామ్నాయ మార్గాలు లేనప్పుడు.. సహజ న్యాయ సూత్రాల ఉల్లంఘన జరిగినప్పుడు మాత్రమే దాఖలు చేసే వ్యాజ్యాల విషయంలో ఉన్నత న్యాయస్థానాలు తమ విచక్షణాధికారాలను ఉపయోగించవచ్చు. నోటీసులు జారీ చేసిన అభ్యంతరాలు ఆహ్వానించిన దశలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. పిటిషనర్‌ సీఆర్‌డీఏ చట్ట ప్రకారం జారీ చేసిన షోకాజ్‌ నోటీసుకు వ్యతిరేకంగా పిటిషన్‌ దాఖలు చేశారు. కృష్ణానది పరీవాహక ప్రాంత పరిధిలో నిర్మించిన కట్టడం న్యాయ సమ్మతమైందని పిటిషనర్‌ చూపలేకపోయారు.

రాజధాని ప్రాంత పరిధిలో అభివద్ధిని క్రమబద్ధీకరించే విషయంలో సీఆర్‌డీఏకు అన్నీ అధికారాలున్నాయి. నదికి 100 మీటర్లలోపు నిర్మాణాలు చేపట్టడంపై స్పష్టమైన నిషేధం ఉంది. 2007లో ఈ మేర జీవో కూడా జారీ అయింది. పిటిషనర్‌ ఏ కట్టడం గురించి అయితే చెబుతున్నారో, ఆ కట్టడానికి ఎటువంటి అనుమతులు లేవు. పర్యావరణాన్ని ఫణంగా పెట్టి నిర్మించిన అక్రమ కట్టడాలకు క్రమబద్ధీకరణను సాకుగా చూపడం తగదు. ఈ విషయాలన్నింటినీ సింగిల్‌ జడ్జి పరిగణనలోకి తీసుకుని ఉండాల్సింది.   ఏ కోణంలో చూసినా కూడా సింగిల్‌ జడ్జి జారీ చేసిన మధ్యంతర ఉత్తర్వులు చట్ట విరుద్ధం. అందువల్ల వాటిని రద్దు చేయండి.’ అని సీఆర్‌డీఏ కమిషనర్‌ తన అప్పీల్‌లో పేర్కొన్నారు. ఈ అప్పీల్‌ గురించి అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ) ఎస్‌.శ్రీరామ్‌ సోమవారం ఉదయం ఏసీజే నేతత్వంలోని ధర్మాసనం ముందు ప్రస్తావించారు. దీంతో ధర్మాసనం ఈ అప్పీల్‌పై మంగళవారం విచారణ జరిపేందుకు అంగీకరించింది. రైతు సంఘం భవనం పేరుతో నిర్మించిన తమ కట్టడాన్ని అక్రమ కట్టడంగా పేర్కొంటూ, దానిని తొలగించే నిమిత్తం సీఆర్‌డీఏ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వులను సవాలు చేస్తూ చందన కేదారీష్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై గత వారం విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి జస్టిస్‌ దుర్గాప్రసాదరావు, సీఆర్‌డీఏ జారీ చేసిన ప్రాథమిక ఉత్తర్వుల అమలును మూడు వారాల పాటు నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top